శ్రీహర్ష ఐదో తరగతి పాసై, ఆరో తరగతిలో ప్రవేశించాడు. శ్రీహర్షకు ఇతరులను వెక్కిరించడమంటే చాలా సరదా. కాస్త పొట్టిగా ఉంటే 'బుడంకాయ' అని, పొడుగ్గా ఉంటే 'పొట్లకాయ' అని, బొద్దుగా ఉంటే 'గుమ్మడికాయ' అని, సన్నగా ఉంటే 'మునక్కాయ ' అని రకరకాల పేర్లు పెట్టి ఏడిపిస్తుంటాడు.
అయితే, ఆరో తరగతిలో కొత్తగా ఒక అబ్బాయి చేరాడు. పేరు శరత్. లంచ్ సమయంలో శ్రీహర్ష, శరత్ దగ్గరకు వెళ్లాడు. అతడి వెంటే ఉదరు, తేజ కూడా వెళ్లారు. శ్రీహర్ష, శరత్‌ని ఇంతకుముందు ఎక్కడ చదివావంటూ వివరాలడిగాడు.
'మా ఊరు మునిపల్లె అక్కడే చదివాను. ఈ ఊళ్లో మామయ్య గారింట్లో ఉంటున్నా' అని చెప్పాడు శరత్.
శ్రీహర్ష తమ గురించి గొప్పగా చెపుతూ, 'మా నాన్న సాఫ్ట్‌వేర్, ఉదరు వాళ్ల నాన్న బ్యాంక్ ఆఫీసర్, తేజ వాళ్ల నాన్న ఎల్ ఐ సి ఆఫీసర్.. మరి మీ నాన్న?' ప్రశ్నించాడు శరత్‌ను.
'మా నాన్నగారు రైతు. సొంతంగా వ్యవసాయం చేస్తారు' చెప్పాడు శరత్.
వెంటనే శ్రీహర్ష ' రైతు.. పల్లెటూరి బైతు' అంటూ హేళన చేశాడు.
శరత్‌కు బాధ వేసింది. కోపం కూడా వచ్చింది. బదులిద్దామంటే కొత్త కావడంతో భయం. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ సిటీలో వాళ్లు ఇంతేనేమో అనుకుని చూపు తిప్పుకున్నాడు.
శ్రీహర్ష బందం ఘనకార్యం చేసినట్లు పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
'అరే వేణూ! ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రా రా.. కూర్చో' అంటూ నాన్న ఎవరినో ఆహ్వానించడం విని, శ్రీహర్ష ముందుగదిలోకి వచ్చాడు. చూస్తే నాన్న వయసే ఉన్న వ్యక్తి, ఆయన పక్కనే శరత్. శ్రీహర్ష ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
శరత్ కూడా శ్రీహర్షను చూసి అంతే ఆశ్చర్యపోయాడు.
'మీ అబ్బాయా..? ఇలారా.. నీ పేరేంటి?' శ్రీహర్ష తండ్రి ఆప్యాయంగా శరత్‌ను పలకరించాడు.
శరత్ బదులిస్తుంటే శ్రీహర్ష చూస్తుండిపోయాడు.
శరత్ తండ్రి అందుకుని, 'వీడిని ఈ ఊళ్లోనే మోడర్న్ కాన్వెంట్‌లో చేర్చాను' చెప్పాడు.
అది విని శ్రీహర్ష తండ్రి, 'అరే.. మావాడూ అదే స్కూల్. పైగా ఇద్దరూ ఒకే తరగతి' అని, 'హర్షా! అంకుల్‌కు నమస్తే చెప్పు. విన్నావుగా శరత్ మీ స్కూలేనట. ఇద్దరూ స్నేహంగా ఉండి, బాగా చదువుకోండి!' అన్నాడు.
శ్రీహర్ష, శరత్ నాన్నకు నమస్తే చెపుతూ.. తను పల్లెటూరి బైతులా ఉంటాడనుకున్న మనిషి, తన తండ్రి మాదిరే ప్యాంట్, షర్ట్ ధరించడం చూసి ఆశ్చర్యపోయాడు. అది గమనించి. 'ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నావు?' అడిగాడు శరత్ తండ్రి.
'మీరు రైతు అని చెప్పాడు శరత్. కానీ మీరు ప్యాంట్, షర్ట్..' మధ్యలోనే ఆగాడు హర్ష.
'ఓ.. అదా నీ సందేహం.. పనిచేసే సమయంలో మనకు సౌకర్యవంతంగా వుండే దుస్తులు, అలాగే సందర్భాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి రకరకాల దుస్తులు ధరిస్తాం. రైతు ప్యాంట్, షర్ట్ ధరించకూడదని ఏముంది? అలాగే ఆఫీసర్ పంచె కట్టుకోకూడదని ఏమీ లేదు కదా?!' నవ్వుతూ చెప్పాడు శరత్ తండ్రి.
అంకుల్ చెప్పింది నిజమే అనుకున్నాడు శ్రీహర్ష.
'వేణూ! నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా వ్యవసాయం చేపట్టి మంచిపని చేశావు. పచ్చని పల్లెలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో, సొంత పొలాన్ని సాగు చేసుకుంటూ తిండిగింజలు పండించడం కన్నా గొప్ప ఉద్యోగం ఏం ఉంటుంది? నన్నడిగితే రైతే రాజు. నేను కూడా ఎప్పుడు ఊడుతుందో తెలియని ఈ ఉద్యోగం మానేసి, కొద్దిగా పొలం కొనుక్కుని వ్యవసాయం చేద్దామా అని ఆలోచిస్తున్నా ..' ఇంకా ఏదో చెపుతున్నా శ్రీహర్షకు మరేమీ వినపడలేదు.
'ఏమిటీ, అంకుల్ పోస్ట్ గ్రాడ్యుయేటా? రైతు అనగానే తనెంత తేలికగా మాట్లాడాడు. నాన్న చెప్పింది నిజమే. మనిషి బతకడానికి ముఖ్యమైంది ఆహారమే కదా! నాన్న చెప్పినట్లు రైతు అంటే రాజే'.
ఆ ఆలోచన రావడంతోనే శరత్ వైపు తిరిగి 'రా శరత్! మా తోటలో ఆడుకుందాం' అన్నాడు.
'అలాగే' అన్నాడు శరత్ సంతోషంగా.
అప్పుడే కాఫీ, బిస్కెట్లు పట్టుకు వచ్చిన శ్రీహర్ష అమ్మ. 'బిస్కెట్లు తీసుకువెళ్లండి!' అంది నవ్వుతూ.
ఇద్దరూ బిస్కెట్లు అందుకుని, హుషారుగా ముందుకు నడిచారు.
జె శ్యామల
99896 01113