ఆదిలో హమాస్ దాడి పట్ల వ్యతిరేకత వ్యక్తమైనా, క్రమేణా ఇజ్రాయిల్ భీకర యుద్ధ దాడుల పట్ల జుగుప్స కలుగుతున్నది. నేతలు ఇంత అమానవీయంగా ఉంటారా! అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అగ్ర దేశాల్లో ఇజ్రాయిల్ సంపన్న యూదుల పెట్టుబడుల దృష్ట్యా ఆ దేశాల మద్దతు తాత్కాలికంగా లభించినప్పటికీ...అంతిమంగా శ్రమించే మానవాళి, మానవత్వమే ప్రపంచ గతికి మూలమని ఈ నేతలు ఎప్పటికి గ్రహిస్తారో
అణచివేతలు-ఆక్రమణలు ఉన్నప్పుడు తిరుగుబాట్లు -ప్రతిఘటనలు తప్పవు. అవి హింస అయితే ఇవి కూడా హింస అవుతాయి. రాజ్యహింసకు ప్రతిహింస చెలరేగక మానదు. ఆత్మరక్షణా పోరాటం అనేది మానవ స్వభావంలోనే ఉంటుంది. ఒక్కోసారి ఈ దాడులు-ప్రతిదాడులు చినికి చినికి గాలివానగా మారి యుద్ధ రూపాలుగా సంతరించు కుంటాయి కూడా.
అందుకే ఇజ్రాయల్-పాలస్తీనా యుద్ధపోరును తక్షణం భేషరతుగా శాంతింపజేయాలని ప్రపంచ మానవాళి కోరు కుంటున్నది. యుద్ధం జరుగుతున్న వేళ అమాయక ప్రజలు వేలాదిగా ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు గావడం, కొంపా గోడు వదలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పారిపోవడం, చూస్తుండగానే కట్టడాలు నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ భయంకర విధ్వంసం క్షణక్షణం పెరగడమేకాదు, ఇతర ప్రాంతాలకూ ఈ యుద్ధం విస్తరిస్తుంది. యుద్ధ జ్వాలలు, దావాగ్నిలా మారకముందే ఆర్పడం విచక్షణ అనిపించుకుంటుంది.
శవాలపై బొగ్గులు ఏరుకున్న చందంగా కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనం కోసం ఈ యుద్ధ మంటల్లో సైతం చలి కాచుకోడానికి వెనుకాడరు. అందుకే అన్నాడు మహాకవి శ్రీశ్రీ 'బలవంతులు దుర్భల జాతిని బానిసలను కావించారు. నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి'.
ఎప్పటికప్పుడు వారు తమ పబ్బం గడుపుకుంటూ మీనమేషాలు లెక్కిస్తుంటారు. ఉగ్రవాదాన్ని కేవలం ఆయుధాలతో అణచి వేయగలమని మూర్ఖత్వంతో వెర్రి ప్రేలాపనలు పేలుతుంటారు. ఉగ్రవాదం పుట్టుకకు, పెరుగుదలకు తామూ పరోక్ష కారకులమన్న విషయమే తెలుసుకోరు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ఈ విషయంలో సరిగానే స్పందించారు. ఇజ్రాయిల్‌పై పాలస్తీనా ప్రజాపోరు సంస్థ 'హమాస్' దాడి (20 రోజుల క్రితం) ఒక్కసారిగా జరిగింది కాదని, శూన్యం నుండి అకస్మాత్తుగా ఊడిపడిన పిడుగుపాటు అసలేకాదని కుండబద్దలు కొట్టారు. ఐ.రా.స దినోత్సవం సందర్భంగా భద్రతా మండలి మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తన ఆవేదనను వెలిబుచ్చారు.
