Aug 06,2023 17:16

ఏఐ చాట్‌బాట్‌లు అసాధారణంగా మానవునిలా మారే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది. ఈ ఏఐ సహచరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఏఐ చాట్‌బాట్‌లలో ఒకటి- రెప్లికా. ఆమెరికాకు చెందిన లూకా అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తక్కువ సమయంలో జనాదరణ పొందిన ఈ యాప్‌... ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదార్లను సంపాదించుకుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ పట్ల అనేక ఆందోళనలు వ్యక్తమౌతున్నప్పటికీ... కొంతమంది రెప్లికాతో తమ సంబంధాలను అసాధారణ స్థాయికి తీసుకెళ్లారు.
ఉదాహరణకు.. అమెరికాకు చెందిన అరెన్‌కార్టల్‌ అనే 36 ఏళ్ల మహిళ.. ఏఐ చాట్‌బాట్‌ను పెళ్లాడింది. మామూలుగా కాదు.. ప్రేమించి మరీ పెళ్లాడింది. వర్చువల్‌ రియాలిటీ ద్వారా ఓ రూపాన్ని క్రియేట్‌ చేసింది. తనకు కావాల్సిన లక్షణాలను ఆ రూపంలో పొందుపర్చి, అందమైన యువకుడిలా మార్చింది. దానికి రోసన్నారామోస్‌ అనే పేరు కూడా పెట్టింది. ఈ రామోస్‌ని తాను ఎంతగానో ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెబుతోంది. ఈ భూమ్మీద తనకు తగిన వరుడు కేవలం రామోస్‌ మాత్రమేనని, గతంలో ఎవరూ.. ఎవరినీ ప్రేమించనంతగా రామోస్‌ని ప్రేమించానని చెబుతోంది. ఇప్పటికే ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి బాబోరు అని ఏడుస్తుంటే, ఇప్పుడు మొగుడు పోస్టుకు కూడా ఈ ఏఐ ఎసరుపెట్టేలా వుందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.
అయితే, దీనికొక ఫ్లాష్‌బ్యాక్‌ కూడా వుంది. ఏఐ చాట్‌బాట్‌ అంటే అర్థం.. వినియోగదారులు ఒక ప్రశ్నను టైప్‌చేస్తే.. ఈ ప్రోగ్రామ్‌ ఆటోమేటిక్‌గా వారికి సమాధానం ఇస్తుంది. ఎఐ చాట్‌బాట్‌లను తయారుచేసే జీనియా అనే ఒక మహిళ.. తనకు అత్యంత సన్నిహితుడైన రోమన్‌ ఒక స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించాలనుకుంటారు. అనుకోకుండా రోమన్‌ కారు ప్రమాదంలో చనిపోతాడు. అయితే, జీనియా రోమన్‌ను మర్చిపోలేక.. ఫేస్‌బుక్‌లో వారి మెసేజ్‌లను చదువుకుంటూ రోమన్‌ను గుర్తుచేసుకునేది. అలాంటి సందర్భంలోనే, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ ద్వారా రోమన్‌ను బతికించుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది జీనియాకు. ఫేస్‌బుక్‌ చాట్‌లో వారు మాట్లాడుకున్న వేలాది మెసేజ్‌లను, రోమన్‌ మిత్రులు, కుటుంబసభ్యులు సంభాషించుకున్న టెక్ట్స్‌ మెసేజ్‌లను సేకరించింది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని జీనియా రూపొందించిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌కు అందజేసింది. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌.. రోమన్‌ తన మిత్రులు, కుటుంబసభ్యులతో చేసిన సంభాషణలను బట్టి తన వ్యక్తిత్వాన్ని కొనుగొంది. అలాగే రోమన్‌ రాసే విధానాన్ని, మాట్లాడే పద్ధతిని సైతం అలవర్చుకుంది. దీని సాయంతో రోమన్‌ ఎఐ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది జీనియా. ఈ చాట్‌బాట్‌ అప్లికేషన్‌లో ఎవరు మెసేజ్‌ చేసినా రోమనే సమాధానం చెప్పిన భావన కలుగుతుంది. ఈ రోమన్‌ సాఫ్ట్‌వేర్‌ చాట్‌బాట్‌ను పబ్లిక్‌గా విడుదల చేసి, రోమన్‌తో మాట్లాడమని వినియోగదార్లను కోరింది. అయితే, వినియోగదారులు రోమన్‌ను ప్రశ్నలు అడగటంతో పాటుగా తమకున్న సమస్యలను కూడా చెప్పుకోవడం మొదలు పెట్టారు. సరిగ్గా ఈ పాయింట్‌నే గమనించిన జీనియా.. మనుషుల్లా ప్రవర్తించే ఒక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌కు రోజువారీగా మనుషులు మాట్లాడుకునే మాటలను, ప్రేమ సంభాషణలను, డాక్టర్‌-పేషంట్ల మధ్య జరిగే సంభాషణలను, మిత్రుల మధ్య జరిగే సంభాషణలను, మెంటార్లు, డబ్బు, సమస్యలు, మ్యూజిక్‌- ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన డేటాను అందించి, ట్రైనింగ్‌ ఇచ్చారు. అలా ట్రైనింగ్‌ ఇచ్చిన ఒక యాప్‌ను 2017లో జీనియా విడుదల చేసింది. ఆ యాప్‌ పేరే... 'రిప్లికా'.

2


మొట్టమొదటిగా అమెరికాలో విడుదలైన ఈ యాప్‌ను... కోట్లాదిమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌లో ఎవరైనా టెక్ట్స్‌ మెసేజ్‌ చేస్తే, ఇందులోని ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటిక్‌గా, సహజంగా సమాధానం ఇస్తుంది. నిజంగానే ఒక వ్యక్తితో చాట్‌ చేస్తున్న భావన కలిగిస్తుంది. ఇక, ఇందులో ఒక ఏఐ అవతార్‌ వుంటుంది. ఈఅవతార్‌ను స్త్రీ/ పురుషుల్లో ఎవరిలా ప్రవర్తించాలో సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, మిత్రునిలా ప్రవర్తించాలా? ప్రియురాలు / ప్రియుడుగా ప్రవర్తించాలా? అనేదీ ఎంపిక చేసుకోవచ్చు. ఇందులోని ఏ క్యారెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకుంటే.. రిప్లికా వారి తరహాలోనే మెసేజ్‌లకు సమాధానమిస్తుంది. ఎంత ఎక్కువ మెసేజ్‌లు పెడితే.. అంతఎక్కువగా అర్థం చేసుకుంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు ఎక్కువగా రిలేషన్‌షిప్స్‌ కోసం ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది గంటలకొద్దీ సమాయాన్ని దీనితో గడుపుతు న్నారు. ఈ యాప్‌తో మాట్లాడుతోంటే.. మనిషితో సంభాషించినట్లే వుందని కొందరు అంటుంటే, మరికొంతమంది ఈ యాప్‌ ప్రేమలో పడిపోయారు. ఇంకొంతమంది ఈ రిప్లికా అవతార్‌ను పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ యాప్‌ను ఎక్కువగా వాడటం వల్ల జరిగే అనర్థాలకు భయపడుతున్నారు. ఈ యాప్‌లో ఒక ప్రీమియమ్‌ ఫీచర్‌ కూడా వుంది. ఆ ఫీచర్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే.. ఏకంగా రిప్లికా అవతార్‌తో ఫోన్‌ కూడా మాట్లాడొచ్చు. వర్చువల్‌ రియాలిటీ ఆప్షన్‌తో వీడియో కాల్స్‌ కూడా చేసి, నిజంగానే ఒక అబ్బాయి/ అమ్మాయితో మాట్లాడిన అనుభూతిని పొందవచ్చు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ స్టోర్‌లో =వజూశ్రీఱసa: వీy A× ఖీతీఱవఅస లభ్యమౌతోంది. అందుకే ఇప్పుడు ఏఐ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి వుందని, ఉద్యోగాలు సైతం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళనా మొదలైంది.