
నేరస్త జాతుల జాబితాలో చేర్చిన జాతులలో అత్యంత దీనమైన పరిస్థితి యానాదులది. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వుండే వీరి ఆవాసం శ్రీహరి కోట. పులికాట్ సరస్సులో చేపలు పట్టుకుని తృప్తిగా జీవించే వీరి ఆవాసం శ్రీహరి కోటను ఈస్ట్ ఇండియా కంపెనీ 1830లో స్వాధీనం చేసుకుని వారిని అక్కడి నుంచి తరిమి వేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈరోజుకీ నీది ఏ ఊరు అని అడిగితే నాది ఫలానా ఊరని స్పష్టంగా, ధైర్యంగా చెప్పలేని యానాది జాతి లోంచి ఒక 'వకీలమ్మ' గత శతాబ్దపు తొలినాళ్ళలోనే రావడం అబ్బురం అనిపిస్తుంది. ఆ వకీలమ్మ పేరు కత్తి చల్లమ్మ. యానాదుల బానిస సంకెళ్ళు తెంచడానికి కృషి చేస్తూ క్రిమినల్ ట్రైబ్స్ చట్టం-1871 రద్దు కోసం 1935 నుంచి పోరాటాలు చేసి కోర్టులో యానాదుల ప్రతినిధిగా హాజరై దుర్మార్గమైన ఆ చట్టాన్ని రద్దు చేసేవరకు ఆమె విశ్రమించలేదు.
ఆదివాసులను నేరస్త జాతులుగా పరిగణించే క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయించి వారిని సంస్కరించే ప్రయత్నాలు గత శతాబ్దపు మొదటి భాగంలోనే ప్రారంభమయ్యాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడైన వెన్నెలకంటి రాఘవయ్య యానాదుల సంస్కరణకు పూనుకుని క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయించి వారికి స్వేచ్ఛ కల్పించడం, వారిని షెడ్యూలు ట్రైబ్స్‌గా గుర్తించి ఇతర తెగలతో సమానంగా ప్రభుత్వం నుంచి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాయితీలు పొందే హక్కు కల్పించడానికి గొప్ప కృషి చేశారు. ఆయన కృషిలో కత్తి చల్లమ్మ కూడా భాగం కావడం విశేషం.
వెన్నెలకంటి రాఘవయ్య, ఆయన సహచరుడైన పట్టాభి సీతారామయ్య మద్రాసు హైకోర్టులో దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని యానాదుల తరఫున కేసు దాఖలు చేసి ప్లీడరుగా భాష్యం అయ్యంగార్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వలన యానాది జాతి అనుభవిస్తున్న కష్టాలను వివరించడానికి వారి ప్రతినిధిగా కత్తి చల్లమ్మ కోర్టుకు హాజరు కావాలని నిర్ణయించారు. యానాదులు ఇతరులు ఏది అడిగినా 'నాకు తెలవదు' అని తప్ప మరొకటి చెప్పడం చేతగాని వారు. అందుకే వారిని సాక్ష్యంగా పెట్టుకోవడం తెలివి తక్కువతనం అనే అభిప్రాయం బలంగా వున్నప్పుడు కత్తి చల్లమ్మ అనే యానాది స్త్రీ కోర్టులో తన జాతి ప్రతినిధిగా మాట్లాడడం అసాధారణం. ఆమె 1935-40 మధ్య కాలంలో ఈ కేసు విషయమై మద్రాసు హైకోర్టుకు అనేక పర్యాయాలు హాజరైంది. ఆమె మాట్లాడే తీరుకు కోర్టులో న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. ఆమె నాయకత్వంలో 1935లో నెల్లూరులో జరిగిన యానాది మహా గర్జన ఆనాటి మీడియాని ఆకర్షించింది. అప్పుడే ఆమె అందరి దృష్టిలో పడింది. సుమారు మూడు వందల మంది యానాదులు ఇందులో పాల్గొన్నారు. యెర్ర సుబ్బయ్య అనే రైతు ఉద్యమ నాయకుడు కూడా వారికి సహకరించాడు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేసి యానాదులను సభ్య సమాజంలో ఇతరులతోపాటు సమానంగా గుర్తించాలి, వారికి జీవనాధారం అయిన అటవీ ఉత్పత్తులు, చెరువులపై హక్కులు కల్పించాలి, వారికి వ్యవసాయ భూములు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలి అనే డిమాండ్లతో జరిగిన ఈ సభ చారిత్రాత్మకమైనది. ప్రభుత్వాధినేతలు యానాదుల పోరాట పటిమను గుర్తించారు. రాఘవయ్య ప్రారంభించిన ఆదిమ జాతుల సంక్షేమ సంఘం, యానాది సంక్షేమ సంఘాలలో చల్లమ్మ క్రియాశీలకంగా పాల్గొని వారి సమస్యలపై అనేక సభలలో ప్రసంగించి అధికారులతో చర్చించింది. జవహర్ లాల్ నెహ్రూ 1952లో మద్రాసును సందర్శించినప్పుడు వారి సమస్యలు, పోరాటాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని చివరకు క్రినినల్ ట్రైబ్స్ చట్టాన్ని 1952లో రద్దు చేయడం జరిగింది. దీనితో దేశవ్యాప్తంగా వున్న అనేక లక్షల మంది ఆదివాసులు నేరస్తులు అనే ముద్ర నుంచి బైటపడి సమాజంలో ఇతరులతోపాటు సమానమైన సభ్యులుగా గుర్తింపు పొందారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత యానాదులు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు వెదుక్కుంటూ రిక్షా పుల్లర్లుగా మారారు. వారి సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలకు కూడా కత్తి చెల్లమ్మ మద్దతు పలికింది. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన మద్యపాన నిషేధ ఉద్యమంలో కత్తి చల్లమ్మ క్రియాశీలకంగా పాల్గొంది. 1942లో ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొంది. అయితే వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారందరి పేర్లు పల్లెపాడు గాంధీ ఆశ్రమంలో రాసిపెట్టి ఆమె పేరు రాయకపోవడం గమనార్హం.
కత్తి చల్లమ్మకు బిడ్డలు లేరు. ఆమె జనం కోసం బతికింది. ఆమె సేవలను, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించి గౌరవించే యానాదులు నెల్లూరు పట్టణం మినీ బైపాస్ దగ్గర వుండే తమ కాలనీకి 'కత్తి చల్లమ్మ సంఘం' అని పేరు పెట్టుకున్నారు. తర్వాత యానాది మహిళ పేరున కాలనీ వుండడమేమిటని పేరు మార్చారు. ఇప్పుడు కాలనీ పేరు 'దొర తోపు సంఘం' అని మార్చినప్పటికీ ఆమె గురించి తెలిసిన తరం యానాదులకు 'కత్తి చల్లమ్మ సంఘం' అనే పేరే గుర్తు. చరిత్రలో మరుగున పడిన అరుదైన 'వకీలమ్మ' కత్తి చల్లమ్మ జీవితం, ఆమె చేసిన పోరాటాలు ఆదివాసీ చరిత్రకు నాందీ వాచకం కావాలి. చీకటిలో కుమిలిపోయిన జీవితాలలో వెలుతురు నింపిన మిణుగురు మన చల్లమ్మ.
చల్లపల్లి స్వరూపరాణి