Jun 09,2023 07:38

పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్న దళిత, గిరిజన, బలహీన కుటుంబాలకు కొద్దిమేరకైనా అండగా వున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం బలహీనం చేస్తుంటే ఈ రెండు పార్టీలు కనీసం స్పందించడంలేదు. రాయలసీమ అభివృద్ధికి ఇస్తామన్న బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి అమలు చేయకపోయినా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు మధ్యస్తంగా నిలిపివేసినా ఒక్క మాట మాట్లాడని ఈ రెండు పార్టీలు రాయలసీమను ఎలా అభివృద్ధి చేస్తాయి? పాలకుల విధానాలు మారకుండా... ఈ పార్టీల హామీలతో రాయలసీమ ప్రజల కడుపు నిండదు.

             రాయలసీమ వెనుకబాటుతనం గత అనేక దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల నినాదంగా మారింది. ఈ పార్టీల నేతలు తాము అధికారంలోకి రావడానికి రాయలసీమ జపం ఆపద మొక్కులాగా భావిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించిన మామ, అల్లుడు, తాత, తండ్రి, కొడుకు, మనవడు వరుసబెట్టి రాయలసీమ నీళ్ళ గురించి, పరిశ్రమల గురించి, వలసల గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడి వారు అలసిపోతున్నారే తప్ప, ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధికి నోచుకోవడంలేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కడపలో 'మిషన్‌ రాయలసీమ' ప్రకటించారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి పార్టీలు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ఈ ప్రాంత ప్రజలకు ఎన్ని హామీలు ఇవ్వలేదు? హామీల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, చేతలు గడప దాటడంలేదన్నట్లుగా వుంది. ఈ పార్టీలు రాయలసీమకు ఇచ్చిన హామీలలో సగం అమలు చేసి వుంటే కూడా ఈనాడు రాయలసీమ వెనుకబాటు గురించి మాట్లాడాల్సిన అవసరం వుండేది కాదు. రాయలసీమకు కావలసింది హామీలు కాదు, హామీలు అమలుచేసే చిత్తశుద్ధి. సమగ్రాభివృద్ధి. ఇది జరగాలంటే ఒక పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి రావడం కాదు కావలసింది, ఆయా పార్టీలు ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు మారాలి.
 

                                                       రాయలసీమ వెనుకబాటుకు ఎవరు కారణం ?

ఒక ప్రాంతం వెనుకబాటుకు, అభివృద్ధికి ప్రధానంగా రెండు కారణాలు వుంటాయి. ఒకటి ప్రకృతి సహజమైన వాతావరణం, నైసర్గిక స్వరూపం. రెండు పాలకులు అనుసరించే విధానాలు. రాయలసీమ జిల్లాలు సముద్ర మట్టానికి ఎత్తులో వుండడం, ఈ ప్రాంతానికి నైరుతి ఋతుపవనాలు రావడానికి పశ్చిమ కనుమలు, ఈశాన్య ఋతుపవనాలు రావడానికి తూర్పు కనుమలు అడ్డంకిగా వున్నాయి. అందుకే సకాలంలో వర్షాలు లేక నిత్య క్షామ పీడిత ప్రాంతంగా రాయలసీమ మారింది. సహజమైన ప్రకృతి ఆటంకాలను, పరిమితులను అధిగమించడానికి శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ విజ్ఞాన యుగంలో ఒక ప్రాంత వెనుకబాటుకు ప్రకృతిని కారణంగా చూపడం అశాస్త్రీయం. రెండు పాలకుల విధానాలు. స్వాతంత్య్రానికి పూర్వం నైజాం నవాబులు రాయలసీమ జిల్లాలను (నేటి బళ్ళారితో సహా) బ్రిటీష్‌ వారికి దత్తత ఇవ్వడం, వారు ఈ ప్రాంతంలోని పాలెగాళ్ళను అణచివేయడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, పరిశ్రమల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దత్త జిల్లాల అభివృద్ధి కోసం బ్రిటీష్‌ పాలన చివరి రోజుల్లో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు మద్రాసు రాష్ట్ర విభజన నేపథ్యంలో బళ్ళారి కర్ణాటకలో భాగం కావడంతో ఆ ప్రాజెక్టు ఇతర రాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. కర్నూలు రాజధాని, పెద్దమనుషుల ఒప్పందం ఇలా అనేకం జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుండి అత్యధిక సంవత్సరాలు రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినా రాయలసీమ వెనుకబడే వుంది. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడానికి పాలకుల భూస్వామ్య భావజాలం, నేటి కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలు ప్రధాన ఆటంకాలుగా వున్నాయి. ఈ విధానాల్లో మార్పు రావాలి.
 

                                                                         మిషన్‌ రాయలసీమ ?

గురువారం కడపలో నారా లోకేష్‌ ప్రకటించిన 'మిషన్‌ రాయలసీమ' లోని సమస్యలు పాతవే, పరిష్కారాలూ పాతవే. హామీ ఇచ్చిన నేత మాత్రమే కొత్త. లోకేష్‌ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లా నుండి ప్రారంభించి 118 రోజులు, 42 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1516 కి.మీ సాగింది. పాదయాత్ర రాయలసీమ జిల్లాల నుండి కోస్తా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కడపలో 'మిషన్‌ రాయలసీమ' ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మొదటి ప్రాధాన్యతగా చెప్పుకున్నారు. ఇందుకోసం రైతు పొలంలో విత్తు విత్తిన దగ్గర నుండి పంట అమ్ముకునే వరకూ ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడం, వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ విధానాలను అందుబాటులోకి తేవడం, ప్రతి నలభై కిలోమీటర్లకు ఒకచోట రైతు బజార్‌ను ఏర్పాటు చేయడం, ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సబ్సిడీతో డ్రిప్‌, స్పింక్లర్లు అందించడం, పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ లోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు.
           పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకటించారు. వలసలను ఆపి ఉపాధి పరిశ్రమలు తెస్తామన్నారు. కర్నూలు జిల్లాలో వ్యవసాయ పరికరాల తయారీ హబ్‌, పారిశ్రామిక కారిడార్‌, కడపలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరును ఎలక్ట్రానిక్‌ తయారీ హబ్‌గా, అనంతపురాన్ని ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తానన్నారు. ఈ హామీలు చూస్తుంటే రాయలసీమ రతనాలసీమ అయిపోతున్నట్లుగా వుంది.
 

                                                                    గత పాలనానుభవం ఏమిటి ?

లోకేష్‌ 'మిషన్‌ రాయలసీమ'లో ఈ ప్రాంత వ్యవసాయానికి కీలకమైన కొన్ని అంశాలను దాటవేశారు. రాయలసీమ జిల్లాలు ప్రధానంగా ఆధారపడిన తుంగభద్ర డ్యాం నీరు కిందికి రాకుండా కర్ణాటక ప్రభుత్వం డ్యాం పైన నిర్మిస్తున్న 'అప్పర్‌ భద్ర' గురించి మాట్లాడలేదు. రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా మోటార్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఈ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది కేేంద్ర ప్రభుత్వం విధానం. అదే అమలయితే రాయలసీమ జిల్లాల్లోని బోరు బావులన్నీ బీడులుగా మారాల్సి వస్తుంది. వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తుంది. మీటర్లను రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న టిడిపి కేంద్ర చట్టానికి మద్దతు ఇచ్చిన విషయం గురించి ఆయన మాట్లాడలేదు. రాయలసీమ జిల్లాలోని వేల ఎకరాల భూమిని అదానీ కంపెనీకి ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. ఒక్క అనంతపురం జిల్లా లోనే 56 వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి విధానపరంగా అంగీకారం తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం మూడు నల్ల చట్టాలను తెచ్చింది. అందులో భాగంగానే అదానీ లాంటి కంపెనీలకు వేల ఎకరాల భూమిని అప్పగిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ నల్ల చట్టాల మాటేమిటి? అదానీ భూముల వ్యవహారం ఏమిటి? లేపాక్షి నాలెడ్జ్‌ భూముల్లో పరిశ్రమలు తెస్తామన్నారు. గతంలో ప్రతిపక్షంలో వున్నపుడు తెలుగుదేశం రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ భూముల్లో ట్రాక్టర్లు వేసుకొని దున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూములను రైతులకు పంచడమో, పరిశ్రమలు స్థాపించడమో చేస్తామన్నారు. ఐదు సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా ఏమీ చేయకుండానే దిగిపోయారు కదా! హంద్రీ నీవా ద్వారా సాగుభూములకు నీరు ఇస్తామని గతంలో చెప్పారు. అధికారంలో వున్న ఐదు సంవత్సరాల్లో పంట పొలాలకు నీరందించే ఒక్క కాల్వను కూడా తవ్వలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో భైరవాని తిప్ప, పేరూరు ప్రాజెక్టుల గురించి హడావుడి చేశారు.
             గత తెలుగుదేశం పాలనలో పరిశ్రమల స్థాపన కోసం వేసిన శంకుస్థాపనలు ఎందుకు పూర్తికాలేదు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్‌, నాసెన్‌ పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ పార్క్‌, కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో రూ.400 కోట్లతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి), రైల్వే కోచ్‌ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరులో చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌ హామీలలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. వీటిలో కొన్ని శంకుస్థాపన దశలోనే ఆగిపోయాయి. అనంతపురంలో నిర్మించాల్సిన కేంద్రీయ యూనివర్శిటీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రహరీ గోడలు కూడా పూర్తికాని విషయం లోకేష్‌ దృష్టికి రాలేదా? వచ్చినా కేంద్రంపై విమర్శించకూడదని దాటవేశారా ?
 

                                                       రాయలసీమ ప్రజలను నిరాశపరచిన వైసిపి ప్రభుత్వం

గత టిడిపి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదనే కోపంతో వైసిపి పార్టీకి ఈ ప్రాంతంలోని 52 అసెంబ్లీ సీట్లల్లో 49 కట్టబెట్టారు. ఈ నాలుగు సంవత్సరాల్లో వారు చేసింది శూన్యం. సంక్షేమ పథకాలే సర్వస్వం అయినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అక్రమంగా అప్పర్‌భద్ర నిర్మిస్తుంటే కళ్ళు అప్పగించి చూశారు. డ్రిప్‌, స్పింక్లర్లకు నాలుగు సంవత్సరాలుగా సబ్సిడీ నిలిపివేశారు. వ్యవసాయ అభివృద్ధి అంటే రైతు భరోసా నిధులు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణమే అన్నట్లుగా చేస్తున్నారు. హంద్రీనీవా సాగుకాల్వలు తవ్వకుండా గత ప్రభుత్వం మాదిరే చెరువులు నింపుతూ పూజలు చేస్తున్నారు. లేపాక్షి భూములను తక్కువ ధరకు కొట్టివేసేందుకు చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నారు.
           పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్న దళిత, గిరిజన, బలహీన కుటుంబాలకు కొద్దిమేరకైనా అండగా వున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం బలహీనం చేస్తుంటే ఈ రెండు పార్టీలు కనీసం స్పందించడంలేదు. రాయలసీమ అభివృద్ధికి ఇస్తామన్న బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి అమలు చేయకపోయినా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు మధ్యస్తంగా నిలిపివేసినా ఒక్క మాట మాట్లాడని ఈ రెండు పార్టీలు రాయలసీమను ఎలా అభివృద్ధి చేస్తాయి? పాలకుల విధానాలు మారకుండా ఈ పార్టీల హామీలతో రాయలసీమ ప్రజల కడుపు నిండదు. అందుకు చైతన్యవంతమైన పోరాటాలే పరిష్కారం.
 

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు /

వి. రాంభూపాల్‌