Aug 23,2023 22:10

వాషింగ్టన్‌ : భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గానూ స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత్‌ ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
సిఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామలో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌సి గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఎ స్టాటిస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పిహెచ్‌డి పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టరుగా ఎదిగారు. ఆయన 2020 సెప్టెంబరు 10న వందో పుట్టినరోజు జరుపుకున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టరుగా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
సిఆర్‌ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది.. క్రామెర్‌-రావు లోయర్‌ బౌండ్‌. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తుమ విధానాన్ని సూచించింది. రెండవది రావు-బ్లాక్‌వెల్‌ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థవంతంగా సేకరించేందుకు సహాయపడుతుంది.