ప్రజాశక్తి - యానాం(కాకినాడ) : యానాం కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని మంగళవారం స్థానిక పరిపాలనాధికారి కార్యాలయం సమీపంలోని ది యానాం కో-ఆపరేటివ్ స్టోర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సిబ్బంది మాట్లాడుతూ కోఆపరేటివ్ సంస్థ తమకు 30 నెలలుగా బకాయి జీతాలు చెల్లించలేదని దాని కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా అధికారులు, నాయకులు వేతనాలు అందిస్తామంటూ మాటలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చారని వేతనాలు మాత్రం అందించలేదన్నారు.తక్షణమే తమకు వేతనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్ తక్షణమే కట్టాలని, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని, లిక్కర్ స్కాం నిందితులపై చర్యలు చేపట్టి విచారణ అనంతరం వచ్చిన సోమ్ముని రికవరీ చేయాలని కోరారు. యధావిధిగా రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులు, బియ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కోఆపరేటివ్ స్టోర్స్ సేల్స్ మేన్స్ కి హెల్పర్లుగా పనిచేస్తున్న వారిని తక్షణమే గుర్తింపు కలిగించాలని తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని దీక్షా శిబిరం వద్ద సిబ్బంది మాట్లాడారు. అదేవిధంగా యానాం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చెల్లి గోపీనాథ్ దీక్ష శిబిరం వద్ద సిబ్బందికి మద్దతు ప్రకటించి వారి డిమాండ్లు పరిష్కరించే వరకు ఎంప్లాయిస్ యూనియన్ సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.










