Sep 30,2022 09:42
  • మూడేళ్లయినా డిపిఆర్‌ దశలోనే
  • ఎప్పటికి పూర్తయేదీ చెప్పని కేంద్రం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తి అయినప్పటికీ విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు పూర్తి కాలేదు. ఇంకా డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) పరిశీలన దశలోనే జోన్‌ పనులు ఉన్నాయి. దీనిబట్టి చూస్తే విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ పనులు నత్తనడకగా జరుగుతున్నాయని స్పష్టం అవుతుంది. విభజన హామీలపై నోడల్‌ ఏజెన్సీ కేంద్ర మంత్రిత్వశాఖ ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం తరువాత, రైల్వే జోన్‌పై మళ్లీ చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని షెడ్యూల్‌ 13 (మౌలిక సదుపాయాలు కల్పన)లో 8 అంశంగా విశాఖ రైల్వేజోన్‌ను పేర్కొన్నారు. అయితే ఐదేళ్లయినా రైల్వేజోన్‌ ప్రకటించలేదు. ఎపి ప్రజలు, రాజకీయ పార్టీల ఆందోళనతో ఎట్టకేలకు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 27న నాటి రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సౌత్‌ కోస్ట్‌ రైల్వే (వైజాగ్‌) జోన్‌ ప్రకటించారు. ప్రకటించి మూడున్నరేళ్లు కావస్తున్నా జోన్‌ ఏర్పాటు మాత్రం పూర్తి కాలేదు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో జోన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే వాల్తేరు డివిజన్‌ను విభజించించి, అందులో కొంతభాగం విజయవాడలో కలుపుతామని తెలిపారు. వాల్తేరు డివిజన్‌ మిగతా భాగంతో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే ఎపి ప్రజలు, రాజకీయ పార్టీలు వాల్తేరు డివిజన్‌ను విభజించొద్దని, మొత్తాన్ని విశాఖ జోన్‌లోనే కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎపి ప్రజల డిమాండ్‌ను పక్కనపెట్టి, లాభాదాయకమైన వాల్తేరు డివిజన్‌ను విభజనకే మొగ్గు చూపుతోంది. రెండు రోజుల క్రితం ఈస్టు కోస్టు రైల్వే ఇచ్చిన ప్రకటనలో వాల్తేరు డివిజన్‌ విభజనను మళ్లీ ప్రస్తావించింది.
 

                                                                         పరిశీలనలో డిపిఆర్‌

విశాఖ రైల్వేజోన్‌కు డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) తయారు చేసి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పించారు. అయితే దాన్ని ఆమోదించారా? లేదా? అనేది కేంద్రం స్పష్టం చేయటం లేదు. 2020 మార్చి 18న లోక్‌సభలో వైసిపి ఎంపి పి.మిథున్‌ రెడ్డి, టిడిపి ఎంపి కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఒఎస్‌డి డిపిఆర్‌ సమర్పించారని, అది పరిశీలనలో ఉందని తెలిపారు. మళ్లీ 2021 మార్చి 10న లోక్‌సభలో టిడిపి ఎంపి కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నుంచి ఇదే సమాధానం వచ్చింది. డిపిఆర్‌ అందిందని సమాధానం వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా అడుగు ముందుకు పడలేదు.
 

                                                        రూ.40 లక్షల బడ్జెట్‌తో జోన్‌ ఏర్పాటు సాధ్యమా ?

రైల్వేజోన్‌ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ రూ.40 లక్షల బడ్జెట్‌తో రైల్వేజోన్‌ ఏర్పాటు సాధ్యమా? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో రైల్వే జోన్‌కు రూ.170 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2021-22 బడ్జెట్‌లో కేటాయింపులు ఏమీ లేవు. కానీ ఆ ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేశారు. 2022-23 ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు. రైల్వేజోన్‌ ఏర్పాటు జాప్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బడ్జెట్‌ కేటాయింపులే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో జూలై 25న లోక్‌సభలో ప్రవేశపెట్టిన హామీల కమిటీ రిపోర్టులో కూడా విశాఖ రైల్వేజోన్‌ ఎప్పటికి పూర్తి చేస్తామనేది చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ మోడీ సర్కార్‌ చిత్తశుద్ధి !