
రూర్కీ : టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా శుక్రవారం ఉదయం రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద పంత్ స్వయంగా నడుపుతున్న మెర్సిడెస్ కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో పంత్ కారు తలుపును పగలగొట్టుకొని బయటకు దూకేశారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పంత్ తల, మోకాలికి తీవ్రగాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను ప్రాథమిక చికిత్స కోసం తొలుత డెహ్రాడూన్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని మాక్స్ ఆసుపత్రికి తరలించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. మంగ్లూర్ పరిధిలోని నేషనల్ హైవే-58 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక ఎస్సీ దేహాత్ స్వపన్ కిషోర్ తెలిపినట్లు వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 25 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత సెంచరీతో మెరిశారు. బంగ్లా పర్యటన తర్వాత దుబాయ్ కు వెళ్లిన అతడు.. అనంతరం స్వస్థలం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ నేపథ్యంలో పంత్‌కు బిసిసిఐ విశ్రాంతినిచ్చిన విషయం విదితమే. కాగా చాలా తక్కువ సమయంలోనే టీమిండియా కీలక సభ్యుడిగా ఎదిగిన పంత్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇక క్రిస్మస్ వేడుకలను పంత్.. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి దుబారులో చేసుకున్న సంగతి తెలిసిందే.