
నరేంద్ర మోడీ నాయకత్వాన ఏర్పడిన ఎన్‌డిఎ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు నిండిన సందర్భంగా తిరుపతి, విశాఖపట్నం సభలలో జెపి నడ్డా, అమిత్ షా తమ పాలన గొప్పలు చెప్పారే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ఆ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చేసిన విద్రోహాన్ని వివరించకపోవడం ఘరానా మోసం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తిరస్కరించడం, విభజన హామీలను అమలు చేయ నిరాకరించడం వంటివి తొక్కిపెట్టి స్వోత్కర్షలు, పరనింద తోనే ప్రసంగాలు ముగిసిపోయాయి. తెలుగు ప్రజల కోసం రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని, విశాఖ రైల్వే స్టేషన్‌ను రూ.450 కోట్లతో భవ్య రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పిన అమిత్ షా రైల్వే జోన్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన చెన్నై విశాఖ కారిడార్ మాటే లేదు. కడప ఉక్కు ఊసెత్తలేదు. పేదలకు ఐదు కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్న అమాత్యుడు ఇప్పటివరకూ ఇస్తున్న రేషన్ బియ్యం రద్దు చేశామని చెప్పలేదు. మోడీ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి అన్ని నిత్యావసరాల ధరలూ పెంచి ప్రజల నడ్డి విరిచేస్తోంది. ఈ సమయంలోనే విమాన ఇంధన ధరలను తగ్గించడం అది ఎవరి పక్షమో తేటతెల్లం చేస్తోంది. బిజెపి అధికారంలోకి వచ్చే నాటికి దేశం రూ.47 లక్షల కోట్లు అప్పు ఉండగా, ఈ తొమ్మిదేళ్లలో రూ.153 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో మత చిచ్చు రగల్చడం, ప్రజల మధ్య విభేదాలను పెంచి మారణహోమానికి కారణమైంది. బిజెపి తొమ్మిదేళ్ల పాలన విద్వేష, విద్రోహపూరితమే !
అమిత్ షా రాకను నిరసిస్తూ రాష్ట్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్వాన రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందిగాక విజయోత్సవ సభల పేరుతో మరోమారు మోసం చేయాలని చూస్తున్న బిజెపికి రాష్ట్ర ప్రజలు పాడె కట్టాలని వారు పిలుపునివ్వడం సబబైనదే! 'స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన వారికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు' అన్నది ముమ్మాటికీ నిజం. పోలవరానికి నిధులు, ముఖ్యంగా నిర్వాసితుల పునరావాసం, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు తదితర డిమాండ్లు న్యాయసమ్మతమైనవి. అమిత్ షా పర్యటన సమయంలోనే స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 558 ప్లాట్‌లను, 76 భవనాలను అమ్మకానికి పెడుతూ ప్రకటన విడుదల చేయడం రాష్ట్ర ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను విరమించుకుంటున్నట్టు ప్రకటించాలని కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం ఇటువంటి ప్రకటన విడుదల చేయడం తీవ్రమైన విషయం. విశాఖ నగరంలో హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెంలో ఉక్కు ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లను, ఆటోనగర్ గాజువాక ఏరియాలో ఇళ్లను అమ్మకానికి పెట్టడం అమానుషం.
ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని, గత నాలుగేళ్ల పాలనంతా అవినీతిమయమని అమిత్ షా చేసిన విమర్శలు చర్చనీయాంశమైనాయి. భూ, మైనింగ్ మాఫియాలు, ఫార్మా కంపెనీల్లో అక్రమాలు ఎ.పి లో, అందునా విశాఖలో పెచ్చుమీరుతున్నాయని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అవినీతిమయం అయిందని చెబుతున్న జాతీయ నాయకులు రాష్ట్రంలో 2014 నుండి టిడిపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి గనులు, ఇసుక, మద్యం, భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, కుంభకోణాలపై సమాధానం చెప్పడంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా స్పందించాలని వైసిపి నేతలు డిమాండ్ చేయడంతో కమలనాథులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రాష్ట్రానికి బిజెపి విద్రోహంపై వైసిపి, టిడిపి, జనసేన పల్లెత్తు మాట అనడంలేదు సరికదా అన్ని సందర్భాల్లోనూ కేంద్రానికి అండగా నిలుస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల చంద్రబాబు అమిత్ షా భేటీ అనంతరం సమీకరణాల్లో ఏమైనా మార్పు వచ్చిందా లేక ఇది టీ కప్పులో తుఫానుగానే మిగిలిపోతుందా అన్నది కొద్ది కాలం వేచి చూస్తే తేలుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలను మోసగిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బిజెపితో ఏ ప్రాంతీయ పార్టీ కూడా చెలిమి చేయకుండా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది.