Sep 11,2022 07:50

టమాటా పచ్చడి అనగానే పచ్చిమిర్చి వేసి అందరూ చేసుకుంటారు. కానీ టమాటాలను వేర్వేరు కాంబినేషన్స్‌తో చేస్తే రుచి అదిరిపోతుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. రొటీన్‌ టమాటా పచ్చడి కన్నా, ఇలా వెరైటీల పచ్చళ్లంటే ఎవరైనా ఇష్టపడాల్సిందే. ఈ పచ్చళ్లను వేడి వేడి అన్నంలోగానీ, దోసెలు, గారెలు, ఇడ్లీల్లోకి మంచి కాంబినేషన్‌ కూడా. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..


కొబ్బరితో..

kobarri


కావలసిన పదార్థాలు : టమాటాలు - 300 గ్రాములు (దేశవాళి మాత్రమే), ఎండుమిర్చి - 6-7, పచ్చిమిర్చి -6, పచ్చికొబ్బరి ముక్కలు - కప్పు (పెద్దది), ఆవాలు, జీలకర్ర - 1/2 స్పూన్‌ చొప్పున, శనగపప్పు, మినప్పప్పు - స్పూన్‌ చొప్పున, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, చింతపండు - తగినంత, వెల్లుల్లి రెబ్బలు - 5-6, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఆవాలు - 3/4 స్పూన్‌, కరివేపాకు - ఒక రెబ్బ.
తయారీ : ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి రెండు స్పూన్‌ల నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసి, బాగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. దీనిలో కొబ్బరిముక్కలూ వేసి, మూడు నిమిషాలు వేపుకుంటే చాలు. వీటిని మిక్సీ జార్‌లో వేసి, పక్కన ఉంచండి. ఇప్పుడు అదే పాన్‌లో రెండు స్పూన్‌ల నూనె వేసి, అందులో టమాటా ముక్కలు వేయాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గాక దింపేసి, పక్కనే ఉంచుకున్న కొబ్బరి ముక్కలు వేసిన జార్‌లోకి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు పోయొచ్చు. ఇప్పుడు పాన్‌లో స్పూన్‌ నూనె వేసి, వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడక కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి, పచ్చడిలో వేసుకోవాలి. ఇది దోసెల్లోకి, గారెల్లోకి మంచి  కాంబినేషన్‌ మరి.

కరివేపాకుతో..

karvepaku


కావలసిన పదార్థాలు : నూనె - తగినంత, కరివేపాకు - 75 గ్రా (నాటుదైతే బాగుంటుంది), నువ్వులు -2 టేబుల్‌ స్పూన్స్‌, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి -15, టమాటాలు -300 గ్రా (దేశవాళీ మాత్రమే), చింతపండు - కొద్దిగా (అవసరమైతే), వెల్లుల్లి రెబ్బలు -4. ఆవాలు - 1/2 స్పూన్‌, ఎండుమిర్చి -2, పొట్టు శనగపప్పు, మినపప్పు - స్పూన్‌ చొప్పున.
తయారీ : పాన్‌లో రెండు స్పూన్‌ల నూనె వేసి, వేడయ్యాక నువ్వులు వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు కొబ్బరి తురుము వేసి కాస్త వేపుకోవాలి. ఇది వేగాక పచ్చిమిర్చిని ముక్కలు చేసి, వేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసి వేపుకోవాలి. దీన్ని చల్లార్చి, మిక్సీలో గ్రౌండ్‌ చేసుకోవాలి. అదే పాన్‌లో స్పూన్‌ నూనె వేసి, వేడయ్యాక అందులో టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గి, గుజ్జులా అవ్వాలి. టమాటాలు పుల్లగా లేకపోతే కాస్త చింతపండు వేసుకుని, ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో స్పూన్‌ నూనె వేసి, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు, శనగపప్పు, మినపప్పు వేయాలి, ఎండుమిర్చి తుంపి వేయాలి. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి, పచ్చడిలో వేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే కరివేపాకు టమాటా పచ్చడి రెడీ.


పచ్చి టమాటాలతో..
కావలసిన పదార్థాలు : పచ్చిటమాటాలు - 1/2 కేజీ, పచ్చిమిర్చి - 10-12, ఎండుమిర్చి - 5-6, ఉల్లిపాయ - పెద్దది (పెద్ద ముక్కలుగా చేసుకోవాలి) వేరుశనగలు - పావు కప్పు, జీలకర్ర - స్పూన్‌ చొప్పున, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, చింతపండు - ఉసిరికాయంత, పసుపు - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - 5-6, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఆవాలు - ముప్పావు స్పూన్‌, కరివేపాకు - ఒక రెబ్బ.
తయారీ : పాన్‌లో వేరుశనగ పప్పులు వేసి వేపాలి. వేగాక పొట్టు తీసి, పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో పావు కప్పు నూనె వేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి, మూతపెట్టి మగ్గనివ్వాలి. అదే నూనెలో ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. అవి తీసేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి టమాటా ముక్కలు వేసి, మూతబెట్టాలి. సగం మగ్గాక కాస్త ఉప్పు, చిటికెడు పసుపు, జీలకర్ర, చింతపండు వేసి, కలిపి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మిక్సీలో ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేరుశనగపప్పులు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసర మనుకుంటే కాసిన్ని వేడినీళ్లు పోసుకోవచ్చు. పాన్‌లో స్పూన్‌ నూనె వేసి, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి తాలింపు వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోగానీ, అట్టు, ఇడ్లీలో వేసుకుని తింటే, ఆహా.. ఆ రుచే వేరు.
 

నువ్వులతో..

nuvullu


కావలసిన పదార్థాలు : టమాటాలు - 1/2 కేజీ, పచ్చిమిర్చి - 6-7, మెంతులు - పావు స్పూన్‌, ధనియాలు, జీలకర్ర - స్పూన్‌ చొప్పున, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్స్‌, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, చింతపండు - తగినంత, పసుపు - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు (పొట్టు తీసేసుకోవాలి), ఆవాలు - పావు స్పూన్‌, కరివేపాకు - ఒక రెబ్బ.
తయారీ : ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి మెంతులు వేసి చక్కగా వేగనివ్వాలి. అవి వేగుతుండగా ధనియాలు, జీలకర్ర వేసి, వేపండి. ఇవి వేగాక నువ్వులు వేసి చిటపటలాడేలా వేపాలి. వీటిని చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరప కాయలను సగానికి కోసి కాస్త మగ్గనివ్వండి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. దీనిలోనే టమాటాల పులుపును బట్టి, మీరు తినేదాన్ని బట్టి కాస్త చింతపండు వేసుకోండి. వద్దనుకునేవారు స్కిప్‌ చేయొచ్చు కూడా. చిటికెడు పసుపు వేసి, కాస్త మగ్గనివ్వండి. స్టవ్‌ ఆఫ్‌ చేసి, చల్లారక ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్‌లో వేసి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు అస్సలు పోయొద్దు. ఈ పచ్చడిని స్పూన్‌ నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో నీళ్లసలు వేయకపోవడం వల్ల మూడు, నాలుగు రోజులు నిల్వ ఉంటుంది. అయితే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఒక ముద్ద ఎక్కువే లాగించేస్తారు.