May 06,2023 09:17
  • మోడీ సర్కార్‌ జిమ్మిక్కులు ప్రజలకు అర్థమయ్యాయి
  • ఈ దఫా ఇంటికే శ్రీ బిబిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యపాల్‌ మాలిక్‌

న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ కార్డు పని చేయదని జమ్ముకాశ్మీర్‌ మాజీ గవర్నరు సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు మోడీ సర్కార్‌ విసురుతున్న మతం పాచికలు ఈ దఫా ఎన్నికల్లో ఫలించబోమని ఆయన పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమంటూ విమర్శలు గుప్పించిన అనంతరం ఆయనను మోడీ సర్కార్‌ లక్ష్యంగా చేసుకోవడం, మద్దతుదారులను నిర్బంధించడం వంటి పరిణామాల నేపథ్యంలో బిబిసి ప్రతినిధి సర్వప్రియ సాంఘ్వాన్‌కు సత్యపాల్‌ మాలిక్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సారంశం క్లుప్తంగా..

ప్రశ్న: మీరు గవర్నర్‌గా ఉన్నా, లేకున్నా, ఎన్నో వేదికలపై బిజెపి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. మీ ఫిర్యాదులను పార్టీ అగ్రనేతల వరకూ చేర్చగలిగానని చెప్పారు. కానీ పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడాలని ఎప్పుడు అనిపించింది ?
జవాబు: రైతుల ఉద్యమం. దాని గురించి బయట మాట్లాడ్డానికి ముందు నేను ప్రధానిని కలిసి మాట్లాడాను. ఆయన వైఖరి చూశాక.. లేదు, ఇక మాట్లాడాలి పదవి పోయినా ఫర్వాలేదు అనుకున్నాను.

ప్రశ్న: ఆయన వైఖరి ఎలా ఉంది ?
జవాబు : రైతుల గురించి ఆయనలో అసలు ఎలాంటి బాధా కనిపించలేదు.వెళ్లిపోతారులే, ఏం కాదు సత్యపాల్‌ అన్నారు.

ప్రశ్న : మీరు మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పుడు రాజస్థాన్‌లో ఒక సభలో మాట్లాడారు. కాశ్మీర్‌ గురించి చెబుతూ నా దగ్గరకు రెండు ఫైల్స్‌ వచ్చాయని, వాటిలో ఒకదానిలో సంఫ్‌ుకు చెందిన ఒక పెద్ద వ్యక్తి, మరోదాన్లో అంబానీ ప్రమేయం ఉందని రెండు విభాగాల సెక్రటరీలు చెప్పారని, ఆ ఒప్పందాలు రద్దు చేశానని తెలిపారు. దానిపై ప్రధానిని కూడా కలిశానని, ఆయన అవినీతిపై రాజీ పడాల్సిన అవసరం లేదని మీతో అన్నారని చెప్పారు.
జవాబు : ఆ విషయంలో ఆయన నాకు మద్దతిచ్చారు.

ప్రశ్న: కానీ ఇటీవల మీరు ఒక ఇంటర్వ్యూలో ప్రధాని అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.
జవాబు : లేదు, నేను చాలా విషయాల్లో చూశాను. అవినీతి గురించి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. గోవాలో నేను అవినీతిపై ఫిర్యాదు చేసినందుకే నన్ను తొలగించారు. అవినీతిపరులను తొలగించడానికి బదులు నన్ను బదిలీ చేశారు.

ప్రశ్న: కానీ ఈ రెండూ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా? ఆయన అక్కడ మిమ్మల్ని సపోర్ట్‌ కూడా చేశారని చెప్పారు కదా ?
జవాబు : వాటిని నేను అప్పటికే రద్దు చేశాను. రద్దు చేసిన తర్వాత వెళ్లాను. సర్‌ నేను వీటిని రద్దు చేశాను, కావాలంటే నన్ను తొలగించి వేరే వాళ్లను నియమించండి అని చెప్పా. కానీ, ఆయన అవినీతిపై రాజీపడేది లేదన్నారు.

ప్రశ్న: పుల్వామా గురించి మీరు కొత్త విషయం మాట్లాడారు. ఇటీవల దానిపై అసదుద్దీన్‌ ఒవైసీ కూడా మాట్లాడేసరికి అది చాలా పెద్ద విషయం అయ్యింది. జవాన్లు మరణించినా, మీరు రాజీనామా చేయలేదు. ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు అన్నారు. మిమ్మల్ని అడ్డుకున్నది ఏది? పదవీ వ్యామోహమా?
జవాబు : లేదు. ఆయనకు తెలీదు. నేను, దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చాను. ప్రధానితో ఇది మన వాళ్ల తప్పిదం వల్లే జరిగిందని చెప్పాను. దానిపై విచారణ జరగాలని కూడా కోరుకున్నా. దర్యాప్తు జరుగుతుందనే అనుకున్నా. అందుకే, దానిపై రాజీనామా చేయాల్సిన అవసరం కలగలేదు.

