
- సరిచేయకుండానే మూడో విడతకు సిద్ధమైన ప్రభుత్వం
- లబోదిబోమంటున్న యజమానులు
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం అంటిపేట రెవెన్యూ పరిధిలో రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి అప్పలనాయుడుకు 2.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల చేపట్టిన జగనన్న సమగ్ర భూ సర్వే అనంతరం ఆయన పేరున 70 సెంట్లు మాత్రమే పాస్‌బుక్‌లో నమోదైంది. అదే రెవెన్యూ పరిధిలోని పనుకుపేటకు చెందిన తెర్లి శంకరరావు పేరున కొంత, అంటిపేటకు చెందిన ఆర్నిబిల్లి స్వామినాయుడు పేరున మరికొంత నమోదైపోయింది. శంకరావు ఫొటోతో కూడిన పాస్‌బుక్‌లో మాత్రం అప్పలనాయుడు పేరు ఉంది. ఆధార్ నంబర్ మాత్రం శంకరరావుదే.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం రెడ్డివానివలసకు చెందిన రెడ్డి సత్య నారాయణకు అదే గ్రామంలో 3.80 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తరువాత కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకంలో 2.20 ఎకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన 80 సెంట్లు లెక్క కనిపించడం లేదు. ఆయనకు సంబంధంలేని సర్వే నెంబరు 127-5లో 13 సెంట్లు కొత్తగా నమోదు చేశారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోటకు చెందిన కె.కృష్ణమూర్తి అదే గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 136-9, 136-10, 136-15, 136-16, 136-20లలో 94 సెంట్ల భూమినిసుమారు 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. తాజా సర్వే అనంతరం ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పుస్తంలో ఆయా సర్వే నెంబర్లకు బదులు 136-9పి, 138-2పి, 136-1, 136-3 కనిపిస్తున్నాయి.
ఇటువంటివి పార్వతీపురం మన్యం జిల్లాల్లోనే కాదు విజయనగరం జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్నట్లు సమాచారం. భూ విస్తీర్ణం తగ్గిపోవడం, ఒకరి భూమి మరొకరికి దఖలు పల్చడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 983 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడత 179 గ్రామాల్లో వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పేరిట ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టింది. రెండో విడతలో మరో 198 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి, మలి విడతల్లో జరిగిన తప్పులను సరిచేయకుండానే ప్రస్తుతం మూడో విడతలో 160 గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి, మలి విడతల్లో సర్వే పూర్తి చేసిన చోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలను యజ మానులకు అందజేశామని అధికారులు చెబుతు న్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్టు ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ఈ నెల 18న సర్వే పనులను సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం వచ్చే ఏడాది జనవరిలోపు మూడో విడత సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. తగినంతగా సాంకేతిక వ్యవస్థ, సిబ్బంది లేకపోవడం, స్వల్పకాల వ్యవధిలో పని పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల జిల్లా అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తోన్న సమావేశాలతో మండల సర్వేయర్లు, విఆర్‌ఒ, విఆర్‌ఒలపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో, సర్వే సమయంలో పక్కపక్కన ఉన్న భూముల యజమానులను కూడా సంప్రదించకుండా, అభ్యంతరాలు, సందేహాలు నివృత్తి చేసేందుకు గ్రామంలోనే తహశీల్దార్ ఆధ్వర్యాన మొబైల్ కోర్టులు వంటివి ఏర్పాటు చేయకుండా పనిముగించి హడావుడిగా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్నారు. దీంతో, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వెబ్‌ల్యాండ్ నమోదులో జరిగినట్టే ప్రస్తుత రీసర్వేలో కూడా తప్పులు దొర్లుతున్నాయి. ఇందులో వచ్చిన తప్పులను సరిచేయడం అంత సులువు కాదని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
పదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో పట్టాదారు పాసుపుస్తకం
సర్వే పూర్తయిన పలు గ్రామాల్లో 'ప్రజాశక్తి' పరిశీలించగా అనేక లోపాలు, తప్పుల తడకలు వెలుగులోకి వచ్చాయి. సీతానగరం మండలం అంటిపేట రెవెన్యూ పరిధిలోని రెడ్డివానివలసకు చెందిన రెడ్డి శ్రీదేవి భర్త శ్రీరామ్మూర్తి కోవిడ్ బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో రీసర్వేలో తన పేరున నమోదు చేసి పట్టా ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకన్నారు. అయితే, పదేళ్ల క్రితం చనిపోయిన శ్రీదేవి మామ అప్పలనాయుడు పేరున అధికారులు పట్టాదారు పాస్‌బుక్ జారీ చేశారు. తమ గ్రామంలో చేపట్టిన రీసర్వేలో 90 శాతం తప్పులు, తడకలు నమోదయ్యాయని రెడ్డివానివలస రైతులు, రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.