శూన్యమైన చూపుల్లోంచి ఉషోదయాన్ని
చూసినట్లుంటుంది నిజం చెప్పు
నా చూపుల వలయం చుట్టూ
పరిభ్రమిస్తూ పరిహసిస్తూ
దరహాసకాంతులను వెదజల్లుతున్న
అతినీలలోహితకిరణం నువ్వేకదూ!
ఏకాంత సమయంలో..
ఏ కాంతిపుంజం అక్కర్లేకుండా
మనోనేత్రంలో దాచిన నీ ముఖచిత్రాన్ని
స్మరిస్తూ తరిస్తున్నా.. దూరాలు దగ్గరై
పచ్చటి పూలవనం పరచుకున్న హృదయంలో
నువ్వుగాక ఇంకెవ్వరు పదిలమౌతారు
నిశీథి సమయాలన్నీ నీలాకాశం సాక్షిగా
పాణి గ్రహణమవ్వని హస్తాలను
పట్టుకుని మరీ మరీ స్పృశిస్తుంటే..
నువ్వు నేను ఒకే ఆకాశమయినట్లుంది
ఔన్లే చెరగని విభజన రేఖల్ని
ప్రేమించడం సాధ్యం కాదుకదా
చంద్రుడు వడగాలులు వీచినా
సూర్యుడు చిరుజల్లులు కురిపించినా
దృశ్యాదశ్య సంగ్రామం
మదితో నిత్యం..
అంతర్యుద్ధం చేస్తూనే వుంటుంది
నువ్వొక్కసారి తొలికిరణమై ప్రభవించు..
కెంగార మోహన్
9000730403