
బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపుతున్నది... రాజ్యాంగాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో 'హిందూ మత విశ్వాసాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందువల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షాలతో ఏ హక్కులు లేని పరాయివారిగా బతకాలి.' ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలాడుతున్న పాలకులకు పరమత సహనం, మత స్వేచ్ఛ అనేవి ఏ మాత్రం గిట్టవు.
మన రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారాయని, ఇందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతపరమైన వివక్షాపూరిత విధానాలే కారణమని అంతర్జాతీయ మత స్వేచ్ఛ పరిస్థితులపై అమెరికన్ సంస్థ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పు, మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వ కూల్చివేత-ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు, లైంగిక వేధింపులపై రెజ్లర్లు ఢిల్లీలో చేస్తున్న ఆందోళన, ఇప్పుడు మత స్వేచ్ఛపై అంతర్జాతీయ నివేదిక కేంద్రంలోని బిజెపి నేతలకు ఉక్కపోతను మరింత పెంచింది. నరేంద్ర మోడీ ఇంటా బయటా ఎదురులేని మొనగాడని, విశ్వగురువు అని, అంతర్జాతీయ శాంతిదూత అని...ఏవేవో భుజకీర్తులు తగిలించి, ఆహా ఓహో అని కీర్తించిన గోడీ మీడియా ఈ వరుస ఘటనలతో కుడితిలో పడిన ఎలుక లాగా గిజగిజలాడుతున్నది.
మత స్వేచ్ఛ నివేదికలో ఏముంది ?
అమెరికన్ విదేశాంగ శాఖ ఆధీనంలోని స్వతంత్ర సంస్థ 'యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్' (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) ప్రపంచంలోని వివిధ దేశాల్లో మత స్వేచ్ఛ పరిస్థితులపై ప్రతి సంవత్సరం నివేదికలు రూపొందించి అక్కడి ప్రభుత్వానికి అందచేస్తుంది. భారతదేశంలో మత అసహనం, ప్రార్థనా స్థలాలు, మైనారిటీ ప్రజల ఆస్థులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, తప్పుడు కేసులు, నిర్బంధాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది. 2022లో దేశంలో జరిగిన సంఘటనలు, ప్రభుత్వ లెక్కల ఆధారంగా ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించి మత స్వేచ్ఛ అమలు విషయంలో ప్రత్యేక ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో కూడా ఈ సంస్థ దేశంలోని మత ఉద్రిక్తతలను ప్రస్తావించింది. మత స్వేచ్ఛ విషయంలో కొనసాగుతున్న అనేక దుష్పరిణామాలను ఈ సంవత్సరం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించడంతో పాటు, వాటి మూలాలను విశ్లేషించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-28 ప్రకారం ప్రతి పౌరుడికి తనకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి, ఏ మతాన్ని ఆరాధించకుండా వుండడానికి స్వేచ్ఛ వుంది. అయితే 2014లో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఈ లౌకిక సూత్రాలకు, మైనారిటీల మత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడిందని పేర్కొంది.
ఇంకా ఈ నివేదికలో 'హిజాబ్, గోవధ లాంటి అంశాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (బిజెపి పాలిత రాష్ట్రాలు) రూపొందిస్తున్న చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీల మత స్వేచ్ఛను హరించివేసే విధంగా వుంటున్నాయి. విమర్శనాత్మక గొంతులను కేంద్ర ప్రభుత్వం అణచిపెడుతున్నది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలను, వారికి అండగా నిలుస్తున్న వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకొని వారిపై నిఘా, వేధింపులు, ఇళ్ల కూల్చివేత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద సంవత్సరాల తరబడి నిర్బంధించడం లాంటివి పెరిగాయ'ని తెలిపింది. స్వచ్ఛంద సంస్థల కార్యక లాపాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధానాలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేస్తున్నదని పేర్కొంది. మత స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్న అనేకమంది జర్నలిస్టులు, లాయ ర్లు, మానవ హక్కుల కార్యకర్తలు నిర్బంధాలకు, వేధింపులకు గురవుతున్నారనే పచ్చి నిజాన్ని బయటపెట్టింది. 2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జరిగిన కార్య క్రమాల్లో పాల్గొన్నారనే సాకుతో అనేక వేల మందిపై పెట్టిన వందలాది కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో వున్నాయని, 2022 వరకు 700 కేసులు నమోదు కాగా, వాటిలో కేవలం 92 కేసులు మాత్రమే విచారణ దశకు వచ్చాయని తెలిపింది. అయితే ఈ కేసులు నమోదు అయినా అనేకమంది ఎలాంటి విచారణ లేకుండా సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 12 రాష్ట్ర ప్రభుత్వాలు (ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, ఉత్తరా ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్) మత మార్పిడిని చట్టవిరుద్ధ నేరంగా పరిగణించే చట్టాలను రూపొందించాయని ఈ నివేదిక తెలిపింది. చట్టపరమైన మత మార్పిడికి గతంలో వున్న నిబంధనలను పూర్తిగా మార్చివేసి మత స్వేచ్ఛను అణచివేసే విధంగా ఈ రాష్ట్రాల్లో నిబంధనలను రూపొందించారు. ఈ అంశాలన్ని ట్లోనూ ఉత్తరప్రదేశ్ దూకుడుగా వుంది. మతాన్ని మార్చుకున్న వారికి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి భారీగా అపరాధ రుసుములు వేయడం, జైళ్లలో నిర్బంధించడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం పెరిగిందని పేర్కొంది.
చట్టబద్ధ మతాంతర వివాహాలను నిరోధిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాయి. ముస్లిం యువత చేసుకునే ప్రేమ వివాహాలపై 'లవ్ జిహాద్' పేరుతో ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి పాలకులు, వారి అనుయాయులు మత విద్వేషాన్ని పెద్ద ఎత్తున రగిలిస్తున్నారు. మతాంతర వివాహాలను పుజారి లేదా పోలీసులు అంగీకరించడానికి లేదా అంగీకరించకుండా వుండడానికి హక్కులు కల్పిస్తూ ఏప్రిల్‌లో హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. కర్ణాటకలో రగిల్చిన హిజాబ్ సమస్య, గుజరాత్‌లో బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల, ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై కొనసాగుతున్న హత్యాచారాలు, దాడుల గురించి ఈ నివేదిక పేర్కొంది. పెరుగుతున్న మత హింస ఘటనల ఆధారంగా భారత దేశంలో మత స్వేచ్ఛ ప్రమాదంలో వుందని, అందువల్ల ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వ స్పందన
విభిన్న మతాలకు నిలయమై, లౌకిక విధాన పునాదిపై భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరిస్తున్న దేశ ప్రతిష్టను కేంద్ర బిజెపి పాలకులు, వారి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ ఈ విధంగా దిగజార్చాయి. కానీ 'ఈ నివేదక పక్షపాతం మరియు నిందాపూర్వకమైనదని' మన విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తీవ్రమైన అవగాహనా లోపంతో ఈ నివేదిక తయారుచేయబడిందని కేంద్రం ఎదురు దాడికి సిద్ధమైంది. మరి ట్రంప్ అధ్యక్షుడుగా వున్న కాలంలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాల మోత మోగించారు కదా! అంతెందుకు! ప్రధాని మోడీ 2021 సెప్టెంబర్ నెలలో అమెరికా పర్యటన సందర్భంగా నాయకుల పరస్పర పొగడ్తలు, వచ్చే నెల 22న మరోసారి ప్రధాని అమెరికా పర్యటనకు చేస్తున్న హంగామా చూస్తూనే వున్నాం. అంతర్జాతీయ మీడియా ప్రచార హోరులో ఊయలలూగినప్పుడు పక్షపాతం గుర్తకు రాలేదే? ఇలాంటి నివేదికలు ప్రకటించే అమెరికా సంస్థలన్నీ గొప్పవని, అవి ఇచ్చే నివేదకలన్నీ చాలా పవిత్రమైనవని అనుకోలేము. కాని తమను కీర్తించినప్పుడు ఒకరకంగా, నిందించినప్పుడు మరో రకంగా స్పందించే పాలకుల తీరు ప్రజావిశ్వాసాన్ని పొందదు.
దేశంలో మత స్వేచ్ఛ ఎందుకు ప్రమాదంలో పడింది ?
బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒకటి మత రాజ్యాన్ని నిర్మించడం. అందుకోసం మత విద్వేషాన్ని నిత్యం రగల్చడం. ఇతర మతస్థుల ఆచార, సాంప్రదాయాలన్నిట్లోకి జొరబడి వాటిపై దాడి చేయడం. రెండు కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను, సామాజిక రిజర్వేషన్లను బలహీనపర్చడం, రాజ్యాంగ హక్కులను కాలరాయడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం. గౌతమ్ అదానీ ఆర్థిక అరాచకాల గురించి హిండెన్‌బర్గ్ నివేదిక, మత స్వేచ్ఛ గురించి యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ నివేదిక, అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ప్రకటిస్తున్న ర్యాంకింగ్ లెక్కలు ఈ విధానాల ప్రతిరూపమే.
అంతేగాక, తమ మతతత్వ విధానాలను అమలు పరచడానికి మత చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉదా: గో సంరక్షణ పేరుతో 2014 నుండి దేశవ్యాపితంగా 147 దాడులు జరిగాయి. ఇందులో 58 మంది హత్యగావించ బడ్డారు. కర్ణాటక ఎన్నికలకు ముందు గో రక్షణ దళాలు ఇద్దరు మైనారిటీ మతస్థులను చంపడం, ఒకరిని హింసించడం చూశాము. కేంద్ర ప్రభుత్వం 2017 మే లో కేంద్రం గోవధ నిషేధాన్ని ప్రకటించింది. అన్య మత పూజా ప్రదేశాల మీద దాడులు చేయడం పెరిగింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా దేశంలో అనేక చోట్ల మసీదులపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగానే యు.పి లో మైనారిటీ సంస్థ నిర్వహిస్తున్న అతి పెద్ద ప్రాచీన గ్రంథాలయాన్ని తగుల బెట్టారు. మత మార్పిళ్ల సాకుతో ముఖ్యంగా క్రిస్టియన్లపై దాడులు పెరిగాయి. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పరమత సహనమే హిందూ మతానికి జీవం అని ఒకవైపున అనుభవం చెబుతుంటే, మరోవైపున హిందూ ధర్మ సంరక్షకులు, గో సేవా దురంధరుల వేషాలు వేసుకున్న కొద్దిమందికి పరమత ద్వేషం జీవగర్ర అయింది. వీరికి కేంద్రంలోని ప్రభుత్వం అండగా నిలిచింది. బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపుతున్నది...రాజ్యాంగాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో 'హిందూ మత విశ్వాసాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందువల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షాలతో ఏ హక్కులు లేని పరాయివారిగా బతకాలి.' ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలాడుతున్న పాలకులకు పరమత సహనం, మత స్వేచ్ఛ అనేవి ఏ మాత్రం గిట్టవు. దేవనూరు మహదేవ అన్నట్లు 'భారత దేశంలో ద్రవిడ, ఆర్య, ఇస్లాం, క్రైస్తవ రక్తాలన్నీ వేరుచేయలేనంతగా కలిసిపోయాయి.' వీటిని విడదీయాలని చూడడం అనాగరికం, ఆటవికం. కాని అనేక కారణాల వల్ల ప్రజలు ఈ విధ్వంసకులకు కొద్ది కాలం మద్దతు ఇవ్వవొచ్చుగాక. అనుభవం నేర్పుతున్న పాఠాల నుండి...వీరికి సరైన సమయంలో సరైన గుణపాఠం ఆ ప్రజలే చెబుతారన్నది చరిత్ర చెప్తున్న సత్యం.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్