'ఇజ్రాయిల్ ఆక్రమణలతో గత 56 ఏళ్ళుగా పాలస్తీనియన్లు అణచివేతకు గురౌతున్నారు. సెటిల్మెంట్లు, దందాలు, భయపెట్టే హింసాత్మక చర్యలతో వారు తమ భూమిని కోల్పోయారు. ఇళ్ళు లేక నిరాశ్రయులయ్యారు. తమ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభిస్తుందనే ఆశను వారు కోల్పోయారు. అందుకే హమాస్ దాడులు. అయితే దాడులు పరిష్కారం కాదు. అదే సందర్భంలో హమాస్ దాడులు చేసిందనే పేరుతో పాలస్తీనియన్లను యుద్ధరూపేణా శిక్షించాలని ఇజ్రాయిల్ నేతలు భావించడం సరికాదు. సమర్థనీయం కాదు. తక్షణం యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పండి' అని విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల ఏర్పాటు (ఇజ్రాయిల్-పాలస్తీనా) మాత్రమే సమస్యకు పరిష్కారమని ఆయన సూచించారు.
యూదు వ్యతిరేకతను, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్వమత ఛాందస శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఉద్బోధించారు. ఇజ్రాయిల్ వారు తమ రక్షణ కోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అదేవిధంగా పాలస్తీనియన్లు తమ స్వతంత్ర దేశ ఆకాంక్షలు నెరవేరేలా హమాస్ ఆచితూచి అడుగేయాలని కోరారు. ఉభయులు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించి నడుచుకోవాలని, లేని పక్షంలో క్షణక్షణం గాజా పరిస్థితి యుద్ధ ఊబిలో కూరుకు పోతుందని హెచ్చరించారు. యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించే పెను ప్రమాదం ఎంతో దూరంలో లేదని, దగ్గర్లోనే పొంచి ఉన్నదని, మరిన్ని ప్రాణాలు బలి కాకముందే మేలుకొమ్మని నేతలకు సూటిగానే చెప్పారు.
గాజాలో పౌరులు, పసిపిల్లలు నేలకొరగడం, కట్టడాలు నేలమట్టం కావడం క్షంతవ్యం కాదని అంటూనే పౌరులను రక్షించడం అంటే యుద్ధ ప్రాంతాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు కట్టుబట్టలతో పారిపొమ్మని చెప్పడం కాదని చురక అంటించారు. సరైన ఆశ్రయం, ఆహారం, నీరు, విద్యుత్, మందులు లేకుండా శరణార్థులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కాగా ఆ శరాణార్ధుల శిబిరాలపై, ఆస్పత్రులపై కూడా బాంబులు వేయడం ఏం యుద్ధ నీతి? ఏం మానవీయత? అని కూడా ఆక్రోశించారు.
బ్రెజిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇజ్రాయిల్, పాలస్తీనా మంత్రులతో పాటు అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల మంత్రులు పాల్గొనడం గమనార్హం.
ఈజిప్టు-మధ్యధరా సముద్రం మధ్యన ఉండే పాలస్తీనియన్ల గాజా ప్రాంతం 41 కి.మీ. పొడవు 20 కి.మీ. వెడల్పు గల చిన్న భూభాగం. కేవలం 23 లక్షల జనాభా. ఒంటె-గుడారం కథ మాదిరి యూదులు పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్‌గా ఆక్రమించుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను గుర్తించకుండా కేవలం ఇజ్రాయిల్‌ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్యసమితిలో ప్రకటన చేయడమే సమస్యకు బీజం. తమ సొంత భూభాగంలోనే తాము పరాయివాళ్ళుగా, పరాధీనులుగా బతకడం ఎంత నరకమో అది అనుభవించేవారికే తెలుస్తుంది. ఇజ్రాయిల్ సైన్యం అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనియన్లపై ఆంక్షలను, అణచివేతను ప్రయోగించడం పరిపాటైపోయింది. చివరకు గాజా లోని మసీదుకు వెళ్ళాలన్నా ఇజ్రాయిల్ సైన్యం అనుమతి తీసుకోవడం వారికి భరింపరాకున్నది.
కనుకనే దీనిని కేవలం రెండు మతాల మధ్య లేదా రెండు ప్రాంతాల మధ్య జరిగే పైపై ఘర్షణగా చూడరాదని, పాలస్తీనియన్ల భౌగోళిక ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం, మానవ హక్కులు మిళితమైన ప్రధాన సమస్యగా పరిగణించాలనేది విశ్లేషకుల భావన. ఎక్కడైనా, ఎప్పుడైనా శాంతి భద్రతలతో జీవించే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ.
