Aug 02,2023 07:24

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తమ అదుపాజ్ఞల్లో వున్నాయి కాబట్టే రాష్ట్ర హామీలను అమలు చేయకపోయినా, కడప ఉక్కు పరిశ్రమను నిర్మించకపోయినా తనను అడిగేవారు లేరన్నది బిజెపి వైఖరి. మాటల గారడీ చేస్తూ ప్రజలను మోసగించడం, మత ఘర్షణలు సృష్టిస్తూ ప్రజలను చీల్చడం ద్వారా కొంత కాలం గెలవొచ్చు. కాని ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఆంధ్రులదని విస్మరించకూడదు. పాలక పార్టీలు రాజకీయ తెరల చాటున ఆడుతున్న ఈ వికృత విషాదకర నాటకం చివరి అంకానికి వచ్చింది. ఆంధ్రుల పక్షాన వుంటారా, ఆంధ్రులను దగా చేస్తున్న బిజెపి పక్షాన వుంటారా అని ప్రశ్నించే సమయం రానే వచ్చింది. కడప ఉక్కు కోసం ఉద్యమించకుండా రాయలసీమ బిడ్డలమని చెప్పుకునే అర్హతను పాలక, ప్రతిపక్ష నేతలు కోల్పోతారు.

           నాలుగు సార్లు శంకుస్థాపనలు చేసినా నాలుగు అడుగులు కూడా ముందుకు పడని ఏకైక పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ. తొమ్మిది సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన బిజెపి నమ్మకద్రోహానికి నిదర్శనం 25.7.2023న కడప ఉక్కు పరిశ్రమపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరారు ప్రకటన. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల్లో నిర్మించాల్సిన ఈ ఉక్కు పరిశ్రమను పది సంవత్సరాల తర్వాత బిజెపి నేతలు పురిటిలోనే గొంతు నులిమేశారు. ఆంధ్రుల అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని పాతాళానికి తొక్కేస్తున్న ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోనే తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నాయి వైసిపి, టిడిపి పార్టీలు. పార్లమెంట్‌ చట్టాలను పాతరేసి ఊరేగుతున్న బిజెపి నేతలను ప్రశ్నించాల్సిని వైసిపి, టిడిపి లు నిస్సిగ్గుగా వారికి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని మంటగలుపుతున్నాయి. కడప ఉక్కు ఏమైపోతేనేం...ఆ కేసులు తమ గడప దాటి రాకుండా వుంటే చాలనుకుంటున్నాయి.
           కడప ఉక్కు పరిశ్రమ వచ్చేసినట్లే అని ఇప్పటి వరకు ప్రకటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. ఇక్కడ పరిశ్రమ సాధ్యాసాధ్యాలను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందట. అందువల్ల కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...మన రాష్ట్ర వైసిపి, టిడిపి ఎంపీల ప్రశ్నకు రాతపూర్వకంగా చేప్పేశారు. ప్రశ్న అడిగిన ఎంపీలు మాత్రం మౌన ముద్ర దాల్చారు. ఇన్నాళ్లుగా పరిశ్రమ గురించి మీరే మాట్లాడారు కదా, పర్యావరణ అనుమతులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు అనుమతి ఇచ్చారు కదా, ప్రభుత్వ రంగంలో లాభదాయకం కానిది ప్రైవేట్‌ జిందాల్‌ కంపెనీకి ఎలా లాభదాయకం అయ్యింది అని ఒక్కరంటే ఒక్కరు అడగలేదు. తమ బాస్‌లు ప్రశ్న వేయమన్నారే కాని బదులు ప్రశ్న వేయమనలేదేమో! సెయిల్‌ అధ్యయనం చాటున తన చేతికి రక్తపు మరకలు అంటకుండా కడప ఉక్కును, రాయలసీమ యువత ఆశలను బిజెపి హత్య చేసింది. తమ పార్టీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రం ముందు సాగిలపడుతున్నారు. 2018లో కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ దీక్షలు చేసిన టిడిపి నేడు మౌన దీక్షలో వుంది. ప్రశ్నించే రాజకీయాలు అంటూ రంకెలు వేస్తున్న జనసేన ఏకంగా ... రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి భజనలో తరిస్తున్నది. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు అని, ఢిల్లీలో గర్జిస్తానని గత ఎన్నికల్లో చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ నేడు కనీసం స్పందించడంలేదు. చట్ట ప్రకారం హామీ ఇచ్చిన పరిశ్రమలే రాకపోతే తన పార్టీ వెనక వున్న అత్యధిక యువత ఎలా బతుకుతారు? కడప ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర బిజెపి నయవంచన వైఖరికి నిరసనగా సిపిఎం జులై 31న రాయలసీమ జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల దగ్గర ఆందోళనలు చేసింది. కలిసివచ్చే పార్టీలు, వ్యక్తులు, ముఖ్యంగా యువతను కలుపుకొని ఉద్యమించడానికి పిలుపునిచ్చింది.
 

