
బిజెపి వ్యతిరేక కూటమి ఎలా ఏర్పడుతుంది, దానికి నాయకత్వం ఎవరిది వంటి ప్రశ్నలపై అనేక సందేహాలు వ్యక్తమైనాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్‌లో నితీష్ కుమార్ వంటి వారు కూడా నాయకత్వం కోసం లేదా ప్రధాని స్థానం కోసం ఆశిస్తున్నట్టు అర్థమైంది. వీరిలో మమతపై ఇ.డి దాడులు జరిగాక ఆరెస్సెస్ కీర్తనలు మొదలెట్టారు. నితీష్ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూ తనది మరో మార్గమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్‌సిపి శరద్ పవార్ తమకు నాయకత్వ ఆశలు లేవన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందు నుంచి కూడా ఎన్నికల తర్వాతే కూటమి వంటివి చర్చకు వస్తాయని స్పష్టంగా చెబుతూనే వున్నారు. అనంతర పరిణామాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం విపరీత స్థాయికి చేరిన మోడీ సర్కారు నిరంకుశ పోకడల ప్రతిఘటన, సమాఖ్యతత్వం, లౌకికతత్వం కాపాడుకోవడం కీలకమనే కోణంలో కెసిఆర్ ప్రయత్నాలు ఆహ్వానించదగినవిగా మారాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కొద్దిమాసాలుగా చెబుతున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)గా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు తమ రాష్ట్ర సమావేశంలో ఆమోదించిన తీర్మానం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందుంది. ఆ ప్రక్రియ ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు. ఈలోగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం పాత పేరుతోనే పాల్గొంటున్నారు. అత్యంత కీలకమైన ఈ ఉప ఎన్నికలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపున బిజెపి సామదానభేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షాలతో సహా ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో పాటు బిఆర్‌ఎస్ ప్రభావంపైనా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఆసక్తి నెలకొన్నది. దక్షిణ భారతదేశంలో బలంగా కాలూనాలని చూస్తున్న బిజెపికి ఇది సవాలుగా మారనున్నది.
టిఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్ దిశగా
ఒక ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని జాతీయ పార్టీగా మారడం అరుదైన విషయమే. కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలను మాత్రమే జాతీయ పార్టీలుగా పరిగణించడం కద్దు. నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓటింగు లేదా పార్లమెంటులో మూడు రాష్ట్రాల నుంచి రెండు శాతం సీట్లు(4), మూడు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు, కాదంటే నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన వాటిని జాతీయ పార్టీలుగా పరిగణించడం జరుగుతుంది. ఒక సారి వచ్చే గుర్తింపును తదుపరి రెండు ఎన్నికలలో ఒకసారైనా నిలుపుకోగలిగితే హోదా కొనసాగుతుంది. లేదంటే రద్దవుతుంది. తెలంగాణలో ఎలాగూ అవసరమైన సీట్లు తెచ్చుకోగల బిఆర్‌ఎస్ మరో రెండు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు తెచ్చుకోగలిగితే జాతీయ పార్టీ కావచ్చు. మరి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించి, తెలంగాణ సాధనను పూర్తి చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌కు ఆ అవకాశం ఏ మేరకు వుంటుందని ప్రతివారూ లెక్కలు వేస్తున్న స్థితి. తెలంగాణ సెంటిమెంటు ప్రధానంగా విజయం సాధించిన టిఆర్‌ఎస్ రాష్ట్రం పేరు స్థానే బిఆర్‌ఎస్ గా మారితే ఆ సెంటిమెంటు ఏమవుతుందనే సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలలో గాని ప్రజలలో గాని ఏ సెంటిమెంటు వున్నా అదొక్కటే ఎల్లకాలం అలాగే వుంటుందని అది మాత్రమే గెలిపిస్తుందని ఎవరూ అనుకోరు. కెసిఆర్ కూడా రాష్ట్ర ఏర్పాటు దిశలో అడుగులు వేస్తున్న కొద్ది తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోతుందని గెలవడానికి తగు ఎత్తుగడలు అనుసరిస్తుందని సూటిగానే ప్రకటించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న టిడిపి, జాతీయంగా బలహీనపడిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను సామూహికంగా తమలో కలుపుకున్నారు. బిజెపి కూడా ఈ క్రమంలో బలహీనపడిపోయినా 2019 పార్లమెంటు ఎన్నికలలో ఉభయులూ పార్లమెంటు స్థానాలు సాధించి అధికార పోరాటం తీవ్రం చేశారు. అందులోనూ మోడీ నాయకత్వం కేంద్రీకరించి తెలంగాణ శాఖకు మద్దతునివ్వడం, దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్‌ఎంసి ఫలితాలు వారిలో ఆశలు పెంచాయి. టిఆర్‌ఎస్‌లో చర్యకు గురైన ఈటల రాజేందర్ బిజెపిలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించడం మరింత ప్రచారం తెచ్చింది. ఆ తర్వాత నాగార్జున సాగర్‌లో ఓడిపోయినా మునుగోడులో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఎన్నికల ముందు సవాలుగా తయారైంది.
