Apr 15,2023 07:45

         విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనునిత్యం వంచనలకు పాల్పడుతూనేవుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఏకంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న మోడీ సర్కార్‌ ఇప్పటికే పోర్టులు, విమానశ్రయాలు, జాతీయ రహదారులు, అంతరిక్షయానం, రక్షణ రంగం నింగి నేలా హద్దే లేకుండా క్రోనీ మిత్రులకు కట్టబెట్టేస్తోంది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి), ఐడిబిఐ వంటి విత్త సంస్థలనూ పప్పులు బెల్లాల్లా కారుచౌకగా పంచేస్తోంది. పోరాటాలు, త్యాగాలతో పురుడుపోసుకొని తెలుగు ప్రజల జీవనగమనంలో మమేకమైన విశాఖ ఉక్కుపైనా కేంద్ర ప్రభుత్వం తన తుక్కు చేష్టలను కొనసాగిస్తోంది. తాజాగా ప్రయివేటీకరణ నుంచి వెనక్కి తగ్గినట్టు కొత్త నాటకానికి తెరలేపి.. అబ్బే అదంతా ఉత్తిదే అంటూ మరోమారు నిస్సిగ్గుగా వంచనకు పాల్పడటం అమానుషం. ఈ నెల 13న విశాఖపట్టణంలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే విశాఖ ఉక్కును రాత్రికి రాత్రే ప్రయివేటీకరణ చేసేయ్యబోమంటూ నిండు సభలో బహిరంగ ప్రకటన చేశారు. అదే రోజు సాయంత్రం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు ఆయనను కలిసి ప్రయివేటీకరణ కోసం వేసిన అధ్యయన కమిటీలను రద్దు చేయండంటూ విన్నవిస్తే ..ప్రయివేటీకరణ అంశం నా ఒక్కడి చేతిలోనిది కాదంటూ ఉదయం చెప్పిన మాటలకు విరుద్ధంగా కులస్తే కుచ్చుటోపి పెట్టారు. జనాలను నమ్మించడానికి బయట ఏవేవో చెబుతాం..అవన్నీ సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అన్నట్టుంది ఆయన తీరు. కులస్తేతో కేంద్రం ఆడించిన ఈ నాటకంపై మీడియాలో కథనాలు రావడంతో విశాఖ ఉక్కు చట్టూ అలజడి మొదలైంది. దీంతో ఇదేదో తిరకాసు వ్యవహారంగా మారుతోందని భావించిన కేంద్ర ఉక్కు శాఖ ..విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణ ఆగే ప్రసక్తే లేదని ప్రకటించి తన గోముఖం చాటునున్న వ్యాఘ్ర రూపాన్ని బయటపెట్టుకుంది.
        మతోన్మాదాన్ని రాజేసి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం..ఆర్థిక భారాలు మోపి వారిని మరింత కుంగదీయడం, కష్టాల ఊబిలో జనం విలవిల్లాడుతుంటే..అడిగేవాడ్వెడూ ఉండడని ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెట్టే దుర్మార్గపు కుట్రకు మోడీ సర్కార్‌ పెట్టుకున్న ముద్దు పేరే డిజిన్వెస్ట్‌మెంట్‌. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే నిండా ముంచిన మోడీ సర్కార్‌ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణనైనా తక్షణం విరమించుకోవాలి. కులస్తే ప్రకటనతో.. చూశారా కేంద్రానికి రాష్ట్రంపై ఎంత ప్రేమో! అంటూ గొప్పలకు పోయిన బిజెపి రాష్ట్ర నాయకుల పరిస్థితి ఒక్క రోజు గడవకముందే కుడితిలో పడిన ఎలుక చందంగా తయారైంది. కేంద్ర మంత్రి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా కేంద్రం తీరుపై తన వైఖరిని స్పష్టం చేయాలి. వంచనకు పాల్పడిన బిజెపి పంచనే కొనసాగుతారో..బయటకు వచ్చి ద్రోహాన్ని నిలదీస్తారో? ఆయనే తేల్చుకోవాలి. విశాఖ స్టీల్‌ను ప్రయివేటుకు కట్టబెట్టడంలో నిమగమైవున్నది కేంద్ర ప్రభుత్వమే అని తెలిసినా..కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాలం వెళ్ల దీస్తున్న టిడిపి కూడా విశాఖ విషయంలో పునారాలోచన చేయాల్సిన అవసరం ఉంది.
         విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ప్రక్రియను ప్రకటించినా కేంద్రం వేగంగా ముందుకెళ్లలేక పోవడానికి రెండేళ్లుగా రాష్ట్ర ప్రజల మద్దతుతో కార్మికవర్గం సాగిస్తున్న పోరాటమే కారణం. దీర్ఘకాలిక ఐక్య పోరాటాలతోనే మోడీ సర్కార్‌ను వెనక్కికొట్టడం సాధ్యమని ఢిల్లీ రైతు ఉద్యమం పాఠం నేర్పింది. అదే మన ముందున్న మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలనూ, కార్మిక సంఘాలనూ సంప్రదించి, ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అని నినదించి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా కేంద్రం మెడలు వంచాలి.