                                                                       రాయలసీమకు బిజెపి ద్రోహం

రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు పరుస్తామని బిజెపి హామీ ఇచ్చింది. 2014 రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్‌, నాసెన్‌ పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పార్క్‌, కర్నూలులో రూ.400 కోట్లతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి), రైల్వే కోచ్‌ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరులో చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణం పది సంవత్సరాల్లో పూర్తి చేయాలి. విభజన చట్టం రూపొందించి పది సంవత్సరాలు పూర్తయింది కాని ఒక్క హామీ పూర్తిగా అమలు కాలేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా బిజెపినే దేశాన్ని పాలిస్తున్నది.
            విభజన చట్టం ప్రకారం కడప ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. కాని బిజెపి మొదటి నుండి ఈ పరిశ్రమ స్థాపనపై మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నది. పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను ఏడు సంవత్సరాల తర్వాత మంజూరు చేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఇక్కడ పరిశ్రమ నిర్వహణకు నాణ్యమైన ఖనిజాలు వున్నాయా అంటూ అనుమానాలు లేవనెత్తింది. దీనిపై సెయిల్‌ సంస్థతో అధ్యయన బృందాన్ని నియమించింది. పార్లమెంట్‌లో మన రాష్ట్ర ఎంపీలు ప్రశ్నించిన ప్రతిసారి విభిన్న ప్రకటనలు చేసింది. పరిశ్రమ నిర్మాణం చేపట్టి తీరుతామని, అధ్యయనం చేస్తున్నామని, ప్రభుత్వ రంగంలో నిర్మాణం సాధ్యం కాదని ఇలా అనేక వాదనలు చేసింది. మరోవైపు రాష్ట్ర బిజెపి పార్టీ తరపున కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్‌, కడపలో రాయలసీమ రణభేరి అంటూ సభలు జరిపి మాటల గారడి చేసింది. రాయలసీమ డిక్లరేషన్‌కు బిజెపి కట్టుబడి వుందని, కడప ఉక్కు అందులో భాగమని రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షురాలు నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకే కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు...అందులో భాగంగా రాయలసీమ ప్రజలకు... తీరని ద్రోహం చేస్తున్న బిజెపిపై పోరాడాల్సిన వైసిపి, టిడిపిలు ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం పోటీలు పడుతున్నాయి. బిజెపి వినాశకర విధానాలకు మద్దతు ఇస్తున్నాయి.
 