ప్రశ్న : అయినా ఏడాది తర్వాత, ఏడాదిన్నర తర్వాత కూడా మీరు రాజీనామా చేయలేదు. కాశ్మీర్‌ నుంచి గోవాకు, గోవా నుంచి మేఘాలయ గవర్నర్‌గా వెళ్లారు?
జవాబు: కానీ నేను రాజీనామా చేయడం వల్ల ఏదైనా పరిష్కారం అయితే, ఏదైనా ఎక్కువ హైలైట్‌ అయ్యేలా ఉంటే చేసేవాడిని.

ప్రశ్న: మీరు బిజెపి ప్రభుత్వంపై ఇన్ని ఆరోపణలు చేయడాన్ని చూసి జనం మిమ్మల్ని అవకాశవాది అంటున్నారు? వారితో మీ బంధం చెడిన తర్వాత ఇలాంటివి మాట్లాడుతున్నారని అంటున్నారు. మీరు దీనిపై ఏం చెబుతారు ?
జవాబు : ఆ బాధ్యత హోం మినిస్ట్రీది. నేను వారి దగ్గర లేవనెత్తాను. వారికి చెప్పాను. వాళ్లు అది చేసుండాల్సింది. దానికి బాధ్యులైన వాళ్ళు రాజీనామా చేసుండాల్సింది. నేనెందుకు చేయాలి? పుల్వామా ఘటన జరిగిన తొలిరోజే నేను దీన్ని లేవనెత్తాను. మీరు నోరు విప్పకండి అన్నారు. తర్వాత దీన్ని పాకిస్తాన్‌వైపు, మరో దిశగా తీసుకెళ్తన్నారని నాకు అనిపించింది. ఆ సమయంలో వారిని వ్యతిరేకించడం చాలా ప్రమాదకరం. దేశద్రోహి అని ముద్ర కూడా వేసుండేవారు. రైతుల ఉద్యమం విషయంలో కూడా వీళ్లు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని నాకు అనిపించగానే నేను ఆ విషయాన్ని లేవనెత్తా !

ప్రశ్న: ఒక పత్రికలో కూడా వచ్చింది. నాలుగు నెలల నుంచీ దీనిపై చర్చ జరుగుతోంది. విమానం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. నేను చెప్పినా విమానం ఇవ్వలేదని మీరొక ఇంటర్వ్యూలో చెప్పారు.
జవాబు : లేదు, నేను చెప్పలేదు. అది సరైన సమాచారం కాదు. నేను అందులో అసలు లేను. సీఆర్పీఎఫ్‌ నన్ను విమానం అడిగుంటే ఇప్పించే వాడిని. నేను అందులో ఎక్కడా లేను. సీఆర్పీఎఫ్‌ హోం మినిస్ట్రీని అడిగింది. వాళ్ళు ఇవ్వలేదు.

ప్రశ్న: అప్పటి హోం మినిస్టర్‌గా రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నారు. అయితే దీనికి బాధ్యత ఎవరిదని మీరు భావిస్తున్నారు ?
జవాబు : దీనికి బాధ్యత అంతా రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధానిదే
అనుకుంటున్నా !

ప్రశ్న: చాలామంది నేతలపై సిబిఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయి. కొందరు జైల్లో కూడా ఉన్నారు. మీకు కూడా అలాంటిది ఏదైనా జరగవచ్చు అని భయం వేయడం లేదా ?
జవాబు : లేదు.. లేదు.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నా..

ప్రశ్న : వాళ్ళు కూడా మేము ఏమీ చేయలేదనే చెబుతున్నారు. అయినా జైల్లో ఉన్నారు కదా ?
జవాబు :  నేను జైలుకు చాలాసార్లు వెళ్ళాను.

ప్రశ్న: మీకు ఈ కాన్ఫిడెన్స్‌ ఎక్కడ్నుంచి వచ్చింది ?
జవాబు : దృఢ నిశ్చయం నుంచి వచ్చింది. నేను సరైన దిశలో ఉన్నాను. సరైన ప్రశ్ననే వస్తున్నాను అనుకుంటున్నా. దీనిపై నేను జైలుకు వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాను.

ప్రశ్న: మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా ?
జవాబు : అసలు పోటీచేయను. ఎవరైనా అడిగినా పోటీ చేయను ?

