Dec 14,2022 09:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విభజన చట్టం ప్రకారం నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు రూ.23,110.472 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి కోసం రూ.1,750 కోట్లు, నూతన రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.13,226.772 కోట్లు, 2015-16 నుంచి 2019-20 వరకు ఎక్సట్రనల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టు(ఇఎపి)లకు రూ.15.81 కోట్లు ఇచ్చామని తెలిపారు.
          కాగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద నాలుగేళ్లలో రూ.4,201.55 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవర్‌ తెలిపారు. ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
 

                                                 సోంపేట క్లస్టర్‌లో 28 పనులు ప్రారంభమే కాలేదు !

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట క్లస్టర్‌లో 'రుర్బన్‌' పథకం కింద 28 పనులు ప్రారంభానికి నోచుకోలేదని కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. టిడిపి ఎంపి కె రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సోంపేట క్లస్టర్‌లో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 290 పనులు మంజూరు అయ్యాయని, అందులో 137 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. 125 పనులు జరుగుతున్నాయని, 28 పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. 2018లో సోంపేట క్లస్టర్‌లో కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు నిర్మించాలని ఏపి ప్రభుత్వం ప్రతిపాదన అందిందని, అయితే ఆపరేషన్లు, సదుపాయం నిర్వహణకు సంబంధించిన సమస్యల కారణంగా 2021లో ఈ పనిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.