
ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీ పడినపుడు రిషి చెప్పారు. 2029 నాటికి ఆదాయ పన్నును 20 నుంచి 16 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్జర్వేటివ్ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించారు. అది పొరపాటని...తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్జర్వేటివ్ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలస వచ్చిన వారి సంతతికి చెందిన సునాక్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.
కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ కొత్త చరిత్రను సృష్టించాడు. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్‌ను బ్రిటన్ నూతన ప్రధానిగా బకింగ్‌హామ్ పాలెస్‌లో మంగళవారం నాడు రాజు ఛార్లెస్ నియమించాడు. ఏడు వారాలలో ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చారు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారటం బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు తాజా పరిణామాలు నిదర్శనం. బ్రిటన్ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్ ట్రస్ చరిత్రకెక్కారు. అంతకు ముందు ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కారణంగా ప్రధాని పదవికి కన్సర్వేటివ్ పార్టీలో జరిగిన పోటీలో సునాక్‌ను వెనక్కు నెట్టి ట్రస్ మొదటి స్థానంలో నిలవటంతో సెప్టెంబరు ఆరున ఆమె పదవి లోకి వచ్చారు (బ్రిటన్ పార్టీల నిబంధనల ప్రకారం పార్లమెంటులో పార్టీ నేతగా ఎన్నిక కావాలంటే నిర్ణీత సంఖ్యలో పార్టీ ఎంపీల మద్దతు పొందిన వారు పోటీ పడతారు. తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారికి ఆ పార్టీల సాధారణ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కరే ఉంటే ఏకగ్రీవం అవుతారు). ప్రధానిగా నియమితుడైన సునాక్ తొలిసారి మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, ఇతరులు డిమాండ్ చేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు భిన్నంగా పన్ను రాయితీలు ప్రకటించటంతో విమర్శలపాలు కావటమే కాదు, స్వంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత తలెత్తటంతో లిజ్ ట్రస్ ఇంటిదారి పట్టారు. తొలుత తాను రాజీనామా చేసేది లేదని బీరాలు పలికినా చివరకు తలొగ్గక తప్పలేదు. దీంతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది. ఈ సారి ప్రధాని పదవికి పోటీ పడేవారికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్నవారే అర్హులని నిర్ణయించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసులో నిలిచేందుకు పావులు కదిపినా ఆశించిన మద్దతు రాకపోవటంతో వెనక్కు తగ్గి పరువు నిలుపుకున్నారు. పార్లమెంటులో పార్టీ నాయకురాలు పెనీ మోర్డాంట్ అర్హతకు అవసరమైన మద్దతును కూడగట్టటంలో విఫలం కావటంతో చివరి క్షణంలో ఆమె కూడా తప్పుకోవటంతో సునాక్ ఒక్కరే మిగిలారు. లండన్ కాలమానం ప్రకారం అక్టోబరు 25వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు (మన దేశం కంటే నాలుగున్నర గంటలు వెనుక) తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లిజ్ ట్రస్ రాజీనామా ప్రకటించి రాజు ఛార్లెస్‌కు అందచేశారు. చివరి మంత్రి వర్గ సమావేశం తరువాత లిజ్ ట్రస్ పన్నుల తగ్గింపు విషయమై తన చర్యను సమమర్ధించుకున్నారు. అధికారంలో ఉన్న వారు ధైర్యంగా ఉండాలన్నారు.