అయితే ఈ యుద్ధాన్ని వాడుకుని రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వ్యూహమని, అందుకే కాల్పుల విరమణకు ముందుకు రావడం లేదని వారు విమర్శిస్తున్నారు.
అక్టోబరు 7న, ఆకాశ మార్గాన, జల మార్గాన, భూ మార్గాన అకస్మాత్తుగా ఇజ్రాయిల్‌పై హమాస్ ముప్పేట దాడి జరిగింది. అదీ బాంబుల తూటాల వర్షంతో. ఏం జరిగిందో తెలుసుకునేలోపునే జరగాల్సిందంతా జరిగిపోయింది. వందలాదిమంది నేలకొరిగారు. దాదాపు 200 మందిని బందీలుగా హమాస్ పట్టుకుపోయింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో నైపుణ్యం ఉండి, పెగాసస్ గూఢచర్యానికి పెట్టని కోటగా నిలిచిన ఇజ్రాయిల్‌కు ఇప్పుడు ఇది మింగుడు పడటం లేదు. ఈ దాడి పట్ల ఇజ్రాయిలే కాదు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇజ్రాయిల్ పాలకుల నిర్లక్ష్యం, అహంభావమే ఈ దాడికి కారణమని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
ఇజ్రాయిల్‌పై ఎప్పటికైనా దాడి చేయాలనే దృఢ సంకల్పంతో హమాస్ ఉన్నది. గాలిగుమ్మటాల సాయంతో ఆకాశమార్గాన వచ్చి, దాడి చేసి బందీలను పట్టుకుపోవాలనే ఎత్తుగడలతో హమాస్ ఉన్నట్టు, అందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు దాదాపు పదేళ్ళ క్రితమే వెబ్సైట్లో కథనం ప్రచురితమైంది. గతంలోని చిన్నచిన్న దాడులకంటే ఇది అనూహ్యమైన పెద్ద దాడి. లెక్కలేని ఏమరుపాటుతనం తమ పాలకులకు ఎందుకు వచ్చిందని ఇజ్రాయిలీలు ప్రశ్నిస్తున్నారు.
దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రాంతం గాజాపై యుద్ధం చేస్తుంటే, హమాస్‌కు మద్దతుగా లెబనాన్, సిరియాల హిజ్బుల్లా మిలిటెంట్లు రంగంలోకి వస్తున్నారు. గాజాను పూర్తిగా ఆక్రమించి, హమాస్‌ను కనుమరుగు చేయాలని ఇజ్రాయిల్ భావిస్తుంటే, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు సన్నాయి నొక్కులు నొక్కుతూ వంత పాడుతున్నాయి.
ఇజ్రాయిల్ హెచ్చరికతో ఉత్తర గాజా లోని పదకొండు లక్షల ప్రజానీకం పిల్లా, మేకతో దక్షిణ గాజా వైపు ఆకలి దప్పులతో వలస పోవడం ఈనాటి మహావిషాదం.
ఆదిలో హమాస్ దాడి పట్ల వ్యతిరేకత వ్యక్తమైనా, క్రమేణా ఇజ్రాయిల్ భీకర యుద్ధ దాడుల పట్ల జుగుప్స కలుగుతున్నది. నేతలు ఇంత అమానవీయంగా ఉంటారా! అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అగ్ర దేశాల్లో ఇజ్రాయిల్ సంపన్న యూదుల పెట్టుబడుల దృష్ట్యా ఆ దేశాల మద్దతు తాత్కాలికంగా లభించినప్పటికీ...అంతిమంగా శ్రమించే మానవాళి, మానవత్వమే ప్రపంచ గతికి మూలమని ఈ నేతలు ఎప్పటికి గ్రహిస్తారో.
( వ్యాసకర్త సెల్ : 9959745729 ) - కె.శాంతారావు