జీడి పిక్కల ధర పాతాళానికి పడిపోయి రైతులు, విచ్చలవిడి దిగుమతులు, పప్పునకు తగిన ధర లేదంటూ పరిశ్రమలను మూసివేయడంవల్ల వాటిలో పని చేసే కార్మికులూ ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఈ సమయంలో జీడి సమస్యపై స్పందించి, సంబంధిత అంశాలను విశ్లేషించడం తద్వారా ప్రభుత్వాల దృష్టిని రాబట్టి బాధితులకు కొంతైనా ఊరట కలిగించేందుకు కృషి చేయడం మీడియా బాధ్యత. అయితే, ఇటీవల రెండు ప్రముఖ తెలుగు దిన పత్రికలు 'జీడి రైతు గుర్తున్నాడా?', 'జీడిపై చీడ రాతలు' అంటూ రాసిన కథనాలు పరిశీలిస్తే రైతులు, కార్మికుల ప్రస్తుత దుస్థితికి కారణాలు లేదా తక్షణ ఉపశమన చర్యల కన్నా తాము కొమ్ము కాసే రాజకీయ పార్టీలు, ఆ ప్రభుత్వాలను పొగడడానికి లేదంటే తెగనాడడంపైనే కేంద్రీకరించడం గమనార్హం. విచ్చలవిడి దిగుమతులకు, ధరల ఒడిదుడుకులకు ప్రధాన కారణమైన కేంద్ర ప్రభుత్వం, దాని విధానాలపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం దారుణం. జీడి దేశవ్యాప్తంగా తీర ప్రాంతమంతటా పండించే పంట కనుక వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి, ఆయా ప్రభుత్వాల తీరు కూడా వివరిస్తే బాగుండేది.
పంట తీరు తెన్నులు
దేశంలోని సముద్ర తీర రాష్ట్రాల్లో జీడి పంట సాగు చేస్తున్నారు. అయితే, సాంప్రదాయ ప్రాంతాల్లోనేగాక ఆ తరువాత గిరిజన ప్రాంతాల్లోనూ జీడి సాగు పెరిగింది. వాటిలో కొన్ని అటవీశాఖ వేసిన తోటలు కాగా ఎక్కువ భాగం గిరిజనులు, కొండ వాలు ప్రాంతాల్లో ఇతర పేదలు సాగు చేస్తున్నవే. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. అదే విధంగా జీడి పప్పు ప్రోసెసింగ్ పరిశ్రమలోనూ కేరళ తరువాతి స్థానం ఆంధ్రదే. కాబట్టి అటు రైతును, ఇటు కార్మికులను ఆదుకునేందుకు, అలాగే పరిశ్రమకు చేయూతనివ్వడానికి కృషి చెయ్యడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ విషయంలో అటు టిడిపి, ఇటు వైసిపి సర్కార్లు చేసింది స్వల్పమే అని చెప్పక తప్పదు. తిత్లీ తుపాను బాధిత రైతాంగానికి నష్టపరిహార చెల్లింపు విషయంలో గత ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఆందోళనలు సాగాయి. ఆ తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం చెల్లించింది. అయితే, నష్టం జరిగినపుడు పరిహారం ఇవ్వడం మాత్రమే చాలదు.
