Jul 27,2022 06:55

వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీ పాలనలో రూ. 10 లక్షల 72 వేల కోట్ల రూణాలు రద్దు చేశారు. 13 కంపెనీలు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 4 లక్షల 50 వేల కోట్ల రుణాలను రూ. లక్ష 61 వేల కోట్ల తగ్గింపుతో 'సెటిల్‌మెంట్‌' చేశారు. ఈ మొత్తం డబ్బు గ్రామీణ పేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్దిమేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116 దేశాల జాబితాలో మన దేశం 101వ స్థానంలో నిలిచింది. మనకంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

గత ఎనిమిది సంవత్సరాల బిజెపి పాలనలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్ధను నాశనం అంచున నిలిపిన పెద్ద నోట్ల రద్దు, కోట్ల మంది జీవితాలను రోడ్లపాలు చేసి, ప్రాణాలను హరించిన కరోనా, రాజధాని నగరంలో సంవత్సరం పైగా అన్నదాతల ఆక్రందనలు, ఉన్నత విద్యాలయాల్లో ఉన్మాదాలు, ఆకాశాన్నంటిన ధరలు...ఇలా అనేక క్లిష్ట సమస్యలపై ఏనాడూ అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం పిలవలేదు. Äహఠాత్తుగా శ్రీలంక పరిణామాలపై అన్ని పార్టీలను కూర్చోబెట్టి విదేశాంగ మంత్రి జయశంకర్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజరు సేఠ్‌ కలిసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సందట్లో సడేమియా అన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌ మొదలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులు, అమలవుతున్న ఉచిత పథకాలపై...శ్రీలంక పరిణామాల గురించి హెచ్చరించారు. ఇది వైసిపికి ఊహించని పరిణామం. టిడిపికి ఆశించని అవకాశం. రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఓటు సిరా ఆరక ముందే ఇలాంటి వ్యాఖ్యానాలు కేంద్ర ప్రభుత్వం నుండి రావడం ఒక పార్టీకి బాధను, మరొక పార్టీకి ఆనందాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి మలుపులు ఇంకా ఎన్ని చూడాలో !
     గత నెలలో ధర్మశాలలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాస కొనసాగింపే అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రాల అప్పులు, ఉచిత పథకాల గురించిన పలుకులు. అననుకూల పరిస్థితిని తమకు మరింత సానుకూలంగా మార్చుకొని ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేయడంలో సిద్ధహస్తులు కేంద్ర పాలకులు. పేదలకు అందుతున్న అరకొర సంక్షేమ పథకాలకు ఇప్పటికే భారీగా కోతలు పడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఉచితానుచితాల గురించి చర్చ లేపి వాటిని రద్దు చేయడానికి సిద్ధమయ్యారు. ఉచిత పథకాలు అంటే ఏమిటి? ఎందుకు ఈ ఉచిత పథకాలు? ఎవరు ఎవరికి ఏది ఉచితంగా ఇస్తున్నారు? ఈ విషయాలను రేఖామాత్రంగా పరిశీలిద్దాం.
     ఆస్తిపాస్తుల మీద కొద్దిమందికే హక్కు వున్న ఈ సమాజంలో రెండు వర్గాలు వుంటాయి. ఆస్తి వున్నవారు, ఆస్తి లేనివారు. కొద్దిమందిగా వున్న సంపన్నులు, అత్యధిక మందిగా వున్న కష్టజీవుల చేత పని చేయించుకొని...వారికి కొద్ది మొత్తం ముట్టచెప్పి...అత్యధిక భాగం తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది ఈ రెండు వర్గాలకు రెండు సమస్యలను సృష్టిస్తుంది. పెట్టుబడిదారులకు ఉత్పత్తి మందగించి, లాభాలు తగ్గిపోతే; కార్మికులకు పనిలేక ఆకలి, దారిద్య్రం పెరిగిపోతాయి. ఈ పరిస్థితి నుండి తాత్కాలికంగానైనా గట్టెక్కడానికి కనిపెట్టినవే ఉచిత పథకాలు. 'రాజ్యం జోక్యం చేసుకొని పేదలకు కొన్ని ఉచిత పథకాలు అమలు చేయకపోతే మొత్తానికే పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలి పోతుందర్రో' అంటూ తాతల కాలంనాటి ఆర్థికవేత్త జాన్‌ మైనార్డ్‌ కీన్స్‌ మొత్తుకొంటే వచ్చినవే ఈ ఉచిత పథకాలు. సంక్షేమ పథకాలతో పేదలు కొన్ని కనీస సదుపాయాలు పొందుతారు. వీటిని ఆశగా చూపి పాలక వర్గాలు అధికారాన్ని పొంది ఆ పేదలను మరింత దోచుకునే సంపన్న అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. వాస్తవంగా ఈ ఉచిత పథకాల వల్ల పేదలు పొందే దానికన్నా, పెట్టుబడిదారులే ఎక్కువ లాభాలు పొందుతున్నారు.
