
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మైనారిటీలలో పెరుగుతున్న భయాందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో విభజన రాజకీయాలను కొనసాగించడంలో ఇరు పక్షాలకు ఆసక్తి వుండడంతో...మత విభజనను, ఘర్షణలను సృష్టించడానికి చేసే ప్రయత్నాల్లో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా సిపిఎం, వామపక్ష సంఘటనలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో, ఆ ప్రచారం ప్రజల్లో పట్టు సాధిస్తున్న తరుణంలో ఈ పరిస్థితి ఎదురైంది.
మార్చి 30న శ్రీరామనవమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో హింస, ఘర్షణలు చెలరేగడమనేది అందరూ ముందుగానే ఊహించినది, చెబుతూ వస్తున్నదే. ఇన్నేళ్ళలో, హిందూత్వ శక్తులు రామనవమి ఉత్సవాలను, ప్రదర్శనలను ముస్లింలపై దురాక్రమణ, దాడులకు ఒక సాధనంగా మార్చేశాయి. గతేడాది రామనవమి ప్రదర్శనలు మధ్యప్రదేశ్ లోని ఖర్గాన్‌లో, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, జార్ఖండ్, హౌరా లోని శివ్‌పూర్ ఏరియాల్లో విచ్చలవిడిగా దాడులు, ఘర్షణలకు దారితీశాయి. ఈ ఏడాది కూడా, రంజా న్ సమయంలోనే వచ్చిన రామనవమి... మసీదుల్లో రంజాన్ ప్రార్ధనలు చేసే ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు దారి తీసింది.
మార్చి 30, ఆ తర్వాత రోజుల్లో, జలగావ్, మలద్, ఔరంగాబాద్ (ఇప్పుడు దీని పేరు శంభాజీ నగర్)ల్లో హింస, దాడులు చోటు చేసుకున్నాయి. ఔరంగాబాద్‌లో ఒకరు మరణించారు కూడా. బీహార్ లోని ససరాం, బీహార్ షరీఫ్ లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. హర్యానాలో, గుజరాత్ లోని వడోదరలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో రామనవమి ప్రదర్శన సందర్భంగా హింస చెలరేగింది. తర్వాత హుగ్లీ జిల్లాలోని రిషరాలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
బిజెపి పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్‌లో కూడా రామనవమి ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు కలిగిన సంస్థలు పశ్చిమ బెంగాల్‌లో రామనవమి ప్రదర్శనలను ఉపయోగించుకుని ముస్లిం ప్రాంతాల్లోకి వెళ్ళడం, మసీదుల వెలుపల కవ్వింపు చర్యలకు పూనుకోవడం, పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు పెట్టడం, రెచ్చగొట్టే నినాదాలు ఇవ్వడం, కత్తులు ఇతర ఆయుధాలను ప్రదర్శించడం వంటి చర్యలకు పాల్పడ్డాయి. ఫలితంగా హౌరా, దల్కోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఒక వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు.
హౌరాలో రామనవమి ప్రదర్శన దారి మళ్ళకుండా నివారించడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను పోలీసులు, పాలనా యంత్రాంగం తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని చోట్ల, పోలీసులు సంఘటనా ప్రాంతాల నుండి పారిపోయారు. మరికొన్ని చోట్ల పోలీసులు కూడా అల్లరి మూకల దాడుల్లో చేతులు కలిపారు. హిందూత్వ శక్తుల ఎత్తుగడలకు, వారి ఆలోచనలకు అడ్డుకట్ట వేయడానికి అవసరమైన గట్టి చర్యలను తీసుకోనందుకుగాను మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సి వుంది. తమను ముందుగా ఎవరూ హెచ్చరించలేదనడం సరికాదు. గతేడాది కూడా హౌరా లోని శివ్‌పూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. అంతకు ముందు సంవత్సరాల్లోనూ మత ఉద్రిక్తతలను, ఘర్షణలను సృష్టించడానికి ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిలు రామనవమి ఉత్సవాలను ఉపయోగించుకునేవి. వారి మతోన్మాద ఎజెండాను ఎదుర్కొనడానికి బదులుగా రామనవమి రోజున తృణమూల్ కాంగ్రెస్ అటువంటి ప్రదర్శనల్లో పాల్గొనడమో లేదా ప్రదర్శనలను నిర్వహించడమో చేసేది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, మైనారిటీలలో పెరుగుతున్న భయాందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో విభజన రాజకీయాలను కొనసాగించడంలో ఇరు పక్షాలకు ఆసక్తి వుండడంతో...మత విభజనను, ఘర్షణలను సృష్టించడానికి చేసే ప్రయత్నాల్లో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా సిపిఎం, వామపక్ష సంఘటనలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో, ఆ ప్రచారం ప్రజల్లో పట్టు సాధిస్తున్న తరుణంలో ఈ పరిస్థితి ఎదురైంది.
