Oct 18,2022 07:19

ర్‌టిఐ చట్టానికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌ వుండడంతో ఈ చట్ట సమర్ధత లేదా ప్రభావం దెబ్బతినే అవకాశం వుంది. అయితే దేశవ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయకపోవడంవల్లే ఈ రీతిలో కేసులు పోగుబడిపోతున్నాయని సిటిజన్స్‌ గ్రూపు విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది.
        భారతదేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ)-2005 అమలులోకి వచ్చి నేటితో 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 'సతార్క్‌ నాగరిక్‌ సంఘటన్‌' అనే సిటిజన్స్‌ గ్రూపు అక్టోబరు 11న ఒక నివేదికను వెలువరించింది. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీ తనం పెంచడం కోసం కృషి చేస్తున్న ఈ గ్రూపు కీలకమైన నిర్ధారణలతో కూడిన నివేదిక ''భారతదేశంలో సమాచార కమిషన్‌ పనితీరుపై రిపోర్ట్‌ కార్డ్‌, 2021-22'' ను ప్రచురించింది.
దేశంలోని 29 రాష్ట్రాల సమాచార కమిషన్ల పనితీరును ఈ నివేదిక పరిశీలించింది. అప్పీళ్ళ సంఖ్య, నమోదైన ఫిర్యాదులు, వాటిల్లో పరిష్కరించినవి ఎన్ని? పెండింగ్‌ కేసులెన్ని? ప్రతి ఒక్క కమిషన్‌లో దాఖలైన అప్పీల్‌ లేదా ఫిర్యాదు పరిష్కారానికి వేచి వుండాల్సిన అంచనా కాలపరిమితి ఎంత? కమిషన్‌ ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడింది? కమిషన్‌ పనితీరులో పారదర్శకత ఏవిధంగా వుంది? వంటి అంశాలను ఈ నివేదిక పరిశీలించింది. జార్ఖండ్‌, త్రిపురల్లో సమాచార కమిషన్లు పూర్తిగా పని చేయడం లేదని ఆ నివేదికలోని కీలక నిర్ధారణలు పేర్కొన్నాయి. ప్రస్తుతం, ఈ రెండు సమాచార కమిషన్లలో చీఫ్‌ సమాచార కమిషనర్‌తో సహా సమాచార కమిషనర్ల పోస్టులన్నీ ఖాళీగానే వున్నాయి. ప్రస్తుతమున్న వారు పదవీ విరమణ చేస్తే ఇక వారి స్థానంలో కొత్త కమిషనర్లను నియమించకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా వుంది. ఈ రెండింటితో పాటు మణిపూర్‌, తెలంగా ణ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్లు చీఫ్‌ సమాచార కమిషనర్‌ లేకుండానే పనిచేస్తున్నాయి.
          చీఫ్‌ సమాచార కమిషనర్‌ లేకపోవడం వల్ల ఆర్‌టిఐ చట్టం సమర్ధవంతమైన పనితీరుకు సంబంధించి తీవ్రమైన పర్యవసానాలు నెలకొన్నాయి. ఆర్‌టిఐ చట్టం ప్రకారం... పర్యవేక్షణ, నిర్వహణ, సమాచార కమిషన్‌ వ్యవహారాల దిశా నిర్దేశంతో సహా అత్యంత కీలకమైన పాత్రను ముఖ్య సమాచార కమిషనర్‌ పోషించాల్సి వుంది. మహారాష్ట్ర, బీహార్‌, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటకల్లో రాష్ట్ర సమాచార కమిషన్లు తగ్గిన సామర్ధ్యంతోనే పనిచేస్తున్నాయి. ఇకపోతే, అప్పీళ్ళు/ఫిర్యాదులు భారీగా పెండింగ్‌లో వున్నప్పటికీ కేంద్ర సమాచార కమిషన్‌ (సిఐసి)లో కమిషనర్ల పోస్టులు మూడు ఖాళీగానే వుంటున్నాయి.                                                              

