రాము ఇంట్లో ఒక పెంపుడు చిలుక ఉంది. అదంటే ఇంటిల్లిపాదికీ ఎంతో ఇష్టం. రాము పేరును కూడా కలిపి దానిని రామ చిలుక అనే పిలుచుకుంటారు రామూ వాళ్లు. రామ చిలుక రాముతో ఇలా అంది.. 'చూడు రాము, నాన్న గారు పిడుగుపాటున ఈ లోకాన్ని వీడడం నాకూ చాలా బాధగా ఉంది. అమ్మకు అన్నింటా సాయంగా ఉండటం మన విధి' అని కన్నీళ్లు పెట్టుకుంది. రాము ప్రేమగా దాని కళ్ళు తుడిచి, తల నిమిరాడు. అమ్మ తనకోసం పెట్టిన మొలకెత్తిన పెసలు కాస్తా దాని ముందర పోశాడు. రాము, వాళ్ళ అమ్మ జీవితాంతం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఆ రామచిలుక. పంజరంలోంచి వెళ్ళమని రాము సైగ చేయగానే రరుమని ఎగిరిపోతుంది. మళ్లీ రెండు మూడు గంటల్లోనే తిరిగి రాము చెంతకు చేరుతుంది. అదే దాని దినచర్య. అసలు పంజరం అన్న మాటేగానీ దానికి తలుపే ఉండదు. దాని స్వేచ్ఛకు భంగం కలిగించడం రాముకు ఇష్టం ఉండదు.
అలా రోజులు గడుస్తుండగా ఆ రాజ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయన్న మాటే ప్రతివారూ మాట్లాడుకోసాగారు. ఆ మాటలు రాము, చిలుక వినడం జరుగుతుంది. అది అలా ఉండగా, ఇక్కడ రాము వాళ్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దిగజారసాగాయి. తమను తాము పోషించుకోవడానికి రామూ వాళ్ళ అమ్మ పొరుగింటి సైనికదళ అధికారి ఇంట్లో పనిచేస్తుంది. అమ్మ పడుతున్న కష్టాల్ని రాము గమనించి బాధపడ్డాడు. రాము, చిలుక ఒకరికొకరు సాంత్వన కూర్చుకున్నారు.
ఓ రోజు సైనికులు దొంగల్ని ఎలా పట్టుకోవాలని మాట్లాడుతుండగా చిలుక విన్నది. చిలుకకు ఓ ఉపాయం తట్టి, అది రాము చెవిలో చెప్పింది. పథకంలో భాగంగా, చిలుక కాలికి చిన్న తాడుతో ఒక గంట కట్టాడు రాము. దొంగలు ఆ ఊళ్ళోకి రావాలంటే ఒకేదారి ఉంది.. అదే అరణ్యపు రహదారి. అక్కడ సత్రములో రాము, ఆ ప్రక్కనే సైనికులు కాపలాగా వున్నారు. ఎక్కువగా దొంగతనాలు అమావాస్య రోజుల్లోనే జరుగుతాయి అని అమ్మ చెప్పినట్లు గుర్తుంది రాముకి. ఆ రోజే అమావాస్య. రాము అప్రమత్తంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు.
దొంగల్ని పట్టుకోవాలని ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపిన సైనికులు ఆ రోజు కూడా దొంగలు రాకపోవచ్చనే ఓ నైరాశ్యంతో గాఢనిద్రలో మునిగారు. కానీ రాము అలా కాక చిలుక సంజ్ఞ కోసమే ఎదురు చూడసాగాడు. నలుగురు దొంగలు ఆ ఊళ్ళోకి రావడం మొదలుపెట్టారు. అది గ్రహించిన చిలుక దొంగలు వేపచెట్టు దగ్గరకు రాగానే, ముందుగా అనుకున్నట్లు రాము తన కాలికి కట్టిన గంట మోగించింది. అంతే, వారు ఆ చెట్టు కిందికి రాగానే రాము కిటికీలోంచి చెట్టు కొమ్మల్లో ఏర్పాటు చేసిన కారాన్ని దారం సాయంతో విదిల్చాడు. కారం అంతా వాళ్ళ మీద పడి 'అమ్మా...అబ్బా..' అని అరుస్తూ కళ్ళు నులుముకోసాగారు. ఈ చప్పుడుకి సైనికులు లేచి, దొంగల్ని పట్టుకున్నారు.
రాము చూపిన తెగువ, తెలివికి మెచ్చిన రాజావారు రామూని చదివించి వారి ఆస్థానంలోనే పర్యవేక్షకుడి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. రాజావారు బహుమతిగా కొంత సొమ్ము రాముకు ఇప్పించారు. చిలుక సాయంతో రాము కుటుంబం పేదరికం నుంచి బయట పడింది. మంచి మనసుతో మంచిపని చేసిన వారికి ఫలితం గొప్పగా ఉంటుంది.
డా. చిట్యాల రవీందర్ 77988 91795