- ప్రయాణికుల ద్వారా ఆర్జన 76 శాతం పెరుగుదల
- కోవిడ్ మునుపటి స్థాయికి రెవెన్యూ
న్యూఢిల్లీ : రైల్వేలు నష్టాల్లో నడుస్తున్నాయంటూ ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన ఏమాత్రం పసలేనిదని తేలిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ప్రయాణికుల ద్వారా ఆదాయం గతేడాదితో పోలిస్తే 76 శాతం పెరిగింది. గత నవంబరు ఆఖరు వరకు భారతీయ రైల్వే ప్రయాణీకులకు అందించిన వివిధ రకాల సేవల నుంచి మొత్తం రూ.43,324 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలానికి కేవలం రూ.24,631 కోట్లు రెవెన్యూ వచ్చింది. గతేడాది రిజర్వుడు సెగ్మెంట్‌లో రూ.22,904 కోట్లు రాగా ఈ ఏడాది రూ.34,303 కోట్లు ఆదాయం లభించింది. అన్ రిజర్వుడు అంటే సాధారణ టిక్కెట్ల మీద గతేడాది కంటే 422 రెట్లు ఎక్కువ రెవెన్యూ సాధించి రూ.9021 కోట్లు ఆర్జించింది. కోవిడ్ కారణంగా 2021, 22 ఆర్థిక సంవత్సరాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే. 2022 ఏప్రిల్ - నవంబరు మధ్య కాలంలో ప్రయాణికుల ద్వారా ఆర్జించిన ఆదాయం గణనీయమైన స్థాయిల్లో ఉంది. 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కాలానికి ఆర్జించిన రెవెన్యూ కంటే ఇది అధికమని రైల్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే రెవెన్యూ సృష్టించే గొప్ప వనరుగా ప్రయాణికులకు అందించే సేవలు నిలిచాయి. 2018లో రూ.33900 కోట్లు, 2019లో రూ.35255 కోట్లు మేర రైల్వేకు ప్రయాణికుల ద్వారా లభించింది. ఈ ఏడాది అంతకుమించి ఆదాయం ఆర్జించడం విశేషం. రిజర్వు చేసుకోవడం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికుల సంఖ్య గతేడాది 48.6 కోట్ల మంది కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 10 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది 53.65 కోట్ల మంది టిక్కెట్లను రిజర్వు చేసుకున్నారు.










