
ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. ఈ చిత్రం పలుసార్లు వాయిదాపడుతూ వస్తూ.. ఎట్టకేలకు ఉగాది పండుగరోజున (మార్చి 22 బుదవారం) థియేటర్‌లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకుందమా..!
కథ
రంగస్థల కళాకారుడు రాఘవరావు (ప్రకాశ్‌రాజ్) తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించాడు. కళాకారుడిగా ఆయన ప్రతిభను మెచ్చి 'రంగమార్తాండ' అనే బిరుదును ప్రదానం చేస్తారు. అయితే ఆయన ఓ సత్కార సభలోనే తాను ఇక నటించనని చెప్పి అందరినీ షాక్‌కి గురిచేస్తారు. తన నటనకు రిటైర్మెంట్ చెప్పిన తర్వాత.. బాధ్యతలన్నీ తీర్చుకున్నాక భార్య (రామకృష్ణ)తో కలిసి శేష జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపాలనుకుంటారు. అయితే అసలు సమస్యలన్నీ అప్పుడే మొదలవుతాయి. నాటకరంగంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రాఘవరావు.. రిటైర్మెంట్ తర్వాత జీవితమనే నాటకంలో నటించాల్సి వచ్చినప్పుడు ఎలా నటించాడు? చివరికి ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? ఇందులో బ్రహ్మానందం పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
డైరెక్టర్ కృష్ణవంశీ మరాఠీ చిత్రమైన 'నటసామ్రాట్' మూవీకి రీమేక్‌గా తెలుగులో 'రంగమార్తాండ'ని తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినా.. నటీనటుల ఎంపికతో కృష్ణవంశీ నూరు మార్కులు కొట్టేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్ అంతా.. రాఘవరావు నాటకాలు, కుటుంబం, పిల్లల పాత్రలతో కథ నిదానంగా సాగుతుంది. సత్కార సభలో రాఘవరావు తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో కథనంలో వేగం పెరుగుతుంది. అప్పటివరకు ఉన్న ఇంటిని కోడలు (అనసూయ) పేరిట రాసి.. కుమార్తె శ్రీ (శివాత్మిక రాజశేఖర్)కి తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిపించి.. బాధ్యతల్ని తీర్చుకుని.. నటనకు స్వస్తి పలికి.. శేష జీవితం హాయిగా గడపాలన్న రాఘవరావుకి తర్వాత ఏం జరగుతుందనేది ప్రేక్షకులు ఊహించిందే. అయితే ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ కంటతడిపెట్టిస్తుంది. ఇక సెకండాఫ్‌లో ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటుంది. రాఘవరావు దంపతులు ఇంటిని విడిచి కుమార్తె శ్రీ దగ్గరికి వెళ్లి అవమానపడడం, స్నేహితుడు చక్రి (బ్రహ్మానందం)కి రాఘవరావుకి మధ్య వచ్చే సీన్స్ గుండెను బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకులు ఊహించేకానీ.. డైరెక్టర్ కథను ముగించినతీరు నేటి తరానికి సందేశాన్నిస్తుంది. ఓవరాల్‌గా ఈ చిత్రం భార్యాభర్తలు మధ్య ప్రేమానుబంధం, చివరి వరకూ ఉండే స్నేహబంధం, తల్లిదండ్రులైన తర్వాత పెద్దల ఆలోచనలు, పిల్లలుగా ఉన్నప్పుడు వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయనేది ఈ చిత్రం మరోసారి కళ్లకు కడుతుంది. ప్రకాశ్‌రాజ్ తన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో మరోసారి చూడవచ్చు. రమ్యకృష్ణ సంభాషణలు పెద్దగా లేకపోయినా.. కళ్లతోనే నటించి మెప్పించారు. ఈ సినిమాలో ప్రధానంగా హాస్యనటుడు బ్రహ్మానందం నటనను చూసి..ప్రేక్షకులు కొన్నిరోజులపాటు గుర్తుంచుకుంటారు. ఇప్పటివరకు ఆయనను తెరపై చూసి నవ్వుకున్నవారు.. ఈ చిత్రంలో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోతారు. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది. డైరెక్టర్ కృష్ణవంశీ ఆయన టాలెంట్‌ని మరోసారి ఈ చిత్రంతో నిరూపించుకున్నారు.
ఎవరెలా చేశారంటే..
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ నటన అద్భుతం. శివాత్మిక, అనసూయ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం నటన హైలెట్‌గా ఉంది. రాహుల్ సింప్లిగంజ్, ఆదర్శ్, అలీరోజాలు పాత్రల పరిధిమేరకు నటించారు. కథలో భాగమవుతూ సాగిన ఇళయరాజా సంగీతం బాగుంది. ఆకెళ్ల శివప్రసాద్ మాటలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.