Jun 30,2023 12:57
  • అన్ని మతాల పైన ప్రభావం చూపుతుంది
  • దానిని మత రాజకీయాల నుండి విడదీయండి
  • ఆంగ్ల పత్రికల సంపాదకీయాల్లో వెల్లడి

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) కేవలం ముస్లింల పైన మాత్రమే ప్రభావం చూపదని ఆంగ్ల పత్రికల సంపాదకులు అభిప్రాయపడ్డారు. అది అన్ని మతాల వారి పైన ప్రభావం చూపుతుందని, అందువల్ల దానిపై ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు విస్తృత స్థాయిలో చర్చించాల్సి ఉంటుందని వారు సూచించారు. యూసీసీని మత రాజకీయాల నుండి వేరు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యుసిసిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా జాతీయ లా కమిషన్‌ ఇటీవలే దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో వివిధ ఆంగ్ల పత్రికలు దానిపై సంపాదకీయాలు ప్రచురించాయి. దేశ పౌరులందరి పైనా ప్రభావం చూపే ఇలాంటి అంశాలను రాజకీయ నిర్బంధాలు శాసించకూడదని సంపాదకులు స్పష్టం చేశారు.
 

                                                                         ఒకే గాట కట్టొద్దు

రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు హామీలను, యుసిసిని ఒకేలా చూడరాదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక తెలిపింది. 'మిగిలిన రెండు హామీలను నెరవేర్చిన విధంగానే లోక్‌సభ ఎన్నికల లోగా మూడో హామీని కూడా నెరవేర్చాలని బిజెపి అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. అయితే యూసీసీ భిన్నమైనదని ఆ పార్టీ గుర్తించాలి. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. యూసీసీ భిన్నమైనదన్న విషయాన్ని బిజెపి నాయకత్వం గుర్తించాలి. ఎందుకంటే అది దేశ పౌరులందరినీ స్పృశిస్తుంది. వారి జీవన విధానంలోకి, వ్యక్తిగత జీవితాలలోకి తొంగిచూస్తుంది. మత రాజకీయాలతో కూడిన వాతావరణంలో గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ, అందరినీ సంప్రదించి నిర్ణయానికి రావాలి. యూసీసీ అనేది ముస్లింల పైనే కాదు. హిందువులు, ఇతర మైనారిటీలు, గిరిజనుల పైన కూడా ప్రభావం చూపుతుంది' అని తన సంపాదకీయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.
 

                                                                    తొందరపాటు తగదు

ఆధిపత్య మతానికి సంబంధించిన చట్టాలకు యుసిసి బ్లూప్రింట్‌ మాదిరిగా పనిచేస్తుందన్న ఆందోళన ఉందని హిందుస్థాన్‌ టైమ్స్‌ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. మైనారిటీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోకుండా ఇది నిరోధిస్తుందని తెలిపింది. 'వివాహం, విడాకులు, వారసత్వం, నిర్వహణ వంటి విషయాలలో మహిళలను బలహీనుల్ని చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వ్యక్తిగత చట్టాలు ఉల్లంఘించేలా ఉండకూడదు. యూసీసీపై నిర్ణయం తీసుకునే ముందు విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. జాగరూకతతో, అనుభవంతో, రాజనీతిజ్ఞతతో, దయతో ముందడుగు వేయాల్సి ఉంటుంది' అని హిందుస్థాన్‌ టైమ్స్‌ సంపాదకీయం తెలిపింది.