Nov 14,2023 11:05
  • రాష్ట్రపతికి గవర్నరు బోర్డును రద్దు చేసే అధికారం
  • ఐఐఎం డైరెక్టర్‌ నియామకంలో విజిటర్‌ దే తుది నిర్ణయం
  • కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నోటిఫై 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో రాష్ట్రపతి ఇప్పుడు 'విజిటర్‌'గా ఉండాలనే కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్ల ఛైర్మన్‌ను నియమించే అధికారాలు, డైరెక్టర్ల నియామకం, తొలగింపు, దాని విధులను నిర్వర్తించడంలో అసమర్థత కారణంగా బోర్డును రద్దు చేయడం, 'విజిటర్‌' ఇచ్చిన ఏదైనా నిర్దేశాన్ని పాటించడంలో ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం డిఫాల్ట్‌ చేయడం వంటి అధికారాన్ని కట్టబెట్టింది.
         2018 ఐఐఎం నిబంధనలను మరింత సవరించడానికి తీసుకొచ్చిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (సవరణ) రూల్స్‌-2023 ఈ ఏడాది జులైలో పార్లమెంటులో ఆమోదించ బడింది. నిబంధనలు, షరతులను పేర్కొంటూ నవంబరు 11న గెజిటెడ్‌ నోటిఫికేషన్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పుడు ప్రతి ఐఐఎం 'విజిటర్‌' అయిన రాష్ట్రపతికి, విధాన నిర్ణయాలు తీసుకోవడం, వార్షిక బడ్జెట్లను ఆమోదించడం, ఫీజులను నిర్ణయించడం వంటి నిర్ణయాలు తీసుకునే ప్రతి ఐఐఎం ప్రధాన కార్యనిర్వాహక సంస్థ అయిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్ల ఛైర్మన్‌ను నామినేట్‌ చేసే పూర్తి అధికారం ఉంటుంది. కొత్త డైరెక్టర్ల నియామకాల కోసం శోధన ప్యానెల్‌ (సెర్చ్‌ కమిటీ)లను నియమించే అధికారం ఉంటుంది.
            అంతకముందు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, నిర్వహణ నిపుణుల నుండి ఐదుగురు ప్రముఖులతో కూడిన సెర్చ్‌-కమ్‌-సెలక్షన్‌ కమిటీని బోర్డు ఏర్పాటు చేసేది. కొత్త నిబంధనల ప్రకారం, విజిటర్‌కు ఇప్పుడు బోర్డును ఏ సమయంలోనైనా రద్దు చేసే అధికారం ఉంటుంది. బోర్డు విధులను నిర్వర్తించడం సాధ్యం కాదని విజిటర్‌ భావిస్తే, రద్దు చేయవచ్చు. 'విజిటర్‌ ఉత్తర్వు ద్వారా బోర్డును రద్దు చేసి, ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను తాత్కాలిక బోర్డుకు ఛైర్మన్‌గా, సభ్యులుగా నియమించవచ్చు. అటువంటి కాలానికి, ఆరు నెలలకు మించకుండా ఉండాలి' అని నోటిఫికేషన్‌ పేర్కొంది. ఇంతకముందు, బోర్డు రద్దుకు అటువంటి నిబంధన లేదు. కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా ఐఐఎం డైరెక్టరు నియామకంలో విజిటర్‌దే తుది నిర్ణయం. 'బోర్డు సిఫార్సు చేసిన పేర్లలో ఒకదానిని విజిటర్‌ నామినేట్‌ చేయాలి. వ్యక్తిని డైరెక్టరుగా నియమించడం కోసం బోర్డుకు పంపాలి. బోర్డు సిఫార్సు చేసిన పేర్లతో విజిటర్‌ సంతృప్తి చెందకపోతే, విజిటర్‌ అడిగితే, బోర్డు తాజా సిఫార్సులు చేస్తుంది' అని పేర్కొంది.
           ఇంతకముందు డైరెక్టరు నియామకానికి పూర్తిగా బోర్డు బాధ్యత వహించేది. విజిటర్‌కు ఇప్పుడు డైరెక్టర్‌ సేవలను రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. 'ఈ విజిటర్‌ డైరెక్టర్‌ సేవలను రద్దు చేయవచ్చని లేదా డైరెక్టర్‌ను ఇన్‌స్టిట్యూట్‌ సేవల నుండి తప్పించవచ్చని నిర్ణయించుకుంటే, బోర్డు నిర్ణయాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉంటుంది' అని నోటిఫికేషన్‌ పేర్కొంది. ఐఐఎం రూల్స్‌ 2018 ప్రకారం, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్లకు మాత్రమే మూడింట రెండు వంతుల సభ్యులు హాజరై ఓటింగులో ఉండాలి. బోర్డులోని 50 శాతం కంటే ఎక్కువ మంది సభ్యులతో డైరెక్టరును తొలగించే అధికారం ఉంది. కొత్త నిబంధనలు ఐఐఎం డైరెక్టరుకు పిహెచ్‌డి, బ్యాచ్‌లర్‌, మాస్టర్స్‌ స్థాయిల్లో ఫస్ట్‌ క్లాస్‌ డిగ్రీలు విద్యార్హతలను' నోటిఫికేషన్‌లో పేర్కొంది.