
గ్రంథాలయ వ్యవస్థ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమం నుండి పుట్టింది. ప్రభుత్వ విధానాల మూలంగా ఆ వ్యవస్థ నేడు నిర్వీర్యమైపోతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కేంద్ర గ్రంథాలయం లేకుండా పోయింది. పౌర గ్రంథాలయాల రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరి లోని ఒక శాఖా గ్రంథాలయంలో నడుపుతున్నారు. గ్రంథాలయాలలో రిక్రూట్‌మెంట్‌పై ఆంక్షలు విధిస్తూ 1975లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆంక్షలు సడలిస్తూ కొంత రిక్రూట్‌మెంట్ జరిగింది. కానీ ఇప్పటికీ నియామకాలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా సిబ్బంది నియామకాలపై ఆంక్షలు తొలగించలేదు. రాష్ట్రంలో మంజూరైన 1735 పోస్టులకు గాను ప్రస్తుతం కేవలం 723 రెగ్యులర్ సిబ్బంది మరో 216 ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. ఒక్కో లైబ్రేరియన్ రెండు మూడు గ్రంథాలయాలు నడుపుతున్నారు. కొన్ని గ్రంథాలయాలలో స్వీపర్లు లైబ్రేరియన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రంథాలయాల్లో 1012 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగు సంవత్సరాల 5 నెలల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం ఒక్క నియామకం కూడా చేయకపోవడాన్ని బట్టి గ్రంథాలయాల పట్ల ప్రభుత్వ వైఖరి స్పష్టం అవుతున్నది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు అందుకు గ్రంథాలయాలనే ఉపయోగించుకుంటున్నారు. కానీ అత్యధిక గ్రంథాలయాలలో చదువరులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన వసతి, ఫర్నిచర్, పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు.
ఇంటర్నెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రంథాలయాలకు భవిష్యత్తు లేదనే వాదన కొంతమందిలో ఉన్నా అది సరైనదని అనుకోలేం. ఎందుకంటే పరిపూర్ణమైన జ్ఞానం, అవగాహన రావాలంటే ఈనాటికీ పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయాన్ని అనేకమంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు అది వాస్తవం కూడా. గ్రంథాలయాల నిర్వహణకు ప్రధాన వనరు గ్రంథాలయ సెస్సు మాత్రమే.పౌరులు చెల్లిస్తున్న ఇంటి పన్నులో ఎనిమిది శాతం గ్రంథాలయాలకు సెస్సు రూపంలో చేరాలి. కానీ వసూలు చేస్తున్న సొమ్ము కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు...జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించకుండా మొండికేస్తున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం కార్పొరేషన్ సుమారు రూ.100 కోట్లు బకాయి పడింది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ లాంటి పొరుగు రాష్ట్రాలు గ్రంథాలయాల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో కనీసం గానైనా మన ప్రభుత్వాలు చూపించకపోవడం అన్యాయం. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఇంకో న్యాయం అన్నట్టు గ్రంథాలయాల సిబ్బంది పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. లైబ్రేరియన్‌గా చేసి ప్రమోషన్ పై జిల్లా అధికారి (కార్యదర్శి) అయిన వారికి 010 పద్దు కింద జీతాలు, సదుపాయాలు కలగజేస్తూ మిగిలిన వారికి లేకుండా చేయడం బాధాకరం. 5000 జనాభాకు ఒక గ్రంథాలయం ఉండాలని గ్రంథాలయ చట్టం చెబుతున్నా ఆచరణలో అమలు కాలేదు సరికదా ఉన్న గ్రంథాలయాలు మూసివేసే పరిస్థితి దాపురించడం బాధాకరం. ఈ వారోత్సవాల (నవంబర్ 14 నుండి 20 వరకు) సందర్భంగానైనా గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పౌరులు, చదువరులు, విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు.
- కె. త్రిమూర్తులు,
జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు.