Sep 10,2023 11:57

తండ్రి మరణం.. తల్లి కష్టం చూస్తూ పెరిగిన సంతోష్‌ శోభన్‌ సినీ పరిశ్రమలో యువనటుడిగా రాణిస్తున్నారు. సినిమాలే ప్ర్రాముఖ్యంగా తన జీవితాన్ని ప్రారంభించి, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. విజయాల కన్నా అపజయాలే ఎక్కువ ఎదురైనా.. నిరుత్సాహపడక తండ్రి బాటలోనే నడవాలనుకున్నారు. బాల నటుడిగా వెండితెరకు పరిచయమై... యువతను ఆకట్టుకుంటున్న సంతోష్‌ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం !

పేరు : సంతోష్‌ శోభన్‌
పుట్టిన తేది : 12 జులై, 1996
జన్మస్థలం : హైదరాబాద్‌
చదువు : థియేటర్‌ ఆర్ట్స్‌
వృత్తి : నటన
ఇష్టమైన వ్యక్తులు : ప్రభాస్‌(హీరో)

44

సంతోష్‌ శోభన్‌ తండ్రి శోభన్‌, దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌. 'వర్షం, చంటి, బాబి' సినిమాలకు దర్శకత్వం వహించారు. తల్లి సౌజన్య. తమ్ముడు సంగీత్‌ శోభన్‌. హాస్యనటుడు లక్ష్మీపతి, సంతోష్‌కి పెద్దనాన్న. సంతోష్‌ ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి సినిమా షూటింగ్‌లకు తీసుకెళుతుండేవారు. పదకొండేళ్ల వయస్సులో తండ్రి మరణించారు. నెలరోజుల వ్యవధిలోనే పెద్దనాన్న లక్ష్మిపతి గుండెపోటుతో మరణించారు. దాంతో ఆర్థికంగా సంతోష్‌ కుటుంబం ఇబ్బందుల్డో పడ్డారు. తల్లి ఇద్దరి పిల్లల్నీ కష్టపడి చదివించారు. సంతోష్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రం బ్యాట్‌, బాలు పట్టుకొని గ్రౌండ్‌కెళ్లి ఆడాల్సిందే. ఆ క్రికెటే వల్లే తనకు బాల్యంలో సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. 'గోల్కొండ హైస్కూల్‌ (2011)' చిత్రంలో బాలనటుడిగా రంగప్రవేశం చేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా స్ఫూర్తిదాయకమైన క్రికెట్‌ కోచ్‌ చుట్టూ తిరుగుతుంది. శోభన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ గౌతమ్‌ పాత్రలో నటించారు. సంతోష్‌కు తమ్ముడు సంగీత్‌ శోభన్‌ అంటే చాలా ఇష్టం.
            హైదరాబాద్‌లోని సెయింట్‌ అల్ఫోన్సా హైస్కూల్లో పదో తరగతి వరకు చదివారు. బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు సంతోష్‌. ఈ క్రమంలో పిప్పళ్ల రాజ్‌ రొమాంటిక్‌ కామెడీ 'బంగారు కోడిపెట్ట (2014)' సినిమాలో వేణు అనే క్యారెక్టర్‌లో సపోర్టింగ్‌ రోల్‌లో నటించారు.
           శోభన్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'తాను నేను (2015)'. దీనికి రామ్‌మోహన్‌ పి. దర్శకత్వం వహించారు. అవికా గోర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా పెద్దగా విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వి జయశంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పేపర్‌ బారు (2018)' చిత్రంలో హీరోగా చేశారు. కాలేజ్‌లో చదువుకుంటూనే, పేపర్‌బారుగా పనిచేయడం, ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడిగా నటించి, యువతను ఆకట్టుకున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని ఇచ్చింది. సంతోష్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించిన 'ఏక్‌ మినీ కథ (ఒక చిన్న కథ (2021)' లో నటించారు. మారుతీ దాసరి తీసిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ట్రైనర్‌ చిత్రం 'మంచి రోజులు వచ్చాయి (2021)' లో లవర్‌బారుగా నటించారు. 'లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (2022), కళ్యాణం కమనీయం (2023), శ్రీదేవి శోభన్‌బాబు (2023)' వంటి సినిమాల్లో తనలో మరో నటుడుని చూపించారు. 'ది గ్రిల్‌', 'ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ' అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు.
           'నేను ఇప్పటి వరకు చాలా మంచి డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశాను. నందినీ, గాంధీ, మారుతి వంటి డైరెక్టర్స్‌తో వర్క్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. 'ప్రేమ్‌ కుమార్‌' చిత్రంలో నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. నాకు నేనే కొత్తగా కనిపించా. 'అన్నీ మంచి శకునములే' చిత్ర షూటింగ్‌ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. షావుకారు జానకి వంటి సీనియర్‌ నటితో నటించడం, ఆమెతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఆమెను చూసి చాలా నేర్చుకున్నా. డైలాగ్స్‌ ఎవరు మర్చిపోయినా గుర్తుచేస్తారు. తొంభై ఏళ్లు పైబడినా యాక్టివ్‌గా ఉన్నారు. వంట చేస్తారు. నన్ను 'డార్లింగ్‌' అని పిలిచేవారు. నేనూ అలాగే పిలిచేవాడిని. నేను నటించిన ప్రతి సినిమాలోనూ పెళ్లి సీన్సు ఉండాల్సిందే. అది కథను బట్టి రాసుకున్న సన్నివేశాలు. కానీ ఎందుకో పెళ్లి బట్టలు చూస్తుంటే డిప్రెషన్‌ వచ్చేస్తుంది. పెళ్లి తతంగం వద్దనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే రిజిస్టర్‌ మ్యారేజే చేసుకుంటాను' అని నవ్వుతూ చెప్పారు.