రాష్ట్రం విస్తీర్ణం ఉత్పత్తి
(వేల హెక్టార్లు) (వేల మె. టన్నులు)
ఆంధ్ర ప్రదేశ్ 197.92 127.72
ఒడిషా 223.45 121.28
కర్ణాటక 138.00 74.86
మహారాష్ట్ర 191.45 189.71
తమిళనాడు 173.24 77.30
కేరళ 106.52 71.76
భారత్ 1183.91 751.85
(ఆధారం: కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ కాష్యు అండ్ కోకో డెవలప్‌మెంట్-2021-22 లెక్క)
- పంటకు ప్రోత్సాహాం ప్రభుత్వాల తీరు
జీడి పంట విస్తీర్ణం, జీడిపప్పు ప్రోసెసింగ్‌లో ఒకప్పుడు దేశంలో కేరళ మొదటి స్థానంలో ఉండేది. కానీ వివిధ రాష్ట్రాల్లో సాగు పెంపుదలకు ఆయా ప్రభుత్వాలు చేసిన కృషి మూలంగా అక్కడ పెరిగినందున ఇప్పుడు విస్తీర్ణంలో కేరళ ఆరవ స్థానానికి పోయింది. ప్రోసెసింగ్‌లో మొదటి స్థానమే! గత ఆరేళ్లుగా అక్కడి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పంట విస్తీర్ణం, దిగుబడి పెంచడానికి వివిధ చర్యలు, పథకాలు చేపట్టింది. జీడి పంట అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి బోర్డు పని చేస్తోంది. అలాగే పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు అంటే జీడి పిక్కలను రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో అలాగే విదేశాల నుండి కొనుగోలు చేసేందుకు ఒక కార్పొరేషన్, పరిశ్రమలను నిర్వహించడం, జీడిపప్పు మార్కెటింగ్ కోసం మరో రెండు వేర్వేరు కార్పొరేషన్లున్నాయి. ఇన్ని విధాలుగా అక్కడి ప్రభుత్వం రైతులకు, కార్మికులకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో పంట అభివృద్ధికి పరిశోధనా సంస్థ లేదా ప్రభుత్వ బోర్డులున్నాయి. కానీ ఎ.పి లో మాత్రం కేవలం ఉద్యానవన శాఖ అన్ని పంటలతోపాటు జీడి గురించి 'కూడా' పని చేస్తుంది. గతంలో హుదూద్ తుపాను వచ్చినపుడు కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తరువాత తిత్లీ తుపాను వచ్చినపుడు ఆయనే జీడి కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ హామీలు నీటి మూటలయ్యాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా ఆ దిశగా ఏమీ చేయలేదు. తాజాగా రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ కమిషనర్ స్థాయి అధికారులు జిల్లాలో పర్యటించి పరిశీలించారు కానీ ఏమీ ఆచరణలోకి రాలేదని ప్రజల ముందు ఒప్పుకోవలసి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్రంలో జీడి రైతును, కార్మికులను ఆదుకునేందుకు, పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- దక్కని ధరా ఆర్‌బికె, జిసిసిల పాత్ర
గతంలో రూ.15,000-18,000 అమ్మిన 80 కిలోల బస్తా ధర గడచిన రెండు మూడేళ్లుగా దిగజారుతూ వస్తోంది. ఇప్పుడు పాతాళానికి పోయి రూ.7,000 నుండి 8,000 మధ్యలో కొంటున్నారు. ఇటువంటి సమయంలోనే రైతుకు సర్కారు చేయూత అందించాలి. ఆర్‌బికెల ద్వారా బస్తా రూ.16,000 చొప్పున కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కాని, 'విత్తు నుండి విక్రయం వరకూ అంతా ఆర్‌బికె ద్వారానే' అని ప్రకటించిన ప్రభుత్వం జీడి పంట విషయంలో ఆ ఊసెత్తకపోవడం దారుణం. గిరిజనుల నుండి జీడి పిక్కలను చాలా కాలం కిందట గిరిజన కార్పొరేషన్ కొనుగోలు చేసి, ప్రోసెస్ చేయించి మార్కెటింగ్ చేసింది. పరిమితంగానే చేసినా ఇప్పుడు అది కూడా లేదు. టిడిపి ప్రభుత్వం 2017 ప్రాంతంలో 'వెలుగు' ద్వారా కొనుగోలు చేసి ఓలం అనే ప్రైవేటు సంస్థతో (కేరళ ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్ కోరినా తిరస్కరించి) అమ్మకం ఒప్పందం చేసింది. అది కూడా రెండేళ్లు మించి సాగలేదు. రాష్ట్రంలో జీడి పిక్కలను ప్రభుత్వ సంస్థ ఏదీ కొనుగోలు చేయడంలేదు. అలా కొనుగోలు చేయకుండా 'మాది రైతు ప్రభుత్వం' అని గొప్పలు చెప్పుకోవడం తగదు.
- విచ్చలవిడి దిగుమతులుా కార్పొరేట్లకు లబ్ధి
కేంద్రంలో మోడీ అధికారానికి వచ్చాక జీడి పరిశ్రమకు గడ్డు రోజులచ్చాయి. శతాబ్దాల తరబడి పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్న కేరళను దెబ్బ తీయాలన్న కక్ష కూడా అందుకు ఓ కారణమై ఉండవచ్చు. దేశీయ ప్రోసెసింగ్ పరిశ్రమకు అవసరమైనంత జీడి పిక్కల ఉత్పత్తి లేదు కనుక విదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. అయితే, అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, దిగుమతుల మూలంగా దేశీయ రైతాంగం దెబ్బ తినకుండా ఉండేందుకు దిగుమతి సుంకం విధిస్తారు. కానీ మోడీ సర్కారు వచ్చేనాటికి 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2018 ఫిబ్రవరి నుండి 2.5 శాతానికి అంటే సగానికి తగ్గించారు. విదేశీ పిక్కల ధర ఆ మేరకు తగ్గుతుందన్నమాట. వివిధ సరుకులను దిగుమతి చేసుకునే సందర్భంలో అంతకన్నా తక్కువ ధరకు కొనరాదని నిబంధన ఉంది. దాన్ని కనీస దిగుమతి ధర (మినిమమ్ ఇంపోర్ట్ ప్రైస్- ఎంఐపి) అంటారు. దాని ప్రకారం విదేశీ జీడి పప్పును రూ.780, బద్దను రూ.680 కంటె తక్కువకు కొనరాదు. కానీ 2023 ఫిబ్రవరిలో మోడీ సర్కారు దానిని కూడా సడలించి విచ్చలవిడి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచింది. ఈ మినహాయింపు కూడా సెజ్‌ల లోని పరిశ్రమలకు కల్పించడంతో వారు చౌకగా భారీ దిగుమతులకు పాల్పడుతున్నారు. ఆ విధంగా కార్పొరేట్ కంపెనీలు ధరల ఒడుదుడుకులకు కారణమవుతున్నాయి. అలాగే జిఎస్‌టి విధానం తెచ్చి అది కూడా 12 శాతం నిర్ణయించడంతో మార్కెట్ తీవ్రంగా దెబ్బ తింది. అనేక ఆందోళనల తరువాత మాత్రమే 5 శాతానికి తగ్గించారు. మోడీ ప్రభుత్వ విధానాల మూలంగా చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారులు నిలదొక్కుకోలేక దివాలా తీసే పరిస్థితులేర్పడ్డాయి.
అంతర్జాతీయంగా ధరల ఒడుదుడుకుల గురించి రెండక్షరాల పత్రిక రాసిందే కాని జీడి పరిశ్రమ నేడెదుర్కొంటున్న సవాళ్లకు ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలని మాత్రం రాయలేదు. మూడక్షరాల పత్రిక కూడా కేంద్రం ఊసెత్తలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని జీడి పరిశ్రమలన్నీ మూతబడి ఉన్నాయి. కార్మికులకు జీవనోపాధి పోగా రైతులవద్ద జీడి పిక్కలు పేరుకుపోతున్నాయి. అయినా గాని హార్టికల్చరల్ డైరెక్టర్ రాష్ట్రంలో ఒక్క జీడి పరిశ్రమ కూడా మూతబడలేదని ప్రకటన ఇస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ సమర్ధక పత్రిక ప్రముఖంగా ఇవ్వడం ఏం సూచిస్తోంది? రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలా ఉండగా ఇటీవల పలాస ప్రాంతంలో పర్యటించిన ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వాణిజ్య విభాగం నాయకుడు కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి పల్లెత్తు మాటాడకపోవడం వారి లంగుబాటుకు నిదర్శనంగా భావించవలసి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతుల నుండి బస్తా జీడి పిక్కలను మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం ద్వారా రూ. 16,000కు ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలి. వాటిని రాష్ట్రంలోని ప్రోసెసింగ్ పరిశ్రమలకు సరఫరా చేసి ఆ పప్పు మార్కెటింగ్‌కు తోడ్పాటునివ్వాలి. టిటిడి తో సహా అన్ని దేవస్థానాలకూ రాష్ట్రంలో ప్రోసెస్ చేసిన జీడిపప్పు మాత్రమే కొనుగోలు చేయాలి. పంట అభివృద్ధి, పరిశోధనకు తగు చర్యలు చేపట్టాలి. దిగుమతి సుంకాన్ని తిరిగి 5 శాతానికి పెంచేలా, ఎంఐపి అన్ని పరిశ్రమలకూ ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఇటువంటి చర్యలు మాత్రమే అటు రైతులకు, ఇటు కార్మికులకు శ్రేయోదాయకం. జీడి పరిశ్రమ, వాణిజ్యం నిలబడతాయి. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోరుకునే పార్టీలు లేదా పత్రికలు ఇటువంటి వైఖరి చేపట్టడం అవసరం.
- గిరిపుత్ర