బీహార్ లోని బీహార్ షరీఫ్, ససరామ్ ప్రాంతాలలో అత్యంత అధ్వాన్నమైన రీతిలో హింసాకాండ చోటుచేసుకుంది. మసీదులు, మదరసాలు, ఇళ్ళు, వాహనాలు, దుకాణాలను లూటీ చేశారు. వాటికి నిప్పంటించారు. అత్యంత పురాతనమైన విద్యా సంస్థల్లో ఒకటైన మదరసా అజీజియాపై దాడి చేసి, ధ్వంసం చేయడం అన్నింటి కంటే దిగ్భ్రాంతికర సంఘటన. అందులోని అత్యంత అరుదైన ప్రతులతో పాటు, 4500 పుస్తకాలన్నింటినీ ధ్వంసం చేసి, నిప్పంటించారు.
బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూత్వ శక్తుల నీచమైన ఎజెండాను ఎదుర్కొనడానికి అవసరమైనంత నిఘా పెట్టలేదు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. అయితే నితీష్ కుమార్, జె.డి(యు) మహాఘట్‌బంధన్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి బిజెపి ఏకాకిగా మారింది. రామనవమి రోజున చెలరేగిన తాజా హింసను చూస్తుంటే...తమ రాజకీయ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకుగాను మతపరమైన చీలికలు సృష్టించాలన్న ఎత్తుగడను బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు రూపొందించాయని తెలుస్తోంది. గొడ్డు మాంసాన్ని తీసుకెళుతున్నాడన్న ఆరోపణలపై సరన్‌లో ముస్లిం యువకుడిని ఇటీవల కొట్టి చంపడాన్ని ముందస్తు హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఏవిధమైన మతోన్మాద కవ్వింపు చర్యలు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పాలనా యంత్రాంగం అప్రమత్తంగా వుండాలి. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా కాకుండా...మతోన్మాద భావజాలాన్ని, మతోన్మాద శక్తులను ఎదుర్కొనడంలో మహాఘట్‌బంధన్ అత్యంత దృఢంగా వుంది. నిర్దిష్టమైన చర్యల ద్వారా ప్రభుత్వం దీనిని నిరూపించుకోవాల్సి వుంది.
ఇక్కడ కేంద్రం దారుణమైన పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంది. హోం మంత్రి అమిత్ షా మత ఉద్రిక్తతల గురించి ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా...గవర్నర్లతో చర్చించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల మీద స్వారీ చేసేలా గవర్నర్ల పాత్ర వుండాలని కేంద్రం భావిస్తోందనడానికి ఇదొక సంకేతం. పైగా, అమిత్ షా బీహార్‌లో పర్యటిస్తూ...రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఇలాంటి మతోన్మాద ఘర్షణలు చెలరేగవని చెప్పారు. అల్లర్లకు పాల్పడేవారిని తలకిందులుగా వేలాడదీస్తామని ప్రకటించారు. అంటే ఇక్కడ అల్లర్లకు పాల్పడేవారు ముస్లింలని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామనే సందేశం ఇచ్చారు. రామనవమి, గణేష్ చతుర్థి, హనుమాన్ జయంతి వంటి మతపరమైన పండుగలన్నీ కూడా మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి, మత హింసను, చీలికలను సృష్టించడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. దూకుడుతోకూడిన మతోన్మాద సమీకరణలను రాజకీయంగా, పాలనాపరంగా ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య, లౌకికశక్తులు ముఖ్యంగా బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాన్ని రూపొందించాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)