Oct 20,2023 07:12

           ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశాల్లో పెన్షన్‌ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్న నూతన పెన్షన్‌ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడవ వలసిన జీవితాలు ఈ విధానంతో ప్రశ్నార్ధకంగా మారుతుండటమే దీనికి కారణం. శక్తియుక్తులన్నీ ఉద్యోగులుగా ఖర్చు చేసిన తరువాత, మిగిలిన జీవితాన్ని గౌరవప్రదంగా గడపడానికి ఉద్దేశించిందే పెన్షన్‌! అయితే, అటువంటి పరిస్థితి నిజంగా ఉందా అంటే లేదు అన్నదే సమాధానం. అనేక రంగాల మాదిరే ఈ విషయంలోనూ మనదేశానిది అథమస్థానమే.అమెరికాకు చెందిన కన్సల్టింగ్‌ కంపెనీ మెర్సర్‌, స్వచ్ఛంద సంస్థ సిఎఫ్‌ఎ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన తాజా ప్రపంచ పెన్షన్‌ సూచీ (2023)లో భారతదేశ స్థానం చివరి నుండి మూడవది ! మొత్తం 47 దేశాల్లో ఆ సంస్థ సర్వే నిర్వహించగా భారత్‌ 45వ స్థానంలో నిలిచింది. 2022 లో 44 దేశాలకుగాను మన దేశం 41 వ స్థానంలో నిలిచింది. అంటే గత ఏడాదితో పోల్చినా మన స్థానం మరింత దిగజారిందన్నమాట. ఇదీ సీనియర్‌ సిటిజన్లకు మనం ఇస్తున్న గౌరవం! ఈ వాస్తవాన్ని గుర్తించి, మెరుగైన విధానాన్ని రూపొందించడానికి మన పాలకులు సిద్ధపడకపోవడమే విచారకరం. ప్రపంచ ఆకలి సూచీ రిపోర్టును తిరస్కరించినట్టే దీనిని కూడా మోడీ ప్రభుత్వం తిరస్కరించింది. 2021లో పెన్షన్‌ సూచీలో భారత్‌ చివరిస్థానంలో నిలవడంతో పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై వివిరణ ఇచ్చిన ప్రభుత్వం ఆ సూచికలో విశ్వసనీయ సమాచారం లేదని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని ప్రకటించింది. ఆ తరువాతైనా పెన్షన్‌ విధానంలో మెరుగైన మార్పులు తీసుకువచ్చిందా అంటే అదీ లేదు. ఏటికేడాది దిగదిడుపే !
             నిజానికి, మెర్సర్‌-సిఎఫ్‌ఎ ఇన్‌స్టిట్యూట్‌ గత పదిహేను సంవత్సరాలుగా విడుదల చేస్తున్న గ్లోబల్‌ పెన్షన్‌ ఇండెక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.తాజా సర్వేను 64 శాతం ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా 47 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఆ దేశాల్లోని పెన్షన్‌ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు, 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వేలో 85 పాయింట్లతో నెదర్లాండ్స్‌ మొట్టమొదటి స్థానంలో నిలవగా, 83.5 పాయింట్లతో ఐస్‌ల్యాండ్‌ రెండవ స్థానంలో, 81.3 పాయింట్లతో డెన్మార్క్‌ మూడవ స్థానంలో నిలిచాయి. 45వ స్థానంలో నిలిచిన భారత్‌కు 45.9 పాయింట్లు దక్కగా, 42.3 పాయింట్లతో అర్జెంటీనా చిట్టచివరన నిలిచింది. అమెరికాతో పాటు మధ్యస్థంగా ఉన్న అనేక దేశాలు తీసుకురావాల్సిన మార్పులను పేర్కొన్న నివేదిక, చైనా, కొరియా, సింగపూర్‌, జపాన్‌ వంటి దేశాలు మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో భారత్‌ పనితీరుపై అది పెదవి విరిచింది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా దుర్భరమౌతున్న బతుకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులు, అంతకంతకు భారమౌతున్న వైద్య ఖర్చుల తీరును ప్రస్తావించిన నివేదిక వీటిని తట్టుకునే విధంగా పెన్షన్‌ విధానాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
        మెరుగైన పెన్షన్‌ విధానం కోసం దేశంలోనూ, ప్రత్యేకించి మన రాష్ట్రంలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సాగిస్తున్న పోరాటాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన జీవితం కోసం పాత పెన్షన్‌ విధానం కావాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా కంట్రిబ్యూషన్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ను వీరు తిరస్కరిస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధ్యం కాదని, ఖజానాపై పెను భారం పడుతుందని చెబుతుండటం విచిత్రం! ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొండి వైఖరికి నిరసనగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. క్షేత్రస్థాయికి పోరాటాన్ని తీసుకుపోవడంలో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లోనూ దీక్షలు చేపట్టనున్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామన్న పార్టీకే రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ఉపాధ్యాయ నేతలు ఇచ్చిన పిలుపు అత్యంత సముచితమైనది. గౌరవప్రదమైన పెన్షన్‌ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. ఉద్యోగుల హక్కు! అని నినదిస్తూ ఇటీవల ఢిల్లీలో భారీ ర్యాలీ జరిగింది. రాష్ట్రంలోనూ అంచెలంచెలుగా ఈ పోరాటం విస్తృతమౌతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలి.