Apr 02,2023 07:45

చేనును కంచె మేసినట్లు..
పంటల్ని మింగుతున్న విపత్తులు
పరేషాన్లో దిక్కుతోచని సాగన్నలు
బక్క రైతు బతుకుల్లో బ్రహ్మజెముళ్లు !
అతివృష్టి, అనావృష్టి, వరదలు..
తుఫాన్లు, అకాల వర్షాలు, వడగండ్లు..
రైతన్న నడ్డి విరిచే ప్రకృతి ప్రళయాలు
కర్షకున్ని ఊబిలోకి లాగే అకాలాలు !
విత్తు నాటిన నుంచి పండే దాకా..
రైతుపై కక్షగట్టిన విపత్తుల కత్తులు
వ్యథాభరిత బాధల సుడిగుండాలు
ఎవరికీ పట్టని హలధారి ఆక్రందనలు !
పసలేని పరిహార ప్రకటనలతో..
మొసలి కన్నీరు ఏరులై పారుతూ..
సాగుదారు వేదనలు అరణ్యరోదనలే
సాగుబడి ఎన్నటికీ జూద క్రీడనే !
జాతి అన్నదాత కన్నీళ్లు..
యావత్తు దేశానికే పెను శాపాలు
దుఃఖ పర్యాయపదమా సేద్యం
సాయం అందని వ్యవ'సాయం' !
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని..
రుణపాశాల్లో చిక్కుతున్న రైతులు
రైతు ఆత్మహత్యలు కావవి..
పాలకులు చేసిన కసాయి హత్యలే !
పాలకులు జడత్వాన్ని దులుపుకొని..
అన్నదాత అగచాట్లపై దృష్టి పెట్టి..
చేద్దాం ఆహారభద్రతకు పట్టాభిషేకం
నిర్మిద్దాం ఆకలిచావుల్లేని భారతం !

బుర్ర మధుసూదన్‌ రెడ్డి
99497 00037