Dec 24,2022 07:33

రాష్ట్రాల అప్పుల సేకరణపై ఆంక్షలు పెట్టటం, రుణ సామర్థ్య పరిమితిలో కోతలు పెట్టటంతో... రాష్ట్రాలు తమ పరిధిలో రుణాలు సమకూర్చుకునేందుకు కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 8 ఏళ్ల కాలంలో దేశ అప్పు రెట్టింపై నేడు 138 లక్షల కోట్లకు ఎగబాకి దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 84 శాతానికి చేరింది. రాష్ట్రాల అప్పులపై మాత్రం గగ్గోలు పెడుతున్నది. రాష్ట్రాలు సేకరించుకునే ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను రాష్ట్రాల రుణ సామర్ధ్య పరిమితిలో మాత్రమే కల్పిస్తామని బెదిరిస్తున్నది. రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా కోత విధించాలని నానా యాగీ చేస్తున్నది.

ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నది. ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నది. అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు చేపట్టటం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక వాయిదా వేసుకొస్తున్నది. రెండోవైపు ఈ సమస్యను అధిగమించటానికి అప్పుల ద్వారా, ప్రజలపై పన్ను వడ్డింపుల ద్వారా ఆదాయం పెంచుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్గాలను వెతుకుతున్నది. ఇప్పటికే సేకరించిన అప్పులు పెరిగిపోయాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మార్చేసిందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
             నాలుగు రోజుల క్రితం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 2022 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 3.98 లక్షల కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో ఈ అప్పు 37.8 శాతంగా ఉందని కూడా తెలిపింది. ఇదిగాక వివిధ రాష్ట్ర కార్పొరేషన్‌ల ద్వారా బడ్జెట్‌తో సంబంధం లేని అప్పు (ఆఫ్‌ బడ్జెట్‌ అప్పు) లక్షా 71 వేల కోట్లతో పాటు నాన్‌ గ్యారంటీ అప్పు మరో 87 వేల కోట్లు ఉందని అంచనా.
ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలానికే కేంద్రం ఇచ్చిన రుణ పరిమితి దాటి పోయింది. విద్యుత్‌ సంస్కరణల అమలు రూపేణా ఇచ్చిన అదనపు రుణాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. ఇక అప్పు తీసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఓవర్‌ డ్రాఫ్ట్‌లు, స్పెషల్‌ డ్రాయల్‌ లిమిట్‌ మీద ఆధారపడుతున్నది. ఇవి తాత్కాలిక సర్దుబాటు నిధులు మాత్రమే. ఇవి వెనువెంటనే తిరిగి చెల్లించాల్సినవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా తప్పనిసరిగా ఉద్యోగుల జీతభత్యాలు, విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్‌లు, వడ్డీలు, కొన్ని పథకాలకు చెల్లించాల్సిన వాటిని సకాలంలో చెల్లించలేకపోతున్నది.
         గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ -19 సృష్టించిన ఆర్థిక స్తంభన పరిమితమైన రాష్ట్రాల ఆదాయాలను దెబ్బతీశాయి. కేంద్ర బిజెపి సర్కారు అనుసరిస్తున్న పన్ను ఆదాయాల అసమాన పంపిణీ, పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో 61 శాతం కేంద్రమే ఉంచుకోవడం, సెస్‌, సర్‌ ఛార్జీ, ఇతర ఆదాయాలలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకపోవడం, కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించడం, సంపద పన్ను ఎత్తివేయడం, కస్టమ్స్‌ సుంకాల తగ్గింపు తదితర విధానాల వల్ల రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయి.
        రాష్ట్రాల అప్పుల సేకరణపై ఆంక్షలు పెట్టటం, రుణ సామర్థ్య పరిమితిలో కోతలు పెట్టటంతో...రాష్ట్రాలు తమ పరిధిలో రుణాలు సమకూర్చుకునేందుకు కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 8 ఏళ్ల కాలంలో దేశ అప్పు రెట్టింపై నేడు 138 లక్షల కోట్లకు ఎగబాకి దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 84 శాతానికి చేరింది. రాష్ట్రాల అప్పులపై మాత్రం గగ్గోలు పెడుతున్నది. రాష్ట్రాలు సేకరించుకునే ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను రాష్ట్రాల రుణ సామర్ధ్య పరిమితిలో మాత్రమే కల్పిస్తామని బెదిరిస్తున్నది. రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా కోత విధించాలని నానా యాగీ చేస్తున్నది.
కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా పెంచి రాష్ట్రాలపై భారం కూడా మోపుతున్నది. కోవిడ్‌ వ్యయాన్ని కూడా రాష్ట్రాలపైకి నెట్టింది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల జిఎస్‌టి ఆదాయంలో ఏర్పడుతున్న లోటును భర్తీ చేయటానికి ఇస్తున్న పరిహారాన్ని సైతం కేంద్రం నిలిపేసింది. వీటివల్ల అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది.
         కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చే చర్యలకు, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలో కేరళ, తమిళనాడు ఇతర అనేక రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కాని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నది. ఆంధ్ర రాష్ట్ర రెవిన్యూ లోటుకు చట్టప్రకారం చెల్లించాల్సిన నిధులకు కేంద్రం కోత పెడుతున్నా, జిఎస్‌టి ఆదాయ లోటు భర్తీ చేయకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్నా, ఈ ఏడాది రాష్ట్ర నికర రుణ సామర్థ్యంలో రూ.3600 కోట్లు కోత పెట్టినా ప్రభు భక్తితో వ్యవహరిస్తున్నది. కార్పొరేట్‌ పన్నులో కోత పెట్టినా కూడా స్పందించలేదు. చివరికి విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల్లో సగానికి సగం కోత పెడుతున్నా, పునరావాస నష్ట పరిహారం ఇవ్వనంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన విధంగా వ్యవహరించటంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఈ లొంగుబాటు విధానం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నది.
            రాష్ట్రాల ఆర్థిక వనరులపై కేంద్ర బిజెపి సాగిస్తున్న ఈ దాడికి వ్యతిరేకంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పోరాడకుండా అప్పుల కోసం రాష్ట్ర హక్కులకు, ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రయోజనాలకు, సంక్షేమానికి హాని చేసే చర్యలకు పాల్పడుతున్నది. కోవిడ్‌ను అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో అదనంగా 2 శాతం అప్పులు బహిరంగ మార్కెట్‌ నుండి తెచ్చుకోవటానికి రాష్ట్రాలకు అనుమతిస్తూ కొన్ని షరతులను విధించింది. ఒకే దేశం - ఒకే కార్డు, సులభతర వ్యాపారం, పట్టణ, విద్యుత్‌ రంగాల్లో పన్ను సంస్కరణలతో పాటు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయాలనే ఈ నాలుగు షరతులు అదనపు అప్పులు పొందే రాష్ట్రాలు అమలు చేయాలని నిబంధనలు విధించింది. ఈ ప్రమాదకర షరతులను అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించటమే కాక ఈ అప్పులను తిరస్కరించాయి. కొన్ని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ షరతులను నిరశించాయి. కాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పులకు తలూపి షరతులన్నింటిని ఆమోదించింది. కొన్ని షరతుల అమలుకు కూడా పూనుకుంది. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌ల అమలుకు రాష్ట్రంలో అన్ని చర్యలు చేపట్టింది. పట్టణ రంగంలో ఆస్తి పన్ను మదింపులో అద్దె విలువ పద్ధతిని మార్చేసి ఆస్తి విలువ పద్ధతిని తీసుకొచ్చి భారీగా ఆస్తి పన్ను పెంచేసింది. నీటి కుళాయిలకు నీటి మీటర్ల బిగింపు, పౌర సేవలన్నింటికి యూజర్‌ చార్జీల వసూలు, ప్రైవేటీకరణ చర్యలు చేపట్టటం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నది.
           విద్యుత్‌ రంగంలో ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చటం, వ్యవసాయ రంగ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించటం, దళిత, గిరిజనుల ఉచిత విద్యుత్‌ పథకానికి కోతలు పెట్టటం, సామాన్యుల విద్యుత్‌ వినియోగానికి ఇస్తున్న క్రాస్‌ సబ్సిడీకి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టటం, విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించటం వంటి చర్యలు చేపట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది.
ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగా విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలను ప్రజల నుండి వసూలు చేయడం, విద్యుత్‌ చార్జీలు పెంచటం చేస్తున్నది. కృష్ణపట్నం ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను కూడా అదానీ పరం చేశారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను కూడా రూ.645 కోట్లకు అదానీకి అమ్మేసింది.
          మద్యం అమ్మకాలు పెంచటం ద్వారా భారీగా ఆదాయం పొందే చర్యలకు వొడిగట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన దశల వారీ సంపూర్ణ మద్య నిషేధ వాగ్దానానికి తిలోదకాలిచ్చి దశలవారీ విస్తరణ కార్యక్రమం చేపట్టింది. బార్లు పెంచేసింది. గడిచిన 9 నెలల కాలంలోనే రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది. ఈ ఏడాది చివరికి రూ.28,440 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఇది చాలదన్నట్లు ఈ పెరుగుతున్న ఆదాయాన్ని చూపి ప్రభుత్వం ఈ శాఖ ద్వారా బ్యాంక్‌ల నుండి ఈ ఏడాది రూ.8300 కోట్ల అప్పు సేకరించింది.
          విచ్చలవిడిగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పెద్దఎత్తున ప్రభుత్వ భూములను, ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా రైతుల భూములను సేకరించి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అమ్మడం, తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు తరలించుకు పోవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అంతేగాక వీటి ద్వారా భూ మార్పిడి చార్జీలు, ఇంపాక్ట్‌ ఫీజుల ఆదాయాలు పెంచుకోవటానికి చూస్తున్నది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ భూమి పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌కు మారిపోయే ప్రమాదం ఏర్పడింది. స్టాంప్‌ డ్యూటీ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రతి ఏడాది భూముల మార్కెట్‌ విలువను పెంచేస్తున్నది. ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పులు కూడా సేకరిస్తున్నది.
           రాష్ట్రంలో చేపడుతున్న రామయపట్నం, భావనపాడు, బందర్‌ పోర్టుల నిర్మాణ బాధ్యతల నుండి ప్రభుత్వం వైదొలిగి (అప్పుల కోసం) ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయటానికి సిద్ధమైంది. అందుకే ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సిఎల్‌) సంస్థ నుండి అప్పులు తీసుకోవటానికి కూడా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ప్రైవేట్‌ రంగంలో లేదా ప్రభుత్వ - ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యం (పిపిపి) కింద చేపట్టే ప్రాజెక్టులకు అప్పులు ఇస్తుంది. అందువల్ల ఈ మూడు పోర్టులు త్వరలో ప్రైవేట్‌ సంస్థల పరం కానున్నాయి. ఈ చర్యల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు జమేసుకుంటుంది.
ఇప్పుడు అప్పుల ద్వారా ఆదాయం సేకరించుకునే మార్గాలు కూడా తగ్గిపోవడంతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడంపై కేంద్రీకరించింది. నవరత్నాల పథకాల లబ్ధిదారులను తగ్గించటానికి వివిధ రకాల షరతులు పెడుతున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థను బియ్యానికే పరిమితం చేసింది. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుకు పూనుకుంటున్నది. ఉద్యోగులకు నూతన పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీమును పునరుద్ధరించకపోవడం, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళకు పొడిగించటం, కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం వంటి చర్యలన్నీ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవటంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్నది.
       పట్టణ, గ్రామ స్థానిక సంస్థల యొక్క స్థానిక పన్నుల ద్వారా సమకూరే ఆదాయాలను కూడా సిఎఫ్‌ఎంఎస్‌ సంస్థ ఖాతాకి తరలించి రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటూ స్థానిక సంస్థల అభివృద్ధిని దెబ్బతీస్తున్నది. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే స్థానిక సంస్థలకు బదిలీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవటం లేదా విద్యుత్‌ బిల్లుల పేర జమేసుకోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నది. స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్‌ నుండి నిధులు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక సంఘం ఊసెత్తటం లేదు.
       బడ్జెట్‌లో వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన పెట్టుబడి వ్యయం నిధుల్లో కూడా భారీ కోత పెడుతున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.47996 కోట్లు పెట్టుబడి వ్యయంగా చూపించారు. ఇందులో కనీసం 30 శాతం కూడా నేటికీ ఖర్చు చేయలేదు. దీంతో అభివృద్ధి చర్యలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి.
         మొత్తంగా చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మోడీ సర్కారు చేపడుతున్న చర్యలు రాష్ట్ర ఆదాయ వనరులను దెబ్బతీస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం...మోడీ ప్రభుత్వానికి సలాం చేస్తున్నది. అడుగడుగునా లొంగుబాటు ప్రదర్శిస్తున్నది. అప్పుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల సంక్షేమాన్ని ఫణంగా పెడుతున్నది. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చర్యలు చేపడుతున్నది. ప్రజలపై భారాలు మోపుతున్నది. అవకాశవాద రాజకీయాలతో అరాచకపు ఆర్థిక చర్యలకు పాల్పడుతున్నది.

(వ్యాసకర్త సెల్‌ : 9490098792)
డా|| బి.గంగారావు

డా|| బి.గంగారావు