Jun 30,2023 07:54
  • తమిళనాడు మంత్రి డిస్మిస్‌
  • విమర్శల వెల్లువతో వెనక్కి
  • 5 గంటలకు పైగా హైడ్రామా

చెన్నై : చెన్నై : అసాధారణమైన రీతిలో తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని డిస్మిస్‌ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులిచ్చిన ఆ రాష్ట్ర గవర్నరు ఆర్‌ఎన్‌ రవి విమర్శలు వెల్లువెత్తడంతో అర్ధరాత్రి సమయంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మంత్రిని తొలగిస్తూ గవర్నరు తీసుకున్న చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని పలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణుల నుంచి విమర్శలొచ్చాయి. గవర్నరు నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అర్ధరాత్రి వేళ గవర్నరు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సందేశం చేరవేశారు. అటార్నీ జనరల్‌ను సంప్రదిస్తున్నందున తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ దీనిని నిలిపివేస్తున్నట్లు గవర్నరు ఆ సందేశంలో పేర్కొన్నారు. అంతకు ముందు ఈ అంశంపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీని ఒక్క కలం పోటుతో గవర్నర్‌ డిస్మిస్‌ చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు.
           కరడుగట్టిన ఆరెస్సెస్‌వాది, వివాదాస్పదుడైన గవర్నరు ఆర్‌ ఎన్‌ రవి వ్యవహార తీరు మొదటి నుంచి విమర్శలకు గురౌతూనేవుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టి కోర్టులతో చీవాట్లు తిన్నా కూడా ఆయన ధోరణిలో మార్పులేదు. ఇంతకుముందు కేరళలో కూడా గవర్నరు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఇటువంటి పిచ్చి పనికే యత్నించగా అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దీటుగా జవాబిచ్చింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడమే పనిగా పెట్టుకున్న మోడీ సర్కార్‌.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ను ఉసిగొలిపి సెంథిల్‌ బాలాజీపై మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఎవరినీ తొలగించే అధికారం గవర్నరుకు లేదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పిడిటి ఆచారి స్పష్టం చేశారు. గవర్నరు ముఖ్యమంత్రిని మాత్రమే నియమిస్తారు. మంత్రులను ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నరు నియమిస్తారు. అలాంటప్పుడు మంత్రులను గవర్నరు తొలగించాలంటే ముఖ్యమంత్రి సిఫారసు తప్పనిసరి అని ఆయన వివరించారు.