Dec 16,2022 07:33

భారతీయ రైల్వేలు... ప్రయాణ ప్రగతికి మార్గాలు...కాదనలేని నానుడి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయోవృద్ధులను తీవ్రంగా కలచివేసింది. గతంలో అమలైనసీనియర్‌ సిటిజన్స్‌ రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ తరహా రాయితీల విషయమై పట్టించుకోక పోవడంతో సకల జనులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాధారణ ప్రజానీకానికి ప్రయాణ వాహక నౌకగా కీర్తించబడే రైళ్ళలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీలు ఎత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరాన్ని, ప్రయాణానుభూతి చౌకగా లభించే సౌకర్యం చేజారటం నివ్వెర పరచింది. జనులందరికీ ఉపయుక్తమైన చర్యలను నిలిపివేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
         రైళ్ళలో గతంలో సాధారణ ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం, 60ఏళ్లు నిండిన పురుషులకు 40 శాతం రాయితీలు ఇస్తున్నారు ఈ సౌకర్యం ఎన్నో ఏళ్ళనుంచి అమలౌతోంది. కరోనా పుణ్యమాని సీనియర్‌ సిటిజన్స్‌ రాయితీలను నిలిపివేశారు. ఆ పిమ్మట అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నా రాయితీల పునరుద్ధరణ జరగలేదు. ఇక ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి ఎంతో భారమౌతోందంటూ నిన్నటికి నిన్న మన రైల్వే మంత్రి సెలవిచ్చారు. అయితే ఈ భారం కరోనా ముందు కూడా ఉన్నదే అంటూ వయో వృద్దులు పేర్కొంటున్నారు. ప్రతి మనిషీ ఏదో ఒక రోజున సీనియర్‌ సిటిజన్‌ కావడం తప్పదంటున్నారు. ప్రయాణికుల సేవల కోసం ప్రభుత్వం గత ఏడాది. రూ. 59వేల కోట్లు రాయితీ ఇచ్చిందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు సమకూరుస్తున్నట్లు రైల్వే శాఖ వివరిస్తోంది. అయితే రాయితీల అంశం ప్రయాణికుల సదుపాయాల్లోకి రాకపోవడం శోచనీయమని సీనియర్‌ సిటిజన్లు సంఘాలు నివేదిస్తున్నాయి.
సగటు జీవికి అందుతున్న రైల్వే రాయితీలు భారమవుతున్నాయంటున్న పాలకులు కార్పోరేట్లు, బహుళ జాతి సంస్థలకు దేశ సంపదను అప్పనంగా కట్టబెట్టటం లేదా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దీన్ని మేధావులు, మీడియా తులనాత్మకంగా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
          గరీబ్‌ రథ్‌ పేరిట అప్పట్లో సరికొత్త రైళ్ళను సాధారణ, మధ్యతరగతి ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టారు. ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ చౌకగా గమ్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. జనంకూడా కాస్తంత తక్కువ ధరలోనే టికెట్లు కొని ప్రయాణ అనుభూతిని పొందారు. ఈ తరహాలో వయోవృద్ధులకు రాయితీలిచ్చే సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. రైల్వేలు సాంకేతిక పరంగా గొప్ప ప్రగతినే చాటాయి. సమయంకుదింపు... టెక్నాలజీ సమ్మిళితమైన ఎన్నో ఆకర్షణలు భాగమయ్యాయి. కరోనా అనంతరం ఈ రాయితీల పునరుద్ధరణ కోసం అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మధ్య... రాయితీల ప్రకటనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. వయోపరిమితిని 60 నుంచి 70 ఏళ్ళకు పెంచడం, జనరల్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ లకు మాత్రమే వర్తించేలా ప్రకటన రావచ్చంటూ ఊదర కొట్టారు. అయితే వారంలోనే సీనియర్‌ సిటిజన్ల రాయితీ ఇప్పట్లో లేదని రైల్వే మంత్రి ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. ఏతావాతా పలువురికి ఉపకరించే సీనియర్‌ సిటిజన్స్‌ రాయితీల పునరుద్ధరణ పై కేంద్రం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి అనుభూతులను పరిగణించాలని సకల జనుల ఆకాంక్ష....ఘోషా...!

-చెన్నుపాటి రామారావు
9959021483.
(రచయిత : విశ్రాంత పాత్రికేయుడు)