- ఉత్తరం నుంచి వెనక్కి రుతుపవనాలు
- రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న నైరుతి
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఉత్తరం నుంచి రుతుపవనాలు తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వర్షాలకు ఢోకా లేదని, ఎక్కడికక్కడ ట్రఫ్ (వర్ష ద్రోణి)లు ఏర్పడుతున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో పలుచోట్ల అసమతుల్య స్థితులు నెలకొన్నాయి. ఆగస్టు వచ్చినా ఉక్కబోత వీడలేదు. రుతుపవనాలు ఒక్కసారిగా ఉత్తరం వైపు అంటే హిమాలయ పర్వత శ్రేణులవైపు వెళ్లిపోవడమే దీనికి కారణం. తాజాగా ఉత్తరం నుంచి ఈ రుతుపవనాలు తిరుగుముఖం పట్టడం ఉపశమనం కలిగించే విషయం. ఈ నెల 23న ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణితో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఊహించింది. కానీ, ఇది 25 నాటికి బలహీనపడింది. తాజాగా ఎపి, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్రవారం వర్షం కురిసింది. రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగడం, ఉత్తర బంగ్లాదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, తూర్పు బంగాళాఖాతం వైపు ఒక ద్రోణి ఏర్పడడం వంటి కారణాలతో ఇక రాష్ట్రంలో వర్షాలకు లోటు ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగ్లాదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ఒకటి సముద్రమట్టానికి 3.1 నుంచి 5.1 కిలోమీటర్ల ఎత్తులో శుక్రవారం ఏర్పడింది. ఇది ఆ ప్రాంతమంతా ఆవరించి ఉండడంతో దీని ప్రభావం తుపాను మాదిరిగా ఉండొచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల కొద్దిరోజుల వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.