
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : రాజంపేట మండలానికి రెగ్యులర్ ఏబిసిడబ్ల్యూఓను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏ.బి.సి.డబ్ల్యూ.ఓ కార్యాలయం ఎదుట మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. రెగ్యులర్ ఏ.బి.సి.డబ్ల్యూ.ఓకు జిల్లా ఇంచార్జ్ అధికారిగా బాధ్యతలు ఇవ్వడం ద్వారా రాజంపేట సహాయ సంక్షేమ అధికారి కార్యాలయంలో పాలన వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రాజంపేట పార్లమెంటు హెడ్ క్వార్టర్‌లో ఏ.బి.సి.డబ్ల్యూను నియమించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ విధులకు డుమ్మా కొడుతుండడంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్ధుల సమస్యలు ఎవరి దృష్టి తీసుకోపోవాలో తెలియక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. హాస్టల్ పర్యవేక్షణ చేసి విద్యార్థుల సాధక బాధలు తెలుసుకునే నాధుడే లేరన్నారు. బీసీ హాస్టల్ వార్డెన్లు విధులకు సక్రమంగా హాజరుకాకుండా వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజంపేట, కోడూరు పట్టణాలలో వున్న బీసి వసతి గహాలలో చదువుతున్న విద్యార్ధుల సమస్యలు పరిష్కరించటంలో, వారికి మౌళిక వసతులు కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. హాస్టల్ విద్యార్ధుల సమస్యలపైన ప్రధానంగా మెను సక్రమంగా అమలు కావటం లేదని, విద్యార్ధుల హాజరు మీద అవకతవకలు ఉన్నాయని పలు మార్లు జిల్లా ఇంచార్జ్ అధికారి సందప్పకు పిర్యాదు చేసినా పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లకు వత్తాసు పలుకుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర, అంజి, హరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.