విరితోటగు తియ్యని సీజనల్ పండు. పొద జాతి ముళ్ళచెట్టు. రేగు చెట్టు ఆకులు కాయలు కూడా చిన్నవే. ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది. ప్రపంచమంతటా జుజుబీ పండ్లు అని పిలుస్తున్నారు. పొలాల్లో తియ్యని రేగుపళ్ళ కోసం వాటి ముళ్ళ గాయాలు రుచిచూడని వారుండరు. దేశవాళీ రేగు చెట్లకు నిండుగా ముళ్ళుంటాయి. రేగు ఆకుల్లో పండ్లలో కూడా ఔషధ ప్రయోజనాలున్నాయి. చిన్న మొక్కలే పెద్ద కాయలతో ఘనమైన కాపు కాస్తూ, అమోఘమైన రుచిని అందిస్తాయి. ముళ్ళు తక్కువగా ఉండే విదేశీ రేగు మొక్కలూ మనకు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. రేగుజాతి మొక్కలకు ఎక్కువగా నీటి వనరు అవసరం లేదు.
- చైనా రేగు..
నేరేడు పళ్ళు అంత సైజులో, అదే ఆకారంలో కాయలు కాసే మొక్క చైనా రేగు. చైనా రేగుపండ్లు ఈత పండ్లు రంగులో ఉంటాయి. మొక్కలు ఐదారడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. ముగ్గిన తర్వాత కూడా మాగి ఎండిపోయే వరకూ చెట్లకే ఉంచి ఖర్జూరాన్ని ఎలా తయారుచేస్తారో చైనాలో ఈ పళ్ళను అలాగే మాగించి నిలువ ఉండే, రేగులుగా మారుస్తారు. ఈ రేగులు చాలా తియ్యగా ఉంటాయి. చైనా రేగు మొక్కలకు ఆకులు కూడా చాలా గుబురుగా ఉంటాయి. వీటికి నీటి తడి ఎక్కువ అవసరం.
- ఆపిల్ రేగు..
నాటిన ఆరుమాసాలకే కాపు కాసే సరికొత్త హైబ్రీడ్ ఆపిల్ రేగు. చూడ్డానికి ఆకారంలోనూ, పరిమాణంలోనూ గ్రీన్ ఆపిల్స్‌లా ఉంటాయి. పిందెగా ఉన్నప్పుడు ఆకుపచ్చగానూ పక్వానికి వచ్చినప్పుడు కాస్త గోధుమ రంగులోనూ ఉంటుంది. దీన్ని జ్యూస్‌గా కూడా చేసుకోవచ్చు. కుండీల్లోనూ ఫలసాయాన్ని పొందొచ్చు. నేల మీద కాయలు పరిమాణం కాస్త పెద్దగా ఉంటాయి. జనవరి నుంచి వేసవికాలం వరకూ ఆపిల్ రేగులు కాస్తూనే ఉంటాయి. ఇది అమెరికన్ జాతి మొక్క.
- క్రీపర్ రేగు..
కొమ్మలు సన్నగా తీగల్లా పెరుగుతుం టాయి. చుట్టూ కర్రలతో పందిరి వేస్తే కొమ్మలు వాటికి పాకుతాయి. సీజన్ రాగానే కిందకి వేలాడుతూ కాయలు కాస్తుంది. కాయలు పెద్ద పరిమాణంలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిలో గుజ్జు భాగం ఎక్కువ. ఇది థాయిలాండ్ రకం. ఈ కాయలు జ్యూస్‌కి ఉపయోగపడతాయి. ఎర్రమట్టి నెలలో బాగా కాస్తాయి. దీనికి పది రోజులకి ఒకసారైనా నీటి వనరు అందించాలి.
- లీ జుజుబి..
ప్రపంచమంతటా వినియోగించే రేగుపళ్ళలో లీజుజుబి ఒకటి. ఇది కూడా చైనా దేశం మొక్కే. చైనాలో పెద్ద ఎత్తున రేగు సాగు చేసి ఆ పండ్లను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. ఇవి జామకాయ పరిమాణంలో ఉండి లేత పసుపు, ముదురు గోధుమ రంగుల కలబోతతో మచ్చల మచ్చలుగా ఉంటాయి. ఇవి రుచిగా ఉండటమేకాదు.. ఎక్కువ కాలం నిలువ కూడా ఉంటాయి. జనవరి నుంచి వేసవికాలం చివర వరకు కాపు కాస్తూనే ఉంటాయి పొడి నేలల్లో పెరిగే ఇవి పెద్ద కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
- షుగర్ కేన్ జుజుబీ..
పొడవుగా కోలగా ఉండే కాయలు కాసేది షుగర్ కేన్ రేగు. కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వస్తే గోధుమ రంగులోకి మారుతాయి. చాలా తియ్యగా ఉంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. ముళ్ళు కూడా ఉంటాయి. నాటిన రెండేళ్లకే కాపుకాస్తుంది. పొడి నేలల్లో పెరుగుతుంది.
- హనీ జార్ రేగు..
తక్కువ ముళ్ళుతో కాయలు గుత్తులుగా కాస్తుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మొక్క ఆరు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఎరుపు, నల్లరేగడి, ఇసుక, గరప నేలల్లో కూడా పెరుగుతాయి.
- టేబుల్ రేగు..
కుండీల్లో కాసే రేగు మొక్కలివి. సాధారణ రేగి పండు కంటే కాస్త పెద్దవిగాను, రుచిగా ఉంటాయి. ముళ్లు తక్కువగానే ఉంటాయి. ఇళ్ల ప్రహరీ గోడల వద్ద, ఇంటి ముంగిట జాగాల్లోను, పశువుల నుంచి ఇంటికి రక్షణ ప్రకారంగా ఫ్రెన్షింగ్‌గా ఈ మొక్కలు పెంచుకోవచ్చు.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506