Mar 03,2023 21:26

హైదరాబాద్‌: సుప్రసిద్ధ రచయిత్రి, శ్రీమతి. కె రామలక్ష్మి ఆరుద్ర వయోభారంతో హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకి చనిపోయారు. ఆమె 1930 డిసెంబరు 31న కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ పట్టా అందుకున్నారు. 1951నుంచి స్వీయ రచన సాగిస్తున్నారు. ఆమె ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం వంటివి చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పలు అనువాదాలు చేశారు. స్త్రీ సంక్షేమసంస్థలలో పని చేశారు. ఈమె 'రామలక్ష్మి ఆరుద్ర అన్న కలం' పేరుతోనూ రచనలు చేశారు. ఆమెకు 1954లో కవి, సాహిత్యవిమర్శకుడైన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం వీరు కుటుంబంతో హైదరాబాదులో ఉంటున్నారు. వయోభారంతో మృతి చెందిన ఈమె అంత్యక్రియలను శుక్రవారం సాయంత్రమే నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆమె రాసిన నవలలు... విడదీసే రైలుబళ్ళు (1954), అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం (1961), మానని గాయం, అణిముత్యం, పెళ్ళి (2013), ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ , నీదే నాహృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథాసంకలనాలను ఆమె రచించారు. ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం పురస్కారాలు లభించాయి.