వాషింగ్టన్‌లో వైట్ హౌస్ ఎదుట భారీ ప్రదర్శన
జకార్తాలో పోటెత్తిన జన సంద్రం
వాషింగ్టన్/ జకార్తా : గాజాలో గత నెల రోజులుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని కోరుతూ శని, ఆది వారాల్లో భారీ ర్యాలీలు ప్రపంచవ్యాపితంగా జరిగాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైట్ హౌస్ ఎదుట శనివారం వేలాది మందితో పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయిల్ అనాగరిక దాడుల్లో గత 30 రోజుల్లో పది వేల మంది దాకా చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలే అధికం. ఇజ్రాయిల్ ఊచకోత యథేచ్ఛగా సాగుతున్నా దీనిని అపేందుకు అమెరికా ససేమిరా అంటోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాలో కనివిని ఎరుగని రీతిలో సాగుతున్న మారణహౌమానికి బైడెనే కారణమని నిందించారు. 'బైడెన్ బైడెన్ యు కాంట్ హైడ్' (బైడెన్ బైడెన్ నువ్వు దాక్కోలేవు) అంటూ వారు బిగ్గరగా నినదించారు. గాజాలో ఇజ్రాయిల్ అదే పనిగా సాగిస్తున్న బాంబు దాడులు జాతి ప్రక్షాళనకు దారితీసే ప్రమాదముందని ఐరాస నిపుణులు హెచ్చరించారు. ఇండొనేషియా, పాకిస్తాన్, భారత్‌తో తదితర దేశాల్లోనూ పాలస్తీనాకు సంఘీభావంగా పీపుల్స్ మార్చ్‌లు జరిగాయి.జకార్తాలో జాతీయ స్మృతి చిహ్నం వద్ద బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు.