- రూ.8,800 కోట్లతో కడప స్టీలు ప్లాంటు
- అదానీ గ్రీన్ ఎనర్జీకి లైన్ క్లియర్
- సిఎం అధ్యక్షతన ఎస్‌ఐపిబి సమావేశం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కడప స్టీల్ ప్లాంట్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,985 కోట్లతో ప్రాజెక్టులు పెట్టేందుకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపిబి) గ్రీన్ సిగల్ ఇచ్చింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జెఎస్‌డబ్ల్యు ఏర్పాటు చేయనున్న స్టీల్‌ప్లాంట్ ప్రతిపాదనలనూ ఆమోదించింది. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపిబి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెడుతుందని, మొదటి విడతగా రూ.3,300 కోట్ల వెచ్చిస్తుందని అన్నారు. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని, వెనుకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని సిఎం పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగపడతాయని అన్నారు. 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్‌ఐపిబి గ్రీన్‌సిగల్ ఇవ్వడంతో పాటు రూ.6,330 కోట్ల పెట్టుబడి అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పెట్టుబడులకూ ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రత్యక్షంగా నాలుగు వేలమందికి ఉపాధి కలుగనుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడవద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టులను 2024 నుండి నాలుగేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. రూ.8,855 కోట్ల హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపింది. ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులను 2023 జులైలో ప్రారంభించి విడతల వారీగా 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాధ్, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సిఎస్ కరికాల వలవన్, వాణిజ్యపన్నులశాఖ స్పెషల్ సిఎస్ రజత్‌భార్గవ, సిసిఎల్‌ఎ సాయిప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సిఎస్ కె.విజయానంద్, జిఎడి స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్‌కుమార్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.










