ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : దేవనకొండ మండలంలో మూతపడిన డిఎన్టి హాస్టలను పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కాకర్ల శాంతి కుమార్ అన్నారు. గురువారం సంక్షేమంలోని జిల్లా బీసీ సంక్షేమ, సాధికార అధికారి వెంకటలక్ష్మిని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుని కొండ మండల పరిధిలో 42 గ్రామాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బీసీలు సంచార జాతులు పెద్ద ఎత్తున జీవనం సాగిస్తున్నారన్నారు. ఇక్కడ సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సి వస్తోందన్నారు. కరోనా సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిఎన్టి హాస్టలును మూసేశారన్నారు. తద్వారా సదరు సామాజిక తరగతుల విద్యార్థులకు విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో డిఎన్టి హాస్టలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇదే సమస్య పై ఇదివరకే జిల్లా కలెక్టర్ సంబంధిత తదితర అధికారుల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు.










