Sep 02,2023 16:53

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : విధుల్లోనే ఓ ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన అన్నమయ్యజిల్లా, పీలేరు డిపోలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసముంటున్న వి.రాజ్‌ గోపాల్‌(62) ఆర్‌టిసి డ్రైవర్‌గా పని చేస్తూన్నాడు. ఏప్పటిలానే శనివారం పీలేరు - సుండుపల్లి ఆర్టీసి బస్‌ సర్వీసుకు డ్రైవరుగా విధులకు హాజరయ్యాడు. బస్సు సుండుపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో కెవి పల్లి మండలం, గర్నిమిట్టకు చేరుకున్న తరువాత గుండె నొప్పిగా ఉందంటూ ప్రయాణీకులకు చెప్పి బస్సు పక్కన పెట్టాడు. ఆయన అక్కడి నుండి గర్నిమిట్ట ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాడు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌ లో పీలేరుకు తరలించారు. పీలేరు ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటీకే మృతి చెందాడని ధృవీకరించారు. మృతుడు రాజ్‌ గోపాల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మృతుడు విఆర్‌ గోపాల్‌ మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సహ ఆర్టీసీ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తంచేశారు.