రేగిపండు మాట వినగానే నోటిలో నోరూరుతుంది. పల్లెటూళ్ళలోనూ, పొలాల్లోనూ రోడ్ల పక్కన కనిపిస్తాయి. దీనిలో రెండు రకాలున్నాయి. పెద్ద రేగు లేదా కొండ రేగు. చిన్న రేగు లేదా సీమ రేగు. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ మారిటియానా. రామినేసి కుటుంబానికి చెందినది. వీటిలో 'సి' విటమిన్, కొన్ని రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే చిన్న రేగు పాక శాస్త్రంలోనూ చోటు సంపాదించింది. రేగుతో చేసే రకరకాల వంటలను మనమూ తెలుసుకుందాం.
- హల్వా..
కావలసినవి : సీమరేగి పళ్ళు- కప్పు, గోధుమరవ్వ - కప్పు, పాలు - కప్పు, బెల్లం/ పంచదార - కప్పు, నెయ్యి - 4 స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ పలుకులు - 4 స్పూన్లు, యాలకపొడి - 1/2 స్పూను
తయారీ : బాండీలో నెయ్యి వేడిచేసి, డై ఫ్రూట్స్ పలుకులు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో స్పూను నెయ్యి వేసి గోధుమరవ్వను దోరగా వేయించుకోవాలి. మరో వెడల్పాటి గిన్నెలో పాలు 1/4వ వంతు మరిగించి, దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వను ఉడికించాలి. రవ్వ ఉడికిన తరువాత పంచదార / బెల్లం తరుగు వేసి, మిశ్రమాన్ని ఒకసారి తిప్పి ఉడికించాలి. అది ఉడికే లోపల శుభ్రంచేసి, గింజలు తీసిన రేగిపళ్ళను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ గుజ్జును ఉడికిన రవ్వ, పాలు మిశ్రమంలో కలిపి దగ్గరకొచ్చేవరకూ తిప్పుతూ ఉడికించాలి. చివరిగా స్టౌ ఆఫ్‌చేసి యాలకపొడి, డ్రై ఫ్రూట్స్ పలుకులను యాడ్ చేసి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే పుల్లగా, తియ్యగా ఉండే రేగుపళ్ళ హల్వా రెడీ.
- వడియాలు..
కావలసినవి : సీమరేగి పళ్ళు- కప్పు, జీర - స్పూను, పండుమిర్చి / పచ్చిమిర్చి - 6, ఉప్పు - తగినంత, బెల్లం - కప్పు
తయారీ : జీర, పండుమిర్చి / పచ్చిమిర్చి, ఉప్పు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానిలో బెల్లం తరుము వేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రం చేసుకుని పూర్తిగా తడి ఆరిపోయిన రేగిపళ్ళను దానిలో వేసి కలుపుకోవాలి. గింజ నలగకుండా గుజ్జుగా
రోట్లో నూరుకుంటే, తినేటప్పుడు నోరు కొట్టుకుపోకుండా ఉంటుంది. ఈ గుజ్జును ప్లాస్టిక్ కవరుపై వడియాలుగా పెట్టుకుని, ఎండలో ఆరనివ్వాలి. ఒకవైపు ఎండిన తరువాత రెండవ వైపుకు తిప్పి ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిపోయిన తరువాత గాలి చొరబడని డబ్బాలో నిలువ పెట్టుకోవాలి. ఇవి ఏడాది వరకూ నిల్వ ఉంటాయి. పుల్లపుల్లగా నోరూరించే రేగిపళ్ళ వడియాలు పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
- నిల్వ పచ్చడి ..
కావలసినవి : సీమరేగి పళ్ళు- 2 కప్పులు, ఉప్పు-తగినంత, పండుమిర్చి / కారం - 100 గ్రా, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను, పసుపు - 1/2 స్పూను
పొడి : ఆవాలు, మెంతులు ఫ్రై చేసి, పొడి చేసుకోవాలి.
తాలింపు కోసం : నూనె - కప్పు, వెల్లుల్లి పేస్ట్ - పెద్ద వెల్లుల్లి, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను
తయారీ : శుభ్రం చేసుకుని పూర్తిగా తడి ఆరిపోయిన రేగిపళ్ళను (కాయ పుచ్చులున్నాయేమో తీసి కూడా చేసుకోవచ్చు) పక్కనుంచుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పేస్ట్‌ను బాగా వేగనివ్వాలి. నూనె ఆరిన తరువాత మిక్సీ పట్టుకున్న ఆవ, మెంతి పొడి, ఉప్పు, పండుమిర్చి గుజ్జు / కారం వేసి, బాగా కలపాలి. వాటిలో రేగిపళ్ళను కూడా వేసి, కలపాలి. ఈ పచ్చడిని తడిలేని సీసాలో నిల్వ ఉంచుకుంటే తాజాగా ఉంటుంది.
- రోటిపచ్చడి ..
కావలసినవి : సీమరేగిపళ్ళు- కప్పు, మినపగుళ్ళు - స్పూను, జీర - స్పూను, పసుపు - 1/2 స్పూను, పచ్చిమిర్చి / పండుమిర్చి - 8, ఎండుమిర్చి - 4, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రెబ్బలు - 6, చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
పోపు కోసం : నూనె -2 స్పూన్లు, ఎండుమిర్చి - 2, పోపు దినుసులు - స్పూను, కరివేపాకు - 2 రెబ్బలు
తయారీ : మినపగుళ్ళు, జీర, పచ్చిమిర్చి / పండుమిర్చి, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. అదే బాండీలో స్పూను నూనె వేడిచేసి గింజలు తీసిన రేగిపళ్ళను దోరగా వేయించుకోవాలి. మిక్సీ జార్‌లో ఈ రేగిపళ్ళు, డ్రై రోస్ట్ చేసుకున్న మిశ్రమం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండువేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకుని, పోపు పెట్టుకుంటే ఘుమఘుమలాడే పచ్చడి రెడీ. రోటిపచ్చడికి పచ్చివి లేదా దోరగా పండిన రేగిపళ్ళు అయితే రుచిగా ఉంటుంది.