సునాక్ పదవి నిజానికి ముళ్ల కిరీటం వంటిదే. లిజ్ ట్రస్ సెప్టెంబరు 23న మినీ బడ్జెట్‌గా పిలిచిన చర్యలలో కొన్ని ఇలా ఉన్నాయి. కార్పొరేట్ సంస్థల మీద పన్ను మొత్తాన్ని 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు భిన్నంగా 19 శాతానికి తగ్గించారు. జి-20 దేశాలలో ఇది కనిష్టం. మౌలిక ఆదాయపన్ను 20 నుంచి 19 శాతానికి తగ్గించారు. లక్షన్నర పౌండ్లకు మించి రాబడి ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 45 నుంచి 40 శాతానికి తగ్గించారు. బీమా పథకానికి పెంచిన 1.25 శాతం చెల్లింపును రద్దు చేశారు. ఇళ్ల కొనుగోలుపై పన్నుల తగ్గింపు, పన్ను తగ్గింపు జోన్ల ఏర్పాటు, అక్కడ నిబంధనలను నీరు గార్చటం, టూరిస్టులు తాము చెల్లించిన అమ్మకపు పన్నును తిరిగి తీసుకొనే వెసులుబాటు, మద్యంపై పెంచిన పన్నుల తగ్గింపు....నలభై ఐదు బిలియన్ పౌండ్ల మేర ఖజానాకు గండిపడే చర్యలివి. నిజానికి ఈ కారణంగా ఆమె పదవిని కోల్పోవటం పెట్టుబడిదారీ వ్యవస్థలో చిత్రంగానే కనిపించవచ్చు. దీని వలన దేశ లోటు, రుణ భారం మరింతగా పెరగనుంది, సంక్షేమ చర్యలకు కోత పడుతుంది. ఇప్పటికే కార్మికులు, మధ్యతరగతి వారి మీద గతంలో పెంచిన పన్నులు, ఇటీవలి కాలంలో ధరల పెరుగుదలతో జీవన వ్యయం విపరీతంగా పెరిగి జనజీవితాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్లు, ధనికులకు ప్రకటించిన రాయితీలు తీవ్ర విమర్శలకు, అధికార పార్టీలో కుమ్ములాటలకు దారి తీశాయి.
ఏ క్షణంలోనైనా ఆర్థిక రంగం మాంద్యంలోకి జారనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 10.1 శాతం దాటింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రుణాల భారం పెరుగుతుంది. మరోవైపు పౌండు విలువ దారుణంగా దిగజారింది. అధికారపక్ష పలుకుబడి అథమ స్థాయికి పడిపోయింది. ట్రస్-రిషి ఇద్దరూ ఒకే తానులో ముక్కలైనా అనుసరించే పద్ధతుల్లో మాత్రమే తేడా. 2024 వరకు పార్లమెంటు గడువు ఉన్నందున వెంటనే ఎన్నికలు జరగాలని టోరీ పార్టీ కోరుకోవటం లేదు. ఇంకా తగినంత గడువు ఉన్నందున ఆర్థిక రంగాన్ని పునరుజ్జీవింపచేసి, జీవన ప్రమాణాలను పెంచి ఓటర్ల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోవటం ఖాయం. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ద్వారా లోటు బడ్జెట్ తగ్గింపు, పన్నుల పెంపును ఐఎంఎఫ్ కోరుతున్నది. ఇదే జరిగితే కార్మికుల జీవితాలు మరింతగా దిగజారతాయి. అందువలన రానున్న రోజుల్లో రిషి సునాక్ కత్తి మీద సాము చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న తన విధానాల గురించి సునాక్ చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
పెరిగిన ఇంథన, ఆహార, ఇతర వస్తువుల ధరల తగ్గింపు, నిజవేతనాల పెరుగుదల కోసం జనాలు చూస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని సునాక్ చెప్పారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 జులై వరకు ఆర్థిక మంత్రిగా పని చేసిన సునాక్ 1950 దశకం తరువాత తొలిసారిగా పన్నుల భారాన్ని పెంచారు. ప్రభుత్వ ఖర్చునూ పెంచారు. ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీ పడినపుడు రిషి చెప్పారు. 2029 నాటికి ఆదాయ పన్నును 20 నుంచి 16 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్జర్వేటివ్ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించారు. అది పొరపాటని...తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్జర్వేటివ్ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలస వచ్చిన వారి సంతతికి చెందిన సునాక్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు తాను గర్విస్తానని అన్నారు. ఆర్థిక రంగ సమస్యలను నిర్ధారించి, పార్టీని ఐక్య పరచి దేశాన్ని ముందుకు తీసుకుపోతానని సునాక్ చెప్పారు. విధ్వంసం జరిగిన ప్రాంతంలోకి సునాక్ అడుగుపెడుతున్నారని ఒక టీవీ వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వ ఖర్చును 30 బిలియన్ పౌండ్ల మేర తగ్గించటం లేదా ఆ మేరకు అదనపు రాబడిని చేకూర్చాల్సి ఉంది. రానున్న మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ రుణ భారాన్ని తగ్గిస్తామన్న వాగ్దానాన్ని కూడా అమలు జరపాల్సి ఉంది.
సునాక్ ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? అనేది కాదు. వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నారు ? అన్నది కీలకం.
ఎం. కోటేశ్వరరావు