ప్రజాశక్తి-కదిరి టౌన్, నల్లచెరువు(శ్రీ సత్య సాయి జిల్లా) : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండల పరిధిలోని జోగన్నపేట సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీనీ.. మినీ ఐచర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈఘటనపై నల్లచెరువు ఎస్‌ఐ వరలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వలస కూలీలు మినీ ఐచర్ వాహనంలో వెళ్తుండగా లారీనీ ఢీకొన్నట్లు తెలిపారు. ఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు పాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. వీరిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించామని తెలిపారు. అక్కడి నుండి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