ప్రశ్న: జమ్ము-కాశ్మీర్‌, బీహార్‌లలో అవినీతి ఉందని మీరు మాట్లాడారు. మీరు అక్కడ గవర్నర్‌గా పనిచేశారు కదా? అలాగే దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా మీకు దేశంలో ఎవరైనా వ్యక్తి కనిపిస్తున్నారా ?
జవాబు : ఒక వ్యక్తి అని నేను చెప్పను. చాలామంది ఉన్నారు. దేశంలో అలాంటి వాళ్లు లేరని కాదు. చాలామంది మిగిలే ఉన్నారు. బీహార్‌లో నితీశ్‌ మచ్చలేని వ్యక్తి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కూడా. ఇక ఢిల్లీ వారు మద్యం విషయంలో ఏం జరిగిందో తెలీదు. కానీ వారు మంచి వారే.

ప్రశ్న: కానీ బీహార్‌లో చాలాకాలం సిఎం నితీశ్‌ కుమారే ఉన్నారు? ఆ సమయంలో మీరు గవర్నర్‌గా ఉన్నప్పుడు అక్కడ విద్యావ్యవస్థలో అవినీతి ఉందన్నారు? అలాంటప్పుడు మీరు నితీశ్‌ది మచ్చలేని ఇమేజ్‌ అని ఎలా చెప్పగలరు ?
జవాబు : అంటే, మిగతా వాళ్లతో పోల్చిచూస్తే, ఆయనే మెరుగైనవారు.

ప్రశ్న: మీరు చెప్పిన విషయాలను అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ప్రస్తావిస్తున్నారు. మీరేమంటారు ?
జవాబు : అరవింద్‌ కేజ్రీవాల్‌ మిగతావారికంటే మెరుగైనవారు.

ప్రశ్న: ఏ విషయంలో ?
జవాబు: అవినీతి విషయంలో...

ప్రశ్న: కానీ ఢిల్లీలో కూడా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి కదా?
జవాబు : ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఆయన్ను జైల్లో పెడతారని నాకు అనిపిస్తోంది.

ప్రశ్న: అంటే ఆయన్ను అరెస్టు చేస్తారన్నమాటర.!
జవాబు : వంద శాతం..

ప్రశ్న: అయితే ఆయన మోడీకి దీటైన వ్యక్తి కాగలరంటారా ?
జవాబు : లేదు, మోడీకి దీటైన వ్యక్తి ఎవరూ లేరు. మోడీకి వ్యతిరేకంగా ప్రజలే ముఖచిత్రం కావాలి. అంటే పీపుల్‌ వర్సెస్‌ మోడీ ఎన్నికలు జరగాలి.

ప్రశ్న: నరేంద్ర మోడీ పాపులారిటీకి కారణం ఏదనిపిస్తోంది ?
జవాబు : అది ఒక విధంగా మేనేజ్‌ చేసింది.

ప్రశ్న: కానీ అది ఇప్పటికీ ఉంది. 2014లో విజయమే కాదు, 2019లో కూడా జనం ఆయనకు భారీ మెజారిటీ ఇచ్చారు ?
జవాబు : అది ఉత్తరాదిన మతపరమైన నిర్ణయం వల్ల జరిగింది.

ప్రశ్న: అయితే 2024లో అది పనిచేయదా ?
జవాబు : పనిచేయదు. నేనిప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం, 2024 ఎన్నికల్లో ఇది పనిచేయదు. ప్రజలకు ఈ గేమ్‌ అర్ధమైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు బాధపడుతున్నారు.

ప్రశ్న: కానీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు జనం ఆయన చేతిలో ఏం లేదు, స్థానిక ప్రజా ప్రతినిధుల వల్లే అలా అయ్యిందంటున్నారు. మోడీపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తడం లేదు ?
జవాబు : ప్రశ్నిస్తున్నారు. నేను కూడా నెలలో 8-10 సమావేశాలు నిర్వహిస్తా.. ప్రజలను కూడా కలుస్తున్నాను.

ప్రశ్న : మీరు ఒక ఇంటర్వ్యూలో మోడీతో ఆర్‌ఎస్‌ఎస్‌ అంత సంతోషంగా లేదని అన్నారు. ఎందుకు ?
జవాబు : నాకు వచ్చిన సమాచారం అది. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆదాయం సంపాదిస్తున్నవారంతా సంతోషంగానే ఉన్నారు. అన్ని సెంట్రల్‌ యూనివర్శిటీల వీసీలు, ప్రిన్సిపల్‌ కూడా కాలేనివారు ఆర్‌ఎస్‌ఎస్‌ కనెక్షన్‌ వల్ల ఆ పదవులు పొందారు. కానీ ఆరెస్సెస్‌ కోర్‌ అంటే కీలకమైన భగవత్‌ లాంటి నేతలు, బహుశా ఆయన అహంకారం వల్ల అంత సంతోషంగా లేరు.

ప్రశ్న: ఆరెస్సెస్‌ వేరే ఎవరినైనా అధికారంలో చూడాలని అనుకుంటోందా ?
జవాబు : యోగీజీని చూడాలని అనుకుంటోంది.