     ఆకలితో వున్న వారికి అన్నం పెట్టడం ధర్మం, మానవత్వం. కానీ అజీర్తితో వున్న వారికి కుక్కి కుక్కి తినిపించడాన్ని ఏమంటారు? 2020-21 కేంద్ర బడ్జెట్‌ సవరించిన అంచనాలో 15 కోట్ల 25 లక్షల వ్యవసాయ కూలీల కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పథకానికి రూ.1,10,000 కోట్లు కేటాయిస్తే, 2021-22 బడ్జెట్‌లో రూ. 73,000 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన పనికి కూలీ డబ్బులు రాక పేదలు పస్తులతో, అర్థాకలితో జీవిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు లేవు. అరకొర ఉపాధిలో భద్రత లేదు. ఈ పరిస్థితికి తోడు గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, మాంసం, చేపలు, చివరకు శ్మశాన కర్మకాండలపై కూడా జిఎస్‌టి విధించి దేశాన్ని అమృత్సోవాల వైపు పాలకులు పరిగెత్తిస్తున్నారు. మరోవైపు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీ పాలనలో రూ. 10 లక్షల 72 వేల కోట్ల రూణాలు రద్దు చేశారు. 13 కంపెనీలు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 4 లక్షల 50 వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61 వేల కోట్ల తగ్గింపుతో 'సెటిల్‌మెంట్‌' చేశారు. ఈ మొత్తం డబ్బు గ్రామీణ పేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసివుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కలిపించి కొద్దిమేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116 దేశాల జాబితాలో మన దేశం 101వ స్థానంలో నిలిచింది. మనకంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి. సిఎంఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) నివేదిక ప్రకారం 20 నుండి 24 సంవత్సరాల వయసు గల నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్లకు పైగా వుండి, గతంలో కనివినీ ఎరుగని రీతిలో 42 శాతానికి పెరిగింది. వార్షిక టోకు ధరల సూచి ప్రకారం ఈ మే నెలలో 15.8 శాతం పెరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరగడం గత 14 సంవత్సరాలలో ఇదే మొదటిసారి.
    మరోవైపు ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానానికి కేంద్ర ప్రభుత్వ ఆత్మీయ పెట్టుబడిదారుడు గౌతం ఆదానీ ఎదిగారు. 2016-20 మధ్య కాలంలో ముఖేష్‌ అంబానీ నికర సంపద 350 శాతం పెరగగా, ఆదానీ సంపద 750 శాతం పెరిగింది. 'దేశభక్తి'యుతమైన 'బృహత్తర' పథకాల వల్ల సాధించిన పురోగతి ఇది. ప్రభుత్వ ఆస్థులను కారుచౌకగా కబ్జా చేస్తున్న కార్పొరేటు కంపెనీల ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి. విజరు మాల్యా, నీరవ్‌ మోడీ, చంద కొచ్చర్‌, రణ కపూర్‌, రవి పార్థసారథి, గౌతమ్‌ థాపర్‌...ఇలా అనేకమంది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశాన్ని దోచుకోవడం, విదేశాలకు పారిపోవడం రివాజుగా మారింది. 6 లక్షల కోట్ల విలువైన భూమిని, రైల్వే లైన్లను, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను, రవాణా, ఓడరేవులు, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేసేందుకు 'జాతీయ నగదీకరణ' పథకాన్ని రూపొందించారు. దేశాన్ని మత రాజ్యంగా నిర్మించాలని ప్రయత్నించే మతోన్మాద శక్తులు, ఆస్తుల కోసం అర్రులు చాస్తూ అన్ని వనరులను కొల్లగొడుతున్న కార్పొరేటు శక్తుల బంధం బలీయంగా మారింది. దేశ సంపదను కొద్దిమందికి దోచిపెడుతూ, పేదలకు అందాల్సిన ఆ కొన్ని పథకాల గురించి ఉచితం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
    రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్ర పాలకులకు 'గురివింద గింజ' చందంగా తన నలుపు కనపడకపోవచ్చు. కాని ప్రజలకు కనిపించకపోదు కదా? 67 సంవత్సరాల స్వతంత్ర పాలనా కాలంలో దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా, ఎనిమిది సంవత్సరాల మోడీ పాలనా కాలంలోనే సుమారు రూ. 100 లక్షల కోట్ల అప్పు అదనంగా పెరిగింది. పార్లమెంటుకు తాజాగా తెలిపిన లెక్కల వివరాలే ఇవి. ఇప్పుడు చెప్పండి. దేశాన్ని శ్రీలంక పరిస్థితికి తెస్తున్నది రాష్ట్రాలా? కేంద్రమా? ఇంత అప్పు చేసి ఏం సాధించారు? డాలర్‌తో పొలిస్తే రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పతనమైంది. విదేశీ మారక ద్రవ్యం హరించుకుపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెక్కలు వచ్చిన గుర్రాల కంటే వేగంగా దేశం విడిచి పారిపోతున్నాయి. దేశీయ చిన్న పరిశ్రమలు వేల సంఖ్యలో మూలపడి లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దేశం లోని 24 శాతం మంది భారతీయులు నెలకు రూ. 3,000 కంటే తక్కువ ఆదాయం పొందుతుంటే, ముఖేష్‌ అంబానీ, ఆదానీలు గంటకు రూ. 90 కోట్లు పోగేసుకుంటూ ప్రపంచ కుబేరులుగా మారారు. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని 32 కోట్ల మంది భావిభారత పౌరులు విద్యను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయారు. దేశంలోని 46 శాతం కుటుంబాలు రెండు పూటలా తిండి తినడానికి అప్పులపై ఆధారపడుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, చిల్లర వ్యాపారం ఇలా అన్ని రంగాలను కార్పొరేటు కంపెనీలు ఆక్రమించకుంటున్నాయి. 'నయా ఉదారవాదం' అనే ఈ విధానాల్లో వున్న వాస్తవాలను ప్రజలు గుర్తించిన ప్రతి దేశంలో, ప్రతి రంగంలో తిరుగుబాట్లు వస్తున్నాయి. అందులో భాగమే శ్రీలంక పరిణామాలు.
రాష్ట్ర ప్రజలపై భారాలు వేసే విషమ షరతులతో అదనపు అప్పులకు అనుమతులు ఇస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించని మన రాష్ట్ర ప్రభుత్వం బటన్‌ నొక్కడమే అభివృద్ధి అని భావిస్తుంది. దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి తమ అనుకూల పెట్టుబడిదారులకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా...శ్రీలంక పరిణామాలు ఆంధ్రలో వచ్చేస్తున్నట్లు టిడిపి చెబుతున్నది. శ్రీలంక పాపంలో ఐఎంఎఫ్‌తో పాటు మోడీ గారి ప్రియ పెట్టుబడిదారుడు ఆదానీ పాత్ర కూడా వున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి ప్రకటించిన విషయం తెలిసిందే. వైసిపి, టిడిపి, బిజెపిని బలపరస్తున్న జనసేన నాయకులు శ్రీలంక పరిణామాల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. మతాలు, జాతులు అంటూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న లంక పాలకులు చివరకు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా ప్రజల జీవిత విధానమే పోరాట మార్గాన్ని నిర్మిస్తుంది, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