ఎ.పి, తెలంగాణ, ఇతర చోట్ల...
ఇదే కాలంలో దేశంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు రాష్ట్రాల హక్కులపై దాడి, నిధుల నిరాకరణ, మతతత్వ రాజకీయాలు ముదిరిపోవడంతో కెసిఆర్ వాటిని నిశితంగా విమర్శించడమే గాక గట్టిగా ఎదుర్కోవడం వాతావరణాన్ని మార్చివేసింది. ఆయన తమతో మంచిగా వున్నప్పుడు కొంత ఉపేక్షా భావం చూపిన కేంద్రం ఇప్పుడు అడుగడుగునా కక్షగట్టి వ్యవహరించడం మొదలెట్టింది. ఎ.పి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రాజకీయంగా బిజెపితో మంచిగా వుండటమే గాక పాలనాపరంగా రాష్ట్రానికి రావలసిన వాటి కోసం కూడా గట్టిగా పోరాడని స్థితి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతసారి బిజెపితో కలసి అధికారం చేసి ఆఖరులో వ్యతిరేకించినా ఓటమి తర్వాత మళ్లీ మౌనం దాల్చారు. ఇప్పటికే జనసేనతో కలసి వున్న బిజెపితో జట్టుకట్టే అవకాశం గురించి టిడిపి నిరంతరం కథనాలు ఇస్తూంది. బిజెపి వాటిని తోసిపుచ్చుతూ ఆయనపై ఆయన పార్టీపై తీవ్ర విమర్శలే చేస్తూన్నా టిడిపి స్పందించడానికి సంకోచిస్తోంది. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిధులు, రెవెన్యూ లోటు ఇలా చాలా విషయాల్లో కేంద్రం సహాయ నిరాకరణ చేసినా రెండు ప్రధాన పార్టీలు నోరెత్తని దుస్థితి. బిజెపి మత రాజకీయాలపై ఏకపక్ష పోకడలపై మాట్లాడింది అసలే నాస్తి. ఆలయాల సమస్యలతో సహా బిజెపి తీవ్ర వివాదాలు సృష్టిస్తున్నా ఆ పార్టీల్లో మార్పు లేదు. మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపికి లోబడి వ్యవహరిస్తుంటే వామపక్షాలు మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలతో సహా కీలక సందర్భాలలో ఆ మూడు పార్టీలు మోడీకి మద్దతిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ కూడా బిజెపిపై పోరాటం కన్నా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం పైనే దాడి కేంద్రీకరిస్తున్న స్థితి.
ఈ నేపథ్యంలో కెసిఆర్ బిజెపి వినాశక విధానాలపై గట్టిగా నిలబడటం. ఆ దిశలోనే జాతీయ పార్టీగా మారడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికన్నా ముందు దేశంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి వచ్చిన కెసిఆర్ ప్రయత్నాలకు సానుకూలత లభించింది. అయితే బిజెపి వ్యతిరేక కూటమి ఎలా ఏర్పడుతుంది, దానికి నాయకత్వం ఎవరిది వంటి ప్రశ్నలపై అనేక సందేహాలు వ్యక్తమైనాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్‌లో నితీష్ కుమార్ వంటి వారు కూడా నాయకత్వం కోసం లేదా ప్రధాని స్థానం కోసం ఆశిస్తున్నట్టు అర్థమైంది. వీరిలో మమతపై ఇ.డి దాడులు జరిగాక ఆరెస్సెస్ కీర్తనలు మొదలెట్టారు. నితీష్ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూ తనది మరో మార్గమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్‌సిపి శరద్ పవార్ తమకు నాయకత్వ ఆశలు లేవన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందు నుంచి కూడా ఎన్నికల తర్వాతే కూటమి వంటివి చర్చకు వస్తాయని స్పష్టంగా చెబుతూనే వున్నారు. అనంతర పరిణామాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం విపరీత స్థాయికి చేరిన మోడీ సర్కారు నిరంకుశ పోకడల ప్రతిఘటన, సమాఖ్యతత్వం, లౌకికతత్వం కాపాడుకోవడం కీలకమనే కోణంలో కెసిఆర్ ప్రయత్నాలు ఆహ్వానించదగినవిగా మారాయి.
బిఆర్‌ఎస్ విస్తరణ, అవకాశాలు
కెసిఆర్ జాతీయ పార్టీ అంటున్నంత మాత్రాన దేశమంతా ఆ పార్టీ వున్నఫలాన విస్తరించడం జరగదు. వాస్తవిక, రాజకీయ సాంకేతిక దశలు వున్నాయి. కెసిఆర్ తొలి ప్రాధాన్యత తెలంగాణ కాగా అక్కడ బలం నిలబెట్టుకోవడం పైనే తదుపరి పాత్ర ఆధారపడి వుంటుంది. స్వయాన కెటిఆర్ సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. ఒకప్పటి నైజాం సంస్థానంలో భాగాలుగా వున్న నైజాం కర్ణాటక, మహారాష్ట్ర లోని మరాట్వాడా ప్రాంతాలు తమ తొలి కార్యక్షేత్రంగా వుంటాయని వారు చెబుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నేత కుమారస్వామి స్వయంగా ఈ సభలో పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ పూర్వపు నిజాం ప్రాంతంలో పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని రాష్ట్ర శాసనసభలో తమకు మద్దతునిస్తుందని కుమారస్వామి ప్రకటించారు. మహారాష్ట్రలో శివసేన స్పందించలేదు గాని బిజెపి వ్యతిరేక శక్తిగావుంది. మరాట్వాడాలో పోటీకి బిఆర్‌ఎస్ తప్పక ప్రయత్నిస్తుంది.