                                                                  బ్యాక్‌లాగ్‌ రేటు ఆందోళనకరం

పైగా 2021 జులై 1 నుండి 2022 జూన్‌ 30 మధ్య 25 రాష్ట్రాల సమాచార కమిషన్ల దగ్గర మొత్తంగా 2,12,443 అప్పీళ్లు, ఫిర్యాదులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంటోంది. ఈ సమయంలో 27 కమిషన్లు 2,27,950 కేసులను పరిష్కరించాయి. ఇందుకు సంబంధించిన సమాచారం అందుబాటులో వుండవచ్చు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి, 26 సమాచార కమిషన్ల దగ్గర 3,14,323 అప్పీళ్ళు, ఫిర్యాదులు పెండింగ్‌లో వున్నాయి. మహారాష్ట్రలో, ఆందోళనకర రీతిలో 99,772 అప్పీళ్ళు, ఫిర్యాదులు పెండింగ్‌లో వున్నాయి.
          ఆర్‌టిఐ చట్టం కింద అవసరమైన సమాచారాన్ని తమిళనాడు రాష్ట్ర కమిషన్‌ ఇవ్వడం లేదు. అసెంబ్లీ ఆమోద ముద్ర లేనిదే సమాచారాన్ని అందచేయలేమని చెబుతోంది. కేంద్ర సమాచార కమిషన్‌ (సిఐసి)లో ఒక అప్పీల్‌ లేదా ఫిర్యాదు పరిష్కారానికి 11 మాసాల సమయం పడుతుందని వెల్లడైంది. అప్పీళ్ళు, ఫిర్యాదుల పెండింగ్‌ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. 2019లో వేసిన అంచనా ప్రకారం, 2019 మార్చి 31 నాటికి మొత్తంగా 26 రాష్ట్ర సమాచార కమిషన్ల దగ్గర 2,18,347 అప్పీళ్ళు, ఫిర్యాదులు పెండింగ్‌లో వున్నాయి. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఈ సంఖ్య 2,86,325కి పెరిగింది. ప్రతి కమిషన్‌లో నెలకొన్న పెండింగ్‌ కేసులు, సగటు నెలవారీ కేసుల పరిష్కారం రేటు ఆధారంగా ఒక అప్పీల్‌ లేదా ఫిర్యాదును పరిష్కరించడానికి పట్టే సమయాన్ని నివేదిక లెక్కించింది. దాని ప్రకారం చూసినట్లైతే, ఒక కేసును పరిష్కరించడానికి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌కు దాదాపు 24 ఏళ్ళ మూడు మాసాలు పడుతుందని అంచనా వేయబడింది. అందువల్ల, ప్రస్తుత కేసుల పరిష్కార రేటు ప్రకారం, 2022 జులై 1న ఫిర్యాదు దాఖలైతే 2046లో పరిష్కారమవుతుందని అంచనా. అలాగే, ఒడిషా, మహారాష్ట్రల్లో, ఫిర్యాదుల పరిష్కార సమయం ఐదేళ్ళకు పైనే వుంది. బీహార్‌లో ఈ సమయం రెండేళ్ళకు పైనే వుంది. మొత్తమ్మీద, ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి 12 కమిషన్లకు ఏడాది, అంతకుమించిన సమయమే పడుతోంది. కేసుల పరిష్కారంలో సుదీర్ఘమైన జాప్యాలకు ప్రధానంగా రెండు కారణాలు వున్నాయి. అవి ఒకటి: కమిషన్లలో ఖాళీలు, రెండు: కమిషనర్లు ఫిర్యాదులను పరిష్కరించే రేటు అత్యంత నిదానంగా వుండడం.
 

                                                                  పెనాల్టీలు విధించడం లేదు

సమాచార కమిషన్లు విధించే పెనాల్టీలను విశ్లేషించినట్లైతే, పెనాల్టీలు విధించేందుకు అవకాశం వున్న కేసుల్లో కూడా 95 శాతం కేసుల్లో వారు పెనాల్టీలు విధించడం లేదు. ఆర్‌టిఐ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ప్రజా సమాచార కమిషనర్లు (పిఐఓలు)ను తప్పుదారి పట్టించడంపై రూ.25 వేల వరకు పెనాల్టీలను విధించడానికి ఆర్‌టిఐ చట్టం కమిషనర్లకు అధికారమిచ్చింది. ఈ చట్టానికి మరింత పదును పెట్టేలా అధికారాలను ఇవ్వడానికి, చట్టాన్ని ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా పిఐఓలను నిలువరించేందుకు అత్యంత కీలకమైన నిబనంధనల్లో ఒకటిగా పెనాల్టీ క్లాజు వుంది.
           ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌ అధిక సంఖ్యలో పెనాల్టీలు విధించినప్పటికీ, వాటికి సంబంధించి ఎలాంటి నివేదికను నిర్వహించలేదని అధ్యయనంలో వెల్లడైంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆర్‌టిఐ చట్టం అమలుపై 20 కమిషన్లు తమ వార్షిక నివేదికలను ప్రచురించలేదు. చట్ట నిబంధనల అమలుపై తప్పనిసరిగా నివేదికను రూపొందించాల్సిందిగా ప్రతి ఒక్క కమిషన్‌ను ఆర్‌టిఐ చట్టంలోని 25వ సెక్షన్‌ కోరుతోంది. ప్రతి ఏటా ఈ నివేదికను సిద్ధం చేయాలి. పార్లమెంట్‌ లేదా రాష్ట్ర అసెంబ్లీ ముందు దీన్ని వుంచాల్సి వుంటుంది.
          కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మిజోరాం, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లు 2021 సంవత్సరానికి తమ వార్షిక నివేదికలు ప్రచురించాయి. వారి అధికార వెబ్‌సైట్‌ల్లో వాటిని అందుబాటులో వుంచాయి. 2017లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆయా రాష్ట్రాల సమాచార కమిషన్లు ఏర్పడినప్పటి నుండి ఎ.పి, తెలంగాణ రాష్ట్రాల కమిషన్లు తమ వార్షిక నివేదికలను ప్రచురించలేదు.
 

- గుర్‌ సిమ్రాన్‌కౌర్‌ బక్షి