                                                                           నాలుగు శంకుస్థాపనలు

కడప ఉక్కు పరిశ్రమ రాయలసీమ ప్రజల చిరకాల కాంక్ష. ఈ ప్రాంతం కరువు సీమే అయినప్పటికీ, ఖనిజ సంపద నిండిన ప్రాంతం. ఈ భూగర్భంలో 64 రకాల ఖనిజ నిక్షేపాలు వున్నాయి. సున్నపురాయి మొదలు విలువైన ఇనుము, అత్యంత విలువైన డోలమైట్‌, బంగారం, వజ్రాలు ఈ నేలలో వున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పులరిన్‌ ఖనిజంతో పాటు విలువైన ఔషధ మొక్కలు అనేకం ఇక్కడ వున్నాయి. వీటి ఆధారంగా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించి, కరువు నుండి శాశ్వత విముక్తి చేయాలనేది ఇక్కడి ప్రజల కోరిక. ఈ ప్రాంతం నుండి గెలిచిన నేతలే రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించారు, పరిపాలిస్తున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించి లక్ష మందికి ఉపాధి కల్పిస్తామంటూ నేతలు హామీలు గుప్పించి 16 సంవత్సరాల్లో నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా 2007లో జమ్ములమడుగు వద్ద బ్రాహ్మణీ స్టీల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 20 వేల కోట్ల పెట్టుబడితో, 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 10,060 ఎకరాల్లో స్థాపించే ఈ పరిశ్రమ ద్వారా లక్ష మంది యువతకు ఉపాధి వస్తుందన్నారు. ఆ తర్వాత దాదాపు పుష్కరకాలం అది శిలాఫలకానికే పరిమితమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కడప ఉక్కు పరిశ్రమ మరలా చర్చనీయాంశమైంది. విభజన చట్టంలో భాగమైంది. ఈ హామీ అమలు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి, దాన్ని సాధించుకోవాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి గుర్తుకు రాలేదు. ఈ రెండు పార్టీల మధ్య మిత్రబంధం చెడిన తర్వాత 2018 జూన్‌ 18న టిడిపి ఎంపీ సి.ఎం.రమేష్‌ కడపలో ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, ఆ తర్వాత ఎన్నికలకు ఐదు నెలల ముందు 2018 డిసెంబర్‌లో గండికోటకు దగ్గరలోని కంబులదిన్నె గ్రామం వద్ద చంద్రబాబు నాయుడు 'రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌' పేరుతో శంకుస్థాపన చేయడం నాటకీయంగా జరిగింది. నేడు బిజెపిలో ఉన్న సి.ఎం రమేష్‌ దీనిపై నోరెత్తడం లేదు.
           ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ఈ ఉక్కు పరిశ్రమకు మరో రెండు సార్లు శంకుస్థాపనలు చేసింది. విభజన చట్టంలో భాగంగా వున్న కడప ఉక్కు సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవలసిందిపోయి రాయలసీమ ప్రజల దృష్టిని మళ్ళించడానికి శంకుస్థాపనలు మొదలుపెట్టింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ పేరుతో ఒకసారి, 2023లో జెఎస్‌డబ్ల్యూ (జిందాల్‌) కంపెనీతో పేరుతో మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ రంగానికి లాభదాయకం కాని కడప ఉక్కు పరిశ్రమ జిందాల్‌ కంపెనీకి ఎలా లాభదాయకమవుతుంది ?
           రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తమ అదుపాజ్ఞల్లో వున్నాయి కాబట్టే రాష్ట్ర హామీలను అమలు చేయకపోయినా, కడప ఉక్కు పరిశ్రమను నిర్మించకపోయినా తనను అడిగేవారు లేరన్నది బిజెపి వైఖరి. మాటల గారడీ చేస్తూ ప్రజలను మోసగించడం, మత ఘర్షణలు సృష్టిస్తూ ప్రజలను చీల్చడం ద్వారా కొంత కాలం గెలవొచ్చు. కాని ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఆంధ్రులదని విస్మరించరాదు. నాడు కేంద్రం అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తే పోరాడి పునర్‌నిర్మించుకున్న ఘనత ఆంధ్రులది. పాలకపార్టీలు రాజకీయ తెరల చాటున ఆడుతున్న ఈ వికృత విషాదకర నాటకం చివరి అంకానికి వచ్చింది. ఆంధ్రుల పక్షాన వుంటారా, ఆంధ్రులను దగా చేస్తున్న బిజెపి పక్షాన వుంటారా అని ప్రశ్నించే సమయం రానే వచ్చింది. కడప ఉక్కు కోసం ఉద్యమించకుండా రాయలసీమ బిడ్డలమని చెప్పుకునే అర్హతను పాలక, ప్రతిపక్ష నేతలు కోల్పోతారు.

(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