Aug 28,2022 09:23

సైకో కిల్లర్‌ కథాంశాలతో హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ లెక్కకుమించిన సినిమాలొచ్చాయి. ఆ కాన్సెప్ట్‌ను అన్ని రకాలుగా వండి పీల్చి పిప్పిచేశారు. ఆ జానర్‌లో కొత్తగా చూపించడానికి లేటెస్ట్‌గా ఓటిటిలో రిలీజైన మరో ఇంట్రెస్టింగ్‌ చిత్రం 'హైవే'. యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు కేవి గుహన్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ ఇది. అయితే ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్‌ యాప్‌ ఆహాలో లేటెస్ట్‌గా డైరెక్ట్‌ రిలీజ్‌ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..
కథలోకి వెళ్తే... విష్ణు (ఆనంద్‌ దేవరకొండ) ఒక ఫొటోగ్రాఫర్‌. తన స్నేహితుడు (సత్య) తో కలిసి బెంగళూరులో ఒక ఈవెంట్‌ కవర్‌ చేయడానికి బయలుదేరతాడు. అలాగే మరోపక్క తులసి (మానస రాధాకృష్ణన్‌) తన తల్లితో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తుంది. ఫామ్‌ ఓనర్‌ తన తల్లితో పాటు తులసిపై వేధింపులకు పాల్పడతాడు. తల్లి సూచన మేరకు తులసి వేధింపులు భరించలేక అక్కడ నుంచి పారిపోతుంది.. సొంత ఊరు నుండి తప్పించుకొని వెళ్తున్న తులసికి విష్ణుకు దారిలో పరిచయమవుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌లో ఐదుగురు అమ్మాయిలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఓ సైకో కిల్లర్‌ డి అలియాస్‌ దాస్‌ (అభిషేక్‌ బెనర్జీ) అదే హైవే మీదుగా పారిపోతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను వెంబడిస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ ఆశాభట్‌ (సయామీ ఖేర్‌). ఈ నలుగురు ఒకానొక సందర్భంలో తారసపడతారు. అప్పుడు ఆ సైకో కిల్లర్‌ ఏం చేస్తాడు? ఇంతకీ పోలీసులు అతన్ని పట్టుకుంటారా? లేదా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా కథ..

highway


రెగ్యులర్‌గా సైకో కిల్లర్‌ చిత్రాలు ఓ ఫార్మెట్‌లో సాగుతూంటాయి. ఓ సీరియల్‌ కిల్లర్‌ వరుస మర్డర్స్‌ చేసుకుంటూపోతూంటాడు. అతనికి మోటో ఉండచ్చు, లేకపోవచ్చు. అతన్ని పట్టుకోవటానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈలోగా హీరోయిన్‌ని అతను టార్గెట్‌ చేస్తాడు. హీరో వచ్చి ఆ సైకో నుంచి ఎలా రక్షించాడు. పోలీస్‌లు కూడా చెయ్యలేని పనిని అతను ఎలా చేశాడన్నట్లు సాగుతూంటాయి. అయితే ఇదంతా ఓల్డ్‌ ప్యాట్రన్‌. ఈ ఫార్ములాలో కథ చెప్తే... అడుగడుక్కీ కథ ఎలా వెళ్లబోతుంది అనేది చూసేవాడికి అర్థమైపోతుంది.
కాగా సైకో కిల్లర్‌ జానర్‌ ఫిల్మ్‌కు గాడ్‌ఫాదర్‌ లాంటి చిత్రం 2010లో వచ్చిన కొరియన్‌ సినిమా ఐ సా ది డెవిల్‌. ఈ సినిమాలో కంటెంట్‌ తెలిసినా చూసిన ప్రతిసారీ ఒళ్లు జలదరిస్తుంది. ఈ సినిమా అలాంటి ఫీల్‌ కాదు కదా అందులో పావు వంతు కూడా క్రియేట్‌ చేయదు. ఎక్కడా ఏ కుదుపూ లేకుండా హైవేపై వెహికిల్‌ వెళ్తున్నట్లు, ఏ మలుపూ లేకుండా కథనం సాగుతుంది. ఇలాంటి జానర్‌ సినిమాలు ఓటిటికి కూడా ఓల్డ్‌ అయ్యిపోయాయి. ఇక్కడ కూడా ఏదన్నా కొత్తదనం చూపకపోతే వర్కవుట్‌ కావటం లేదు. అదే ఈ సినిమాలో మిస్సైంది. ఈ సినిమాలో పెద్దగా మనని ఎక్సైట్‌ చేసేవి, థ్రిల్‌ చేసే సంఘటనలు కానీ కనపడవు. కొన్ని జిమ్మిక్కులు ఉంటాయి. అలాగే కథలో టెన్షన్‌ ఎలిమెంట్‌ పెద్దగా పేలలేదు. హీరోయిన్‌ సీరియల్‌ కిల్లర్‌కు దొరికిన తర్వాత వచ్చే సీన్స్‌లో అయినా ఏమన్నా విషయం ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం.. కానీ అదీ ఉండదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే మెయిన్‌ లీడ్‌ ఆనంద్‌ దేవరకొండ అలాగే యంగ్‌ హీరోయిన్‌ మానస రాధాకృష్ణన్‌ ఆకట్టుకుంటారు. ఆనంద్‌ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ఇది. తాను ఇంతకుముందు చేసిన వాటికన్నా మంచి మెచ్యూర్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే మానస రాధాకృష్ణన్‌ తన నటనతో ఆకట్టుకుంది. మరి నటుడు అభిషేక్‌ బెనర్జీ అయితే తన సైకో పాత్రలో ఇంటెన్స్‌ పెర్ఫామెన్స్‌ని చూపించాడు. తనదైన మ్యానరిజమ్స్‌.. నటనతో థ్రిల్‌ చేశాడు. ఇక సైయామి ఖేర్‌ తదితరులు సినిమాలో తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.
ఇక టెక్నికల్‌ టీంలో అయితే సైమన్‌కే ఇచ్చిన పాటలు ఫర్వాలేదు. బిజిఎం మాత్రం సినిమాకి హైలెట్‌. అలాగే డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు.. ఇక సినిమాటోగ్రఫీ, దర్శకత్వం వహించిన కేవీ గుహన్‌ మంచి వర్క్‌ని అందించాడు. దర్శకునిగా ఫర్వాలేదని చెప్పొచ్చు. మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ లాజిక్స్‌తో పాత్రలను కలపడం, వాటికీ మంచి ముగింపు ఇవ్వడంతో ఇంప్రెస్‌ చేశాడు. కాకపోతే చిన్న చిన్న లోపాలున్నాయి. వాటిని సరిచేసుకుంటే ఇంకా బెటర్‌ నెరేషన్‌ ఇవ్వగలడు.
టైటిల్‌ : హైవే
నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, అభిషేక్‌ బెనర్జీ, మానసరాధాకృష్ణన్‌, సయామి ఖేర్‌
సంగీత దర్శకుడు : సైమన్‌ కె కింగ్‌
సినిమాటోగ్రఫీ : కేవీ గుహన్‌
ఎడిటర్‌ : తమ్మిరాజు
నిర్మాతలు : వెంకట్‌ తలారి
దర్శకత్వం : కేవీ గుహన్‌