Oct 14,2023 07:05

పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌...పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచేదానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్కరణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతున్నది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మాజ పరివర్తనకు, దారిద్య్ర నిర్మూలనకు, ఆకలిని అంతం చేయడానికి ఒక విప్లవాత్మక సాధనం విద్య. పాలో ఫ్రీర్‌ అనే విద్యావేత్త విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ...మనిషి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి సామర్ధ్యాలను పెంచే సాధనం విద్య అన్నారు. అయితే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతూ...ఈ సంస్కరణలన్నీ మన పిల్లలను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికని నమ్మబలుకుతున్నది. కానీ ఇవి మన చిన్నారులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తయారు చేయడం సంగతి అటుంచి వారిని విద్యకే దూరం చేసేలా వుండడం విచారకరం.
           ఎన్‌.ఇ.పి-2020 అమలు పేరుతో మూడు కిలోమీటర్లలోపు వున్న పాఠశాలలను విలీనం చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలతో దానిని ఒక కిలోమీటర్‌కు కుదించి అమలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు 'మా ఊరు బడి మా ఊరిలోనే ఉండాలి' అని చేసిన తీవ్రమైన ఆందోళనలు, ఎమ్మెల్సీల బస్సు యాత్రలు, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం మొదట ప్రకటించిన అన్ని స్కూళ్లను విలీనం చేయలేకపోయింది. 5,400 ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్న 8000 పాఠశాలలతో పాటు మరో 4000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విభజించిన తర్వాత ఒకటి రెండు తరగతులు మిగిలి ఉన్న ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా వుంది. ఇక్కడ 10 లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు, ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో...పాఠశాలకు ఉండవలసిన హంగు, ఆర్భాటాలను కోల్పోయి...సహజ మరణం పొందే బడులుగా మారాయి. దీనితో ఆ పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చదువు మానేయడం లేదా ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం తప్ప మరో దిక్కు లేని వారిగా మిగిలిపోయారు. తీరా ఇప్పుడు విలీనం తర్వాత మిగిలిన ఒకటి రెండు తరగతులలో పది లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడానికి రూపొందించిన జీవో-117 నిబంధనలు ఉపాధ్యాయుల కుదింపే లక్ష్యంగా ఉన్నాయి. దీనితో 37 వేల యస్‌.జి.టి పోస్టులు, 18 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కనుమరుగు అయ్యాయి. ఉపాధ్యాయులను కుదించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి. ఈ విలీన ప్రక్రియ వలన అందుబాటులో ఉన్న స్కూలు నుండి దూరంగా ఉన్న స్కూలుకు విద్యార్థులను బలవంతంగా తరలించడం వలన విద్యార్థులు చదువు మధ్యలోనే బడి మానేస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీనితో అందరికీ విద్య అందించాలనే రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు. ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్‌ 21-ఏ ని ఉల్లంఘించడమే అవుతుంది.
          విలీనం అనంతరం రేషనలైజేషన్‌ కోసం జీవో-117 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలలో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:45, ఉన్నత పాఠశాలలో 1:53గా నిర్ణయించారు. ఇది విద్యా హక్కు చట్టం-2009 నిబంధనలకు విరుద్ధంగా ఉంది. విద్యాహక్కు చట్టం-2009లో ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35, ఉన్నత పాఠశాలలో 1:45 ఉండాలని సూచించారు. కానీ దీనికి భిన్నంగా ఉపాధ్యాయుల కుదింపే లక్ష్యంగా జరిగింది. ఇది విద్యార్థుల అభ్యసనా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు అదనపు భారం మోపడంతో ఆనందకరమైన బోధనా అభ్యసన భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సాకుగా చూపుతున్న ఎన్‌.ఇ.పి-2020లో కూడా 5+3+3+4 అనేది అభ్యసనా దశలుగానే ప్రకటించింది తప్ప దీనికోసం భౌతికపరమైన విభజన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అందువలన ఈ విలీన ప్రక్రియ రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 21-ఎ, విద్యాహక్కు చట్టం-2009, ఎన్‌.ఇ.పి-2020 లను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది.
      అభివృద్ధి చెందిన అన్ని దేశాల విద్యా వ్యవస్థలు, చివరికి ఎన్‌.ఇ.పి-2020 కూడా బోధనా భాషగా మాతభాషను ఒకటి నుండి ఐదు తరగతుల వరకు, అవసరమైతే ఎనిమిదో తరగతి వరకు కొనసాగించడం ద్వారానే పిల్లలలో భావనలు, అభివృద్ధి అర్థవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. ఇంగ్లీష్‌ భాష నేర్చుకోవడానికి బోధనా భాష ఆటంకం కాదని విద్యావేత్తలు చెప్తున్నారు. కానీ అశాస్త్రీయ పద్ధతిలో బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టి పిల్లలను బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంలోకి నెట్టడం పిల్లల హక్కులను కాలరాయడమే. కనీసం ఏ భాషలో చదువుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికి ఇవ్వకపోవడం పిల్లలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగానే పరిగణించాలి. దీనితో పిల్లలు ఇంటి భాషకు, బోధనా భాషకు మధ్య సమన్వయం చేసుకోలేక భావనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులకు గురవుతుంటే భవిష్యత్తులో ఏ విధంగా విజయవంతం అవుతారో ఏలిన వారికే తెలియాలి. దీనికి భిన్నంగా ప్రైవేటు వ్యవస్థలో కూడా మాతృభాషలో బోధనను తప్పనిసరి చేయడం ద్వారానే పిల్లల జ్ఞానాభివృద్ధి, జ్ఞానతష్ణను తీర్చగలం.
         42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను కేంద్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా లోకి మార్చడం జరిగింది. ఆ యా రాష్ట్రాలలో ఉన్న భౌతిక పరిస్థితులు భౌతిక వనరుల ఆధారంగా విద్యలో కావలసిన మార్పులు, చేర్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. 2019లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను నిరాకరిస్తూ అన్ని వ్యవస్థలను కేంద్రీకృతం చేస్తుంది. దానిలో భాగంగానే విద్యా రంగంలో కూడా నీట్‌-2020, ఎన్‌.ఇ.పి-2020, సిలబస్‌లో చరిత్రను మార్చడం వంటివి చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు సిబిఎస్‌ఇ ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రాలలో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి కరికులం, బోధనా పద్ధతులను తయారు చేస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా కరికులం, బోధనా పద్ధతుల్ని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్ణ యిస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో మన రాష్ట్ర సంబంధిత అంశాలు ఉండే అవకాశం ఉండదు. అందువలన దీనిని ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి పరిధిలోనే ఉంచి సి.బి.ఎస్‌.ఇ లోని మంచి అంశాలను స్వీకరించవచ్చు. విద్యా వ్యవస్థలో అద్భుత ఫలితాలు సాధించిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న సి.బి.ఎస్‌.ఇ, ఐ.సి.ఎస్‌.ఇ బోర్డులతో పాటు డి.బి.ఎస్‌.ఇ ని ప్రారంభించి దాని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దీనికి భిన్నంగా సిబిఎస్‌ఇని ప్రవేశపెట్టి ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి ని నిర్వీర్యం చేయడమనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం. విద్యాబోధనలో టెక్నాలజీని మిళితం చేయడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఉపాధ్యాయుల బోధనకు బైజూస్‌ ప్రత్యామ్నాయం కాదు. కరోనా కాలంలో ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రత్యామ్నాయం కాదని అందరికీ అనుభవం అయింది. దీనికి భిన్నంగా మంచి ఉపాధ్యాయులను గుర్తించి వారితో డిజిటల్‌ కంటెంట్‌ రూపొందించుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి ఉండేది.
          పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌...పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచేదానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్కరణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
           స్కూళ్ల విలీనం పేరుతో గందరగోళం సృష్టించడంతో, ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్లకు ఈ సంవత్సరం లక్షల్లో పిల్లలు తరలి వెళ్లారు. విద్యార్థులలో పఠన సామర్థ్యాలు, గణిత సామర్థ్యాలు 2012 ముందు నాటి స్థితికి పడిపోయాయని 'అసర్‌ రిపోర్టు-2022' తెలియజేస్తున్నది. ఏకపక్షంగా అమలు చేసిన సంస్కరణలతో విద్యార్థుల చదువు గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం...ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఆలోచించాలి. లేని పక్షంలో విద్యా రంగంలో సానుకూల ఫలితాల కోసం ప్రజలే పోరు బాట పడతారు.

/ వ్యాసకర్త యుటిఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి, సెల్‌ : 9966135289 /
జి. వెంకటేశ్వరరావు

11