ప్రజాశకి - విశాఖపట్నం : విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.ఎస్ రావు(93) బుధ వారం కన్నుమూశారు. గత ఆరేళ్ళగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక ద్వారకానగర్ 5వ లైన్‌లోని తన ఇంటి వద్దనే నిద్రలో ఉండగా కన్నుమూశారు. అతని పూర్తి పేరు చాగంటి సుందరరావు. అయితే సి.ఎస్ రావు గానే నగర ప్రజలకు తెలుసు. ప్రజా స్పందన పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై ఆయన తీవ్ర పోరాటం సాగించారు. నగరంలో ఎల్‌ఐసి భవనానికి ఎదురుగా ఉండే విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని అడవివరం ప్రాంతానికి తరలించారు. ఆ సమయంలో పాత జైలు ప్రాంతంలో అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం గత ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే ఆ స్థలంలో ఉన్న పెద్ద పెద్ద వక్షాలను తొలగించడానికి తప్పుపడుతూ ప్రజాస్పందన వ్యవస్థాపకుడు సి.ఎస్ రావు న్యాయ పోరాటం చేశారు. ఆ పోరాటానికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో ప్రభుత్వం అక్కడ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని విరమించుకొని, అందమైన పార్కును నిర్మించింది. వైయస్సార్ సెంటర్ పార్కుగా నగరంలో ఇది ఎంతగానో ఆకర్షణీయమైన పార్కుగా పేరుపొందింది. కాగా సి.ఎస్.రావు మతి పట్ల నగరంలో పలువురు సంతాపం తెలిపారు.