రేపటి దు:ఖం
నేతల దోపిడీలో
పేదోళ్ల తలరాతలు
కొట్టుకుపోతున్నై.
ఆకలి స్వప్నాలు
దేశమంతా విస్తరించి
ఖాళీ విస్తర్లను చూస్తున్నై.
అరిగిన చెప్పులు
ఉరి వేయబడ్డ ఓటుగా
దేశం నడిబొడ్డున
అదృశ్యాలంకరణతో తిరుగుతున్నై.
చెమట పూలు
కార్మికుల నిట్టుర్పులలో
దగ్ధమౌతూ
దేశపు జెండా వేపు
పొగచూరుల్లా ఎగురుతున్నై.
రైతు కథ
కంచి వేపు పయనం కడితే
కంచె వేసి ఆపుతున్న చేతుల్లో
తడారిన గుండెలా ఒరిగిపోతున్నై.
ఇది
నాదేశపు రేపటి ద్ణుఖం.
వెలుగు వెలుస్తున్న
దేశ ప్రగతి చిత్రం.
కొత్తపల్లి మణీత్రినాథరాజు
79978 26662