వీటన్నిటినీ మించి పొరుగు తెలుగు రాష్ట్రమైన ఎ.పిలో కెసిఆర్ ఏం చేస్తారనేదానిపై చాలా చర్చ నడుస్తున్నది. గత విభజన నాటి పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎ.పి లో ఆదరణ పొందడం కష్టసాధ్యమనే బలమైన అభిప్రాయం వుంది. జగన్‌కు కెసిఆర్ ప్రభుత్వాలకు గతంలో సాన్నిహిత్యం వున్నా ఇటీవల వివిధ ద్వైపాక్షిక సమస్యలు పరిష్కారం గాక ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరస్పర విమర్శలు కూడా చూస్తున్నాం. వైసిపి బిజెపితో కలసి పోటీ చేయదుగాని మోడీ విధానాలపై పోరాటం దాని ఎజెండాలో లేదు. ఏమైనా బిఆర్‌ఎస్ వల్ల తమకేమీ నష్టం లేదని వైసిపి నేతలు మంత్రులు ప్రకటించారు. తమకు రాష్ట్రమే ముఖ్యమని కూడా స్పష్టం చేశారు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిఆర్‌ఎస్‌పై వ్యాఖ్యానం దాటేస్తే కొందరు నాయకులు మాత్రం తీవ్రంగానే స్పందించారు. మరికొందరు ఇతరులు కూడా విభజన ఉద్యమ సమయంలో కెసిఆర్ మాట్లాడిన తీవ్ర పదజాలాన్ని గుర్తుచేస్తున్నారు. ఏమైనా కాలం గడిచే కొద్దీ ప్రజలు రెండు చోట్ల రాజకీయంగా వాస్తవికంగా ఆలోచిస్తారు గాని వాటిలోనే చిక్కుకుని వుండకపోవచ్చు. కెసిఆర్ ఈ కసరత్తులో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆయన ఇప్పుడు ప్రత్యక్ష పాత్ర వహించే అవకాశం వుండకపోవచ్చు. టిడిపిలో కెసిఆర్ తమ పూర్వ సహచరులను కొందరిని కూడగడుతున్నారని కథనాలు వున్నాయి. ఎ.పి లో పెద్ద సభ జరుపుతారని వార్తలు వచ్చినా తమ తొలి ప్రాధాన్యతల్లో ఎ.పి లేదని బిఆర్‌ఎస్ నేతలు చెప్పేశారు. చంద్రబాబు తెలంగాణలో తల దూర్చినప్పుడు తామెందుకు ఎ.పి రాకూడదని కూడా కొందరు ప్రశ్నించారు. తమిళనాడు నుంచి వికెసి ఎం.పి వచ్చి పాల్గొనగా ఆ పార్టీనే విలీనం చేస్తారని ముందు సూచనలు వచ్చాయి. అదే జరిగితే అక్కడ డిఎంకె కూటమిలో చేరినట్టవుతుంది. ఇతర ప్రాంతీయ పార్టీలేవీ కోరి బిఆర్‌ఎస్‌ను ఆహ్వానించవనేది స్పష్టమే.
దేశంలో మొత్తం 100 స్థానాల్లో బిఆర్‌ఎస్ పోటీ పెడుతుందని ఒక వార్త కాగా యాభై స్థానాలపై కేంద్రీకరిస్తుందని మరో లెక్క. కెసిఆర్ హిందీలో బాగా మాట్లాడటం ప్రజలను ఆకట్టుకుంటుందని ఆయన సన్నిహితుల మాట. కొందరు రైతు ప్రతినిధులను ఆహ్వానించిన కెసిఆర్ వారి సహాయంతో ఉత్తరాదిన ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ముందు ముందు తేలాల్సిందే. బిజెపికి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్ స్థానముంటుందా అనేదానిపై కూడా బిఆర్‌ఎస్ దాటేస్తున్నది. కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌ను బిజెపి బి టీం అంటూ పార్టీ ఏర్పాటును తెలంగాణ అస్తిత్వ హత్యగా కొట్టిపారేశారు. బిజెపి కూడా ఇదేవిధంగా మాట్లాడింది. త్వరలోనే కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా ఇడి దాడులను ఎదుర్కొనవలసి వుంటుందని గట్టి సూచనలిస్తున్నారు. ఈ దాడులకు గురవుతున్న వారిలో ఇరు రాష్ట్రాల సంస్థలూ వున్నాయి. కనుక రాబోయే రోజులలో రాజకీయంగా తీవ్ర పరిణామాలే చూడటం అనివార్యం కావచ్చు.
తెలకపల